వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విద్యుత్‌ చార్జీల పెంపు!

Electricity Charges Will Increase From April Says Telangana Government - Sakshi

వార్షిక బడ్జెట్‌ అంచనాలపై డిస్కంల కసరత్తు

ఈ నెలాఖరుతో ముగియనున్న కొత్త టారిఫ్‌ ప్రతిపాదనల గడువు

మున్సిపోల్స్‌ ముగిసేవరకు గడువు పొడిగింపు కోరనున్న డిస్కంలు

ఎన్నికలు ముగిసిన వెంటనే చార్జీల పెంపునకు చర్యలు

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఏడాది రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీలు పెరగడం లాంఛనమేనని తెలుస్తోంది. రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలు ముగిసిన వెంటనే విద్యుత్‌ టారీఫ్‌ పెంపు ప్రతిపాదనలను తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలికి (ఈఆర్సీ) సమర్పించేందుకు రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కం) నిరీక్షిస్తున్నాయి. డిస్కంల ఆర్థిక లోటు ఏటేటా పెరిగిపోతుండటంతో సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి రాష్ట్రంలో విద్యుత్‌ కోతలను అధిగమించి నిరంతర విద్యుత్‌ సరఫరా అందించడానికి డిస్కంలు భారీగా విద్యుత్‌ కొనుగోళ్లు కొనసాగిస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయానికి ఉచిత్‌ విద్యుత్‌ సరఫరాను 24 గంటలకు పొడిగించాయి. దీంతో డిస్కంలపై ఆర్థిక భారం భారీగా పెరిగింది. రాష్ట్రంలో వరుస ఎన్నికలు రావడంతో గత మూడేళ్లుగా విద్యుత్‌ చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం అనుతించలేదు. ఇక ఒక్క మున్సిపల్‌ ఎన్నికలు మాత్రమే మిగిలి ఉండగా, మరో నాలుగైదు ఏళ్ల వరకు రాష్ట్రం లో మరే ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికలు ముగిసిన వెంటనే విద్యుత్‌ చార్జీల పెంపును ప్రతిపాదించేందుకు డిస్కంలు సమాయత్తమయ్యాయి.

ఏటా నవంబర్‌లోగా నివేదిక.. 
ప్రతి ఏటా నవంబర్‌లోగా డిస్కంలు వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తమ వార్షిక ఆదాయ అవసరాల అంచనా నివేదికను (ఏఆర్‌ఆర్‌) ఈఆర్సీకి సమర్పించాలని కేంద్ర విద్యుత్‌ చట్టం పేర్కొంటోంది. ప్రస్తుత విద్యుత్‌ చార్జీలను వచ్చే ఆర్థిక సంవత్సరంలో యథాతథంగా కొనసాగిస్తే ఏర్పడనున్న ఆర్థిక లోటు, దీనిని అధిగమించేందుకు పెంచాల్సిన విద్యుత్‌ చార్జీల అంచనాలను ఈ నివేదికలో పొందుపరుస్తాయి. 2020–21కి సంబంధించిన ఏఆర్‌ఆర్‌ నివేదికను ఈ నెలాఖరుతో డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాల్సి ఉండగా, మున్సిపల్‌ ఎన్నికలు ముగిసే వరకు డిస్కంలు వాయిదా వేసుకునే అవకాశాలున్నాయి. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏఆర్‌ఆర్‌ను సైతం డిస్కంలు ఈఆర్సీకి సమర్పించలేదు.

దీంతో ఎలాంటి మార్పుల్లేకుండా విద్యుత్‌ చార్జీల్లో యథాతథంగా అమలవుతున్నాయి. ప్రస్తుతానికి మున్సిపల్‌ ఎన్నికలు ముగిసిన వెంటనే ఏఆర్‌ఆర్‌ నివేదికతో పాటు చార్జీల పెంపు ప్రతిపాదనలను ఈఆర్సీకి సమర్పించడం ఖాయ మని దక్షిణ డిస్కం (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) వర్గాలు పేర్కొన్నాయి. ఒకటి రెండు నెలల్లో మున్సిపల్‌ ఎన్నికలు ముగిస్తే వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి చార్జీల పెంపు అమల్లోకి రావచ్చు. ఒకవేళ ఎన్నికలు ఆలస్యమైతే జూన్‌ నుంచి చార్జీల పెంపును అమలు చేసే అవకాశముంది.

ఈఆర్సీ అంకెల గారడీతో మరింత సంక్షోభం.. 
ప్రస్తుత చార్జీలను యథాతథంగా కొనసాగిస్తే 2018–19లో రూ.9,970.98 కోట్ల ఆర్థిక లోటు ఏర్పడనుందని గతంలో ఈఆర్సీకి సమర్పించిన ఏఆర్‌ఆర్‌ నివేదికలో డిస్కంలు అంచనా వేశాయి. సాగుకు ఉచిత విద్యుత్‌ సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు పోగా మిగిలిన లోటును విద్యుత్‌ చార్జీల పెంపుతో పూడ్చుకోవాలని డిస్కంలు భావించాయి. ఎన్నికలు దగ్గర్లో ఉండటంతో విద్యుత్‌ చార్జీల పెంపునకు ప్రభుత్వ అను మతి లభించలేదు.

ఆ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రూ.4,980 కోట్ల విద్యుత్‌ రాయితీలు కేటాయించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, డిస్కంల ఆర్థిక లోటు అంచనాలను రూ. 9,970.98 కోట్ల నుంచి రూ. 5,980 కోట్లకు ఈఆర్సీ తగ్గించింది. ఆర్థిక లోటు పెద్దగా లేదని, చార్జీలు పెంచాల్సిన అవసరం లేదని పేర్కొంటూ పాత చార్జీలను కొనసాగించా లని 2018–19 టారీఫ్‌ ఉత్తర్వులు జారీ చేసిం ది. 2018–19 ముగిసేసరికి డిస్కంల ఆర్థిక లోటు రూ. 5,000 కోట్లకు చేరిందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top