మ‘రుణ’ శాసనం | Family Suicide Attempt in Miryalaguda Due to Debt | Sakshi
Sakshi News home page

మ‘రుణ’ శాసనం

Jul 25 2019 8:42 AM | Updated on Jul 25 2019 8:43 AM

Family Suicide Attempt in Miryalaguda Due to Debt - Sakshi

లోకేశ్వర్‌ కుటుంబ సభ్యులు తాగిన కూల్‌డ్రింక్, పురుగుల మందుడబ్బా

ఉన్నత చదువులు చదివిన అతను మొదట్లో ఓ ప్రైవేట్‌ పవర్‌ ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు.. ఉన్నట్టుండి ఆ పవర్‌ ప్లాంట్‌ నష్టాల్లో కూరుకుపోవడంతో కొందరు ఉద్యోగులపై వేటు తప్పలేదు. దీంతో అతను కుటుంబాన్ని పోషించుకునేందుకు ఓ రైస్‌మిల్లులో గుమాస్తాగా కుదిరాడు. చాలీచాలని వేతనం.. అది కూడా సమయానుకూలంగా ఇవ్వకపోవడంతో అక్కడ ఇమడలేకపోయాడు. దీంతో పూట గడవడమే కష్టంగా మారడంతో స్నేహితుల వద్ద అప్పులు చేశాడు. కాలం గడిచిపోతున్నా.. చేసుకునేందుకు పని లేక ఆత్మన్యూనతా భావంతో కుమిలిపోయాడు. చేసిన అప్పులు తిరిగి చెల్లించే స్థోమత లేకపోవడంతో ఆ కుటుంబంలో ముగ్గురు కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని మరణ శాసనం లిఖించుకున్నారు. మిర్యాలగూడలో చోటు చేసుకున్న విషాదకర ఘటన వివరాలు..

మిర్యాలగూడ అర్బన్‌ : పట్టణంలోని సంతోనగర్‌లో నివాసం ఉంటున్న రిటైర్డ్‌ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ పారేపల్లి సురేందర్‌కు ఇద్దరు కుమారులు.వారిలో చిన్న కుమారుడు పారేపల్లి లోకేశ్వర్‌(45) బీకాం, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాడు. లోకేశ్వర్‌కు  నల్లగొండకు చెందిన చిత్రకళ(36)తో  11ఏళ్ల క్రితం వివాహం అయింది. వీరికి లోహిత్‌కుమార్‌(12 ), విగ్నేష్‌ ఇద్దరు కుమారులున్నారు. లోకేశ్వర్‌ ఎనిమిదేళ్లుగా వాడపల్లిలోని పవర్‌ప్లాంట్‌లో పనిచేశాడు. సంస్థ నష్టాల్లో కూరుకుపోవడంతో జీతాలు చెల్లించలేని స్థితిలో ఏడాది క్రితం కొందరు ఉద్యోగులను తొలగించింది. అందులో లోకేశ్వర్‌ కూడా ఉన్నాడు.

అప్పటి వరకు సాఫీగా సాగిపోతున్న జీవనగమ నం ఒక్కసారిగా అతలాకుతలమైంది. తన చదువుకు సరికాకపోయిన కుటుంబాన్ని పోషించుకునేందుకు లోకేశ్వర్‌ పట్టణంలోని ఓ రైస్‌ మిల్లులో గుమాస్తాగా మారాడు. చాలీచాలని వేతనంతో ఇంటి అద్దె కూడా భారం కావడం, కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నానన్న బాధతో కుమిలిపోయాడు. కుటుంబ పోషణ నిమిత్తం స్నేహితుల వద్ద అప్పులు చేశాడు. కుమారుడి ఆర్థిక ఇబ్బందులను గుర్తించిన తండ్రి పారేపల్లి సురేందర్‌ కుమారుడి కుటుంబాన్ని తీసుకువచ్చి తన వద్దే ఉంచుకుంటున్నాడు.

తల్లిదండ్రి పెద్దకుమారుడి ఇంటికి వెళ్లగా..
పారేపల్లి సురేందర్‌ పెద్దకుమారుడు గురుప్రసాద్‌ నల్లగొండలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. కాగా, పారేపల్లి సురేందర్‌ తన భార్యతో కలిసి మంగళవారం పెద్ద కుమారుడి ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో ఎక్కడ ఉద్యోగం లేక ఇళ్లు గడవక, అప్పులు తీర్చలేక  కొద్ది రోజులుగా తీవ్ర మనస్తాపంతో ఉన్న లోకేశ్వర్‌ రాత్రి 11గంటల సమయంలో పురుగుల మందుతో పాటు కూల్‌డ్రింక్‌ తీసుకుని ఇంటికి వచ్చాడు. అప్పటికే చిన్న కుమారుడు విగ్నేష్‌ నిద్రపోగా భార్య చిత్రకళ, పెద్దకుమారుడు లోహిత్‌తో కలిసి తనూ పురుగుల మందు కలిపిన కూల్‌డ్రింక్‌ తాగారు.

సోదరికి ఫోన్‌ చేసి..
అనంతరం అర్ధరాత్రి 2గంటల సమయంలో హైదరాబాద్‌లో ఉంటున్న తన సోదరికి ఫోన్‌చేసిన లోకేశ్వర్‌ తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పి ఫోన్‌ కట్‌ చేశాడు. కంగారుపడిన లోకేశ్‌ అక్క నల్లగొండలో ఉన్న సోదరుడికి ఫోన్‌చేసి విషయం చెప్పింది. వెంటనే  100కు ఫోన్‌చేసి విషయం చెప్పారు. ఫోన్‌కాల్‌తో అప్రమత్తమైన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోగా అప్పటికే చిత్రకళ, లోహిత్‌లు మృతి చెందారు. అపస్మారక స్థితిలో ఉన్న లోకేశ్వర్‌ను 108 సహాయంతో ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం పట్టణంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం లోకేశ్వర్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

తెలుసుకున్న పారేపల్లి సురేందర్‌ సహా అతడి కుటుంబ సభ్యులు ఉదయం ఇంటికి చేరుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ సదానాగరాజు, శ్రీనివాస్‌రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ పి.శ్రీనివాస్‌ ఏరియా ఆస్పత్రిలోని మృతదేహాలను పరిశీలించారు. అనంతరం మృతుల ఇంటికి వెళ్లి ఆత్మహత్యకు గత కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

మమ్మల్ని క్షమించండి
‘‘తాము ఆత్మహత్య చేసుకుంటున్నాం.. మమ్మల్ని క్షమించండి.. నాన్నా  స్నేహితుల వద్ద అప్పు చేశాను. వారికి ఆ డబ్బు చెల్లించండి’’ అంటూ లోకేశ్వర్‌ సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. ఆ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement