ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్ | Sakshi
Sakshi News home page

ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్

Published Sun, Aug 30 2015 1:09 AM

gas connection in every home says civil supply minister etela rajender

  •    20 లక్షల మందికి సర్కారు కానుక
  •      అక్టోబర్ 1 నుంచి ఆహార భద్రతా చట్టం అమలు: ఈటల
  •  సాక్షి, హైదరాబాద్: కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ఆడపడుచులందరికీ వంట గ్యాస్ కనెక్షన్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కానుక ఇవ్వబోతున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. శనివారం జాయింట్ కలెక్టర్లు, డీఎస్‌వోలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో గ్యాస్ కనెక్షన్ల పంపిణీని ప్రారంభించామని.. త్వరలో మిగతా జిల్లాల్లోనూ ప్రారంభించి, నాలుగు నెలల్లోగా అందరికీ మంజూరు చేస్తామని తెలిపారు. ఈ 20 లక్షల గ్యాస్ కనెక్షన్లలో కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌పీ) కింద కేంద్ర ప్రభుత్వం 10 లక్షల కనెక్షన్లు అందజేయనుందని... మిగతా 10 లక్షల కనెక్షన్లకు అయ్యే రూ.150 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించనుందని వెల్లడించారు. రాష్ట్రంలోని కుటుంబాలతో పాటు ప్రభుత్వ హాస్టళ్లు, మధ్యాహ్న భోజనం అందించే పాఠశాలలు, అంగన్‌వాడీ కేం ద్రాలకు కూడా గ్యాస్ కనెక్షన్లు అందజేస్తామన్నారు.
     1వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు..
     సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని మంత్రి ఈటల తెలిపారు. ఆయా కుటుంబాలకు ఇచ్చే రేషన్‌కార్డు ధరను రూ.5గా నిర్ణయించామన్నారు. అలాగే రాష్ట్రంలో ఆహార భద్రత చట్టాన్ని అక్టోబర్ 1 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించారు. రేషన్ దుకాణాల స్థాయిలో అక్రమాలను నియంత్రించేందుకు ఆధునిక  సాంకేతికతను వినియోగిస్తున్నామని.. అవకతవకలను అరికట్టడం ద్వారా సుమారు రూ.400 కోట్లు ఆదా చేశామని పేర్కొన్నారు.

Advertisement
Advertisement