నేతల నోట.. ‘నాయిని’ మాట

Every Mouth Of The Leaders ..Naini Rajender Reddy - Sakshi

పశ్చిమ టిక్కెట్‌పై హామీలు

నేరుగా పీసీసీ చీఫ్‌కే విన్నపాలు

చర్చగా మారిన ‘పశ్చిమ’ రాజకీయం

సాక్షి ప్రతినిధి, వరంగల్‌ : ప్రజా చైతన్యయాత్ర బహిరంగ సభలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డికి రాష్ట్ర నేతలు హామీలు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ సభలో ప్రసంగించిన నేతలు నాయిని రాజేందర్‌రెడ్డి భవిష్యత్‌ విషయంలో స్పష్టత ఇవ్వాల్సిందిగా వేదికపైనే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోరారు. దీంతో పీసీసీ ఛీప్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ‘కష్టకాలంలో పనిచేసిన ఎవ్వరీని మర్చి పోం. నాలుగేళ్ల క్రితం అధికారం కోల్పోయినప్పుడు కాంగ్రెస్‌ పార్టీ ఎలా ఉండేది. ఇప్పుడు ఎలా పటిష్టంగా ఉందో చూస్తున్నాం. రాజేందర్‌రెడ్డిలాంటి నేతలు కేసులకు వెరవకుండా కష్టపడి పని చేశారు. వారి కష్టాన్ని తప్పకుండా గుర్తిస్తాం’ అని హామీ ఇచ్చారు. అంతకు ముందు వీహెచ్‌ మాట్లాడుతూ చాలా మంది పార్టీలోకి వస్తున్నారు.

వాళ్లను రమ్మనండి, కానీ పార్టీ జెండాలను మోసే వాళ్లను గుర్తించాలి. కేసులను ఎదుర్కొని నిలబడ్డ రాజేందర్‌రెడ్డిలాంటి వాళ్లను పార్టీ గుర్తించాలి. వచ్చీ రాంగనే కుర్చీల కూసుంటనంటే కుదరదు’ అని వేదికపైనే అన్నారు. ఆ తర్వాత సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ నాయిని రాజేందర్‌రెడ్డిని ఎమ్మెల్యే చేద్దామా ? వద్దా ? అని సభికులను ప్రశ్నించారు. నాయినికి టిక్కెట్‌ ఇవ్వాలంటూ వేదిక మీద నుండే నేరుగా పార్టీ పెద్దలను అడుగుతున్నానని చెప్పారు. ఈ విషయంపై నేరుగా సోని యాగాంధీతో మాట్లాడుతానన్నారు. జెండా మోశా డు.. కష్టపడ్డాడు.. ఖర్చుపెట్టాడు.. అతడికి టికెట్‌ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతానని చెప్పారు. చివర్లో శాసనమండలిలో కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌అలీ మాట్లాడుతూ కష్టకాలంలో పార్టీని నడిపించిన రాజేందర్‌రెడ్డికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చివరగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ‘కాంగ్రెస్‌ పార్టీ, సోనియా గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేవారని, తనకు అత్యంత సన్నిహితులైన వేం నరేందర్‌రెడ్డి, సీతక్కతో పార్టీలో చేరామని, కాంగ్రెస్‌లో తమకు న్యాయం జరుగుతుంది’ అని చెప్పడం కొసమెరుపు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top