తాగునీటి సమస్యతో తల్లడిల్లుతున్న గజ్వేల్ నియోజకవర్గాన్ని గోదారమ్మా కరుణించనుంది. ప్రజలకు గోదావరి నీటిని అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
గజ్వేల్: తాగునీటి సమస్యతో తల్లడిల్లుతున్న గజ్వేల్ నియోజకవర్గాన్ని గోదారమ్మా కరుణించనుంది. ప్రజలకు గోదావరి నీటిని అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన కసరత్తులో సంబంధిత యంత్రాంగం నిమగ్నమై ఉంది. నియోజకవర్గంలోని గజ్వేల్, కొండపాక, జగదేవ్‌పూర్, వర్గల్, ములుగు మండలాల్లో సుమారు 60 కిలోమీటర్ల మేర గోదావరి పైప్‌లైన్ విస్తరించి ఉండగా దీనిని ట్యాప్ చేసి ఇక్కడ దాహార్తి తీర్చడానికి అవసరమైన టీఎంసీల నీటిని తీసుకోనున్నారు. ఈ విషయాన్ని గురువారం గజ్వేల్‌లో పర్యటించిన మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. ‘గోదావరి’ ట్యాపింగ్ అంశంపై ‘సాక్షి’ ప్రచురించిన వరుస కథనాలు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడం గమనార్హం.
జంట నగరాల్లోని కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కాప్రా, మల్కాజిగిరి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంత్లాల్లో తాగనీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు గోదావరి సుజల స్రవంతి పథకాన్ని రూ. 3,375కోట్ల అంచనాల వ్యయంతో అంకురార్పణ చేశారు. కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి 10 టీఎంసీల నీటిని తరలించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 186 కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ను విస్తరించడానికి పనులు వేగంగా సాగుతున్నాయి. కొన్నిచోట్ల పూర్తి కావస్తున్నాయి.
2014లోగా పథకాన్నిపూర్తిచేయాలనే సంకల్పంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో రాజీవ్ రహదారిని ఆనుకుని ఈ పనులు సాగుతున్నాయి. పైప్‌లైన్ విస్తరణ, భూసేకరణ పరంగా గజ్వేల్ నియోజకవర్గంలోనే ఎక్కువ నష్టం జరుగుతోంది. నియోజకవర్గంలోని కొండపాక, జగదేవ్‌పూర్, గజ్వేల్, వర్గల్, ములుగు మండలాల్లో సుమారు 60 కిలోమీటర్ల పొడవునా పైప్‌లైన్ విస్తరించి ఉంది. అదేవిధంగా మొత్తం సేకరిస్తున్న 1,800 ఎకరాల భూమిలో ఈ నియోజకవర్గంలోనే 500 ఎకరాలకు పైగా సేకరించారు.
సింగూరుకు ప్రత్యామ్నాయంగా ‘గోదావరి’....
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీలో దశాబ్దాల కాలంగా నెలకొన్న మంచినీటి సమస్యకు తెరదించేందుకు సింగూరు నుంచి పైప్‌లైన్ ద్వారా ఇక్కడికి నీటిని తీసుకురావాలని తొలుత భావించారు. ఇందుకోసం రూ.150 నుంచి 200 కోట్లు అవసరమవుతుందని, నిధులు విడుదల చేసినా...ఈ పథకం నిర్వాహణకు నెలకు కరెంటు బిల్లుల రూపేణా రూ.కోటికిపైగా చెల్లించాల్సి వస్తుందని అంచనా వేశారు.
నెలకు రూ.కోటి కరెంట్ బిల్లులు చెల్లించాల్సి వస్తే పథకాన్ని నడపటం భారంగా మారుతుందని, ఫలితంగా ప్రజలపై కూడా పన్నులు వేయాల్సిన పరిస్థితి అనివార్యమయ్యే అవకాశముంది. అందువల్లే సింగూరు పథకానికి ప్రత్యామ్నాయంగా ‘గోదావరి’ సుజల స్రవంతి ట్యాపింగ్‌కు ప్రాధాన్యతనిస్తున్నట్లు మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. ఈ పథకం పైప్‌లైన్‌ను ట్యాప్‌చేసి నీటిని పొందగలిగితే గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీలో మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడమేకాక నియోజకవర్గంలో దాహార్తితో అల్లాడుతున్న మరికొన్ని గ్రామాలకు కూడా మంచినీటిని అందించవచ్చని భావిస్తున్నారు.
ఈ అంశాన్ని పలు సందర్భాలలో ‘సాక్షి’ వరుస కథనాలను ప్రచురించడం, ఈ వ్యవహారంపై సీఎం దృష్టికి వెళ్లడంతో తాజాగా ఆదేశాలు వెలువడ్డాయి. గజ్వేల్ నియోజకవర్గ రూపురేఖలు మార్చడమే కాకుండా, మరో రెండేళ్ల తర్వాత తన సొంత నియోజకవర్గంలో మంచినీటి సమస్య కారణంగా మహిళలు ఖాళీబిందెలతో రోడ్డెక్కితే తన పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్ జూన్ 4న గజ్వేల్‌లోని ప్రజ్ఞాగార్డెన్స్‌లో నిర్వహించిన సమీక్షలో సంచలన ప్రకటన చేసిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో నియోజకవర్గంలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనడానికి అవసరమైన మార్గాలను కనుగొనడంలో భాగంగా ‘గోదావరి’ పథకాన్ని వర్తింపజేయడానికి ఆదేశాలిచ్చారు.