నిర్లక్ష్యంతో నిధుల గల్లంతు..?! | due to the irresponsibility of the authorities funding threat | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యంతో నిధుల గల్లంతు..?!

May 19 2015 5:08 AM | Updated on Sep 3 2017 2:17 AM

వరంగల్ నగరపాలక సంస్థ అధికారుల బాధ్యతారాహిత్యం కారణంగా కేంద్రం నుంచి రావాల్సిన రూ. 20 కోట్ల నిధులు గల్లంతయ్యే ప్రమాదం ఏర్పడింది...

- యూసీ సమర్పించడంలో బల్దియా జాప్యం
- కన్నెర్ర చేసిన కేంద్ర ప్రభుత్వం
- రూ. 20 కోట్లపై నీలినీడలు
- మధ్యలో ఆగిన 60 పనులు
- జనరల్ ఫండ్ వైపు చూపులు
సాక్షి, హన్మకొండ :
వరంగల్ నగరపాలక సంస్థ అధికారుల బాధ్యతారాహిత్యం కారణంగా కేంద్రం నుంచి రావాల్సిన రూ. 20 కోట్ల నిధులు గల్లంతయ్యే ప్రమాదం ఏర్పడింది. ఈ నిధుల ఆధారంగా చేపడుతున్న అరవైకి పైగా వివిధ రకాల పనులు మధ్యలో ఆగిపోయాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కేంద్ర నిధులతో చేపట్టాల్సిన పనులు జనరల్ ఫండ్ ద్వారా చేపట్టేందుకు బల్దియా వ్యూహరచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

యూసీ సమర్పించడంలో నిర్లక్ష్యం..
పద మూడో ఆర్థిక ప్రణాళిక కింద ఐదేళ్ల కాలవ్యవధి (2010-15)లో వివిధ అభివృద్ధి పథకాల కోసం కార్పొరేషన్ అధికారులు రూ. 51.31 కోట్ల విలువైన ప్రతిపాదనలు రూపొందిం చారు. అయితే వీటి ప్రకారం కేంద్రం ఒక్కో ఆర్థిక సంవత్సరానికి విడతల వారీగా నిధులు మంజూరు చేసింది. గత నాలు గేళ్లలో రూ.35.56 కోట్లు విడుదలయ్యాయి. కాగా, ఈ నిధులు ఖర్చు చేసిన విధానంపై ధ్రువీకర ణ పత్రాన్ని(యుటిలిటీ సర్టిఫికెట్, యూసీ) కార్పొరేషన్ అధికారులు కేంద్రానికి సమర్పించలేదు. నాలుగేళ్లకు సంబంధించి రూ 35.56 కోట్లు ఖర్చు చేసిన అధికారులు కేవలం రూ .2.38 కోట్లకు సంబంధించిన యూసీలనే కేంద్రానికి పంపించారు.

దాంతో చివరిదైన 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ 16.73 కోట్లను కేంద్రం విడుదల చేయకుండా నిలిపేసింది. మరోవైపు ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో పద మూడో ఆర్థిక ప్రణాళిక కింద కార్పొరేషన్‌కు రావాల్సిన రూ 16.73 కోట్ల నిధుల విడుదలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇదే తరహా పొరపాటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం(బీఆర్‌జీఎఫ్) నిధుల విషయంలో దొర్లడంతో రూ 3.23 కోట్ల నిధులు వెనక్కి వెళ్లాయి. బీఆర్‌జీఎఫ్ కింద ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.7.38 కోట్లకు మంజూరు చేయాల్సి ఉండగా... ఇప్పటి వరకు రూ.4.15కోట్ల నిధులు విడుదలయ్యాయి. మిగిలిన రూ. 3.23 కోట్ల నిధులు ఇవ్వలేమంటూ కార్పోరేషన్ అధికారులకు కేంద్రం లేఖను పంపింది.

జనరల్ ఫండ్‌కు ఎసరు..!
బీఆర్‌జీఎఫ్, పదమూడో ఆర్థిక సంఘం ద్వారా రావాల్సిన నిధులు మొత్తం రూ.19.96 కోట్లు నిలిచిపోవడంతో వాటి ఆధారంగా చేపడుతున్న పనులు ఏ విధంగా పూర్తి చేయాలనే అంశం పై కార్పొరేషన్ అధికార యంత్రాంగం తర్జనభర్జన పడుతోంది.  అయితే నిధుల ఆధారంగా చేపడుతున్న అరవైకి పైగా అభివృద్ధి పనులు మధ్యలో ఆగిపోయాయి. ఇప్పటివరకు జరిగిన పనులకు బిల్లుల చెల్లింపు, సగంలో ఆగిన పనులు ఏ రకంగా పూర్తి చేయాలనే అంశంపై కార్పొరేషన్ అధికారులు కిందా మీదా అవుతున్నారు. చివరకు ఈ బిల్లుల చెల్లింపునకు జనరల్ ఫండ్ నిధుల ద్వారా చెల్లించేందుకు పావులు కదుపుతున్నారు. సాధారణంగా జనరల్ ఫండ్‌ను అత్యవసర పనులు, సిబ్బంది జీతభత్యాలు చెల్లింపులకే ఉపయోగించాలి. కానీ తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు జనరల్ ఫండ్ నిధులపై కన్నేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement