ఆరోగ్య తెలంగాణే ధ్యేయం

Etela Rajender comments In Kakatiya Medical College  - Sakshi

కాకతీయ మెడికల్‌ కాలేజీ వజ్రోత్సవాల్లో మంత్రి ఈటల 

సాక్షి ప్రతినిధి, వరంగల్‌:  వైద్యరంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఆరోగ్య తెలంగాణే తమ ధ్యేయమని చెప్పారు. వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కాలేజీ (కేఎంసీ) వజ్రోత్సవాలను  శనివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఈటల మాట్లాడుతూ.. వైద్య రంగం పురోభివృద్ధిలోనూ తెలంగాణ తనదైన ముద్ర వేస్తోందని చెప్పారు. కంటి వెలుగు, డయాలసిస్‌ కేంద్రాలు, కేసీఆర్‌ కిట్, అధునాతన ఐసీయూలు, ఆస్పత్రుల ఆధునీకరణ, మౌలిక సదుపాయాలు ఇలా పేద ప్రజల ఆరోగ్య సంరక్షణకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి వివరించారు. ‘తెలంగాణకు ఆర్థిక పరిపుష్టి లేదని, మరింత వెనకబడుతోందని ఆనాడు కొందరు దుష్ప్రచారం చేశారు. నాటికీ నేటికీ వ్యత్యాసం గమనించండి.

ఈ ఐదేళ్లలో తెలంగాణకు ప్రపంచ స్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు వచ్చింది’అని మంత్రి పేర్కొన్నారు. అన్ని రోగాలకు తాగునీరు కారణమని భావించి రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి శుద్ధమైన తాగునీరు అందించేందుకు మిషన్‌ భగీరథ చేపట్టినట్లు తెలిపారు. సహ విద్యార్థులు ఒకే చోట కలుసుకోవడం గొప్ప అనుభూతి అని, ఏ స్థాయి, హోదాలో ఉన్నా అరేయ్‌ అని పిలిచే అధికారం ఒక్క క్లాస్‌మేట్‌కు మాత్రమే ఉంటుందని చెప్పారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ డాక్టర్‌ వృత్తి దేవుడు ఇచ్చిన వరం లాంటిదన్నారు. సంపాదన కంటే పేదలకు వైద్యం చేసి వారిని బతికించడంలోనే ఎక్కువ తృప్తి ఉంటుందన్నారు. 22 ఏళ్ల క్రితం కోరగానే రూ.కోటి విరాళం అందజేసిన లక్కిరెడ్డి అనుమరెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది ముం దుకు రావాలని ఆయన కోరారు. ఎంజీఎం ఆస్పత్రి అభివృద్ధికి ప్రభుత్వం తోపాటు ఎన్నారైలు తోడ్పా టు అందించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీలు పసునూరి దయాకర్, బండా ప్రకాష్, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ , కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ కరుణాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top