‘నువ్వు ఏమైనా జీతాలు ఇస్తున్నావా.. | Gainik Ward Staff Negligence on Pregnant Women Mahabubnagar | Sakshi
Sakshi News home page

ప్రసవ కన్నీళ్లు!

Apr 29 2020 1:05 PM | Updated on Apr 29 2020 1:05 PM

Gainik Ward Staff Negligence on Pregnant Women Mahabubnagar - Sakshi

నేలపైనే పడుకున్న ప్రియాంక

‘నువ్వు ఏమైనా జీతాలు ఇస్తున్నావా.. ఎవరు మాకు చెప్పడానికి ఇక్కడ ప్రసవం చెయ్యం.. హైదరాబాద్‌కు తీసుకుపో..’ ఇవి జనరల్‌ ఆస్పత్రిలోని గైనిక్‌ విభాగంలో పనిచేసే వైద్యసిబ్బంది ప్రసవం కోసం వచ్చిన గర్భిణులు, వారి కుటుంబ సభ్యులతో అంటున్న మాటలు.

ఈ ఫొటోలో కనిస్తున్న గర్భిణి పేరు ప్రియాంక. మహబూబ్‌నగర్‌ పట్టణంలోని టీడీగుట్టకు చెందిన ఈమె మూడో ప్రసవం కోసం ఈనెల 25వ తేదీ ఉదయం జనరల్‌ ఆస్పత్రికి వచ్చింది. కాగా, గతంలోనే వైద్యులు పరీక్షించి మే 2వ తేదీ డెలివరీ సమయం ఇచ్చారు. కాకపోతే ముందే నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఇక్కడికి తీసుకొచ్చారు. దీంతో ఆమెకు లేబర్‌ రూంలో నొప్పులు వస్తున్నాయని చెప్పగా అక్కడ పనిచేసే వైద్యసిబ్బంది సరిగా చూడలేదు. పైగా దూషిస్తూ ‘ఆమెకు ప్రసవం చేయం.. మీరు హైదరాబాద్‌ వెళ్లండి..’ అంటూ ఉచిత సలహా ఇచ్చారు. దీంతో రెండు రోజుల పాటు అక్కడే ఉన్న వారు ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లడానికి మంగళవారం మధ్యాహ్నం ఇంటికి తిరిగి వెళ్లారు.

మహబూబ్‌నగర్‌ క్రైం: రోజురోజుకూ జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి. కరోనా అనుమానితుల శాంపిళ్ల సేకరణ, వారికి అవసరమైన వైద్యం అందించే క్రమంలో ఇతర రోగులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. లాక్‌డౌన్‌ మొదలైన నాటి నుంచి వైద్యసేవల్లో ఇబ్బందులు తలెత్తాయి. వైద్యులు, స్టాఫ్‌నర్సులు, ఇతర సిబ్బందిపై అధికారుల పర్యవేక్షణ కరువై వైద్యం గాడితప్పింది. ముఖ్యంగా నవమాసాలు మోసి ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చే గర్భిణులకు వైద్యులు, సిబ్బంది చుక్కలు చూపుతున్నారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన గర్భిణులు ఆపసోపాలు పడుతున్నారు. ఇక్కడ పనిచేసే వైద్యసిబ్బంది ఇష్టం వచ్చినట్టు దూషిస్తుండటంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఆస్పత్రిలోని గైనిక్‌ వార్డు బయట గర్భిణులు పురిటినొప్పులతో అవస్థలు పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఇక క్యాజువాలిటీ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఏదైనా అత్యవసరమైన వైద్యం కోసం, రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి చికిత్స కోసం వచ్చే రోగులకు సరైన వైద్యం అందడం లేదు.

ఎవరూ ఫిర్యాదు చేయలేదు
వైద్యసిబ్బంది దూషించినట్టు మా దృష్టికి తేలేదు. ఎవరికైనా సరైన వైద్యం అందక ఇబ్బంది పడితే ఫిర్యాదు చేస్తే బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటాం. ప్రతిరోజూ 40 నుంచి 50 వరకు ప్రసవాలు చేస్తున్నాం. ప్రస్తుతం బయట ప్రైవేట్‌ ఆస్పత్రులు లేకపోవడంతో చాలా వరకు అందరూ ఇక్కడికే వస్తున్నారు. ఈనెల 750వరకు ప్రసవాలు చేశాం.– డాక్టర్‌ రామకిషన్,జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement