
జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో
సూర్యాపేట వ్యవసాయం: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో రైతులు రెండో రోజు కూడా ఆందోళన సాగించారు. పంటలకు మద్దతు ధరతోపాటు మార్కెట్‌లో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ, రైతులు శుక్రవారం ఉదయం మార్కెట్ కార్యాలయంలోని చైర్మన్, కార్యదర్శి గదుల్లోకి వెళ్లి కుర్చీలు, అద్దాలను ధ్వంసం చేశారు. అనంతరం హైదరాబాద్–విజయవాడ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. గురువారం లక్ష బస్తాల ధాన్యం రావడంతో వ్యాపారులు క్వింటాల్‌కు రూ.200దాకా ధరలు తగ్గించారు. దీంతో ఆగ్రహించిన రైతులు జాతీయ రహదారిపై రెండు గంటలు రాస్తారోకో చేయడం తెలిసిందే.
మద్దతు ధరపై జేసీ ఆదేశాలు శుక్రవారం అమలు కాకపోవడంతో రైతులు మళ్లీ రోడ్డెక్కారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ సురేంద్రమోహన్ రైతుల వద్దకు వచ్చి వారిని శాంతింపజేశారు. అనంతరం మార్కెట్‌లో రైతులు, వ్యాపారులతో సమావేశమయ్యారు. వ్యాపారులకు తక్కువ ధరలకు అమ్ముకోవడానికి ఇష్టం లేని రైతుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలుకు రూ.1,590 ధరతో కొనుగోలు చేయిస్తామని ప్రకటించారు.