ఆ జన్యువే కాపాడుతుందేమో?

Dr CH Raju Special Interview With Sakshi About Coronavirus

సాక్షి ఇంటర్వూ్యలో ప్రముఖ శ్వాసకోశ వ్యాధి నిపుణుడు డాక్టర్‌ సీహెచ్‌ రాజు

యువత, శీతోష్ణ పరిస్థితులతోపాటు మన జన్యువూ ‘కరోనా’ నుంచి రక్షిస్తోంది

శాస్త్రీయంగా నిరూపితం కావాల్సి ఉంది

పాజిటివ్‌ నుంచి నెగెటివ్‌ వచ్చిన వారి సీరమ్‌ను ప్లాస్మా థెరపీ చేస్తే ప్రయోజనం

ఫిజికల్‌ డిస్టెన్స్‌ తప్ప దీనికి ప్రిస్క్రిప్షన్‌ లేదు

50 ఏళ్లు దాటిన వారు అస్సలు బయటకు రావద్దు.. పాల ప్యాకెట్లతో జాగ్రత్త

పాశ్చాత్య దేశాల కన్నా మన దేశంలోనే నియంత్రణ చర్యలు బాగున్నాయి

ఇదే స్ఫూర్తి కొనసాగిస్తే జూన్‌కల్లా పరిస్థితి కొలిక్కి 

యువత ఎక్కువగా ఉండటం, దేశంలోని శీతోష్ణ పరిస్థితులే కాకుండా జన్యుపరంగా మనకున్న బలమే దేశాన్ని కరోనా వైరస్‌ నుంచి కాపాడుతోందని అంటున్నారు ప్రముఖ శ్వాసకోశ వ్యాధి నిపుణుడు డాక్టర్‌ సీహెచ్‌ రాజు. ఈ జన్యువే కరోనా వైరస్‌ను భారతీయుల శరీరాల్లోకి చొరబడి విధ్వంసం చేయనీయకుండా అడ్డుకుంటోందనే వాదన వైద్య వర్గాల్లో ఉందని, అయితే ఇది శాస్త్రీయంగా నిరూపితం కావాల్సి ఉందని చెప్పారు. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే దేశంలో లాక్‌డౌన్‌ బాగా అమలవుతోందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని అభిప్రాయపడ్డారు. ఇదే స్ఫూర్తిని ప్రజలు కొనసాగిస్తే దేశంలో జూన్‌ కల్లా కరోనా మహమ్మరి ఓ కొలిక్కి వస్తుందంటున్న డాక్టర్‌ రాజు గురువారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వూ్య ఇచ్చారు. ఈ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

ముందు ఊపిరితిత్తులపైనే.. 
కరోనా వైరస్‌ మనిషి శరీరంలోని అన్ని అవయవాలపై ప్రభావం చూపుతుంది. ఇదే కాదు ఫ్లూ సంబంధిత వైరస్‌లన్నీ తొలుత ప్రభావం చూపేది ఊపిరితిత్తులపైనే. ఊపిరితిత్తుల్లో ఈ వైరస్‌ పొదిగి ఆ తర్వాత వ్యాప్తి చెందిన తర్వాత ద్రవంలాగా పేరుకుపోయి న్యుమోనియాకు దారి తీస్తుంది. ఆ తర్వాత ఇది అన్ని అవయవాలపై ప్రభావం చూపుతుంది.

దీనికి శాస్త్రీయత లేదు.. 
మానవ శరీరానికి ఫ్లూ సోకినప్పుడు తీవ్రమైన జ్వరం, దగ్గు రావడం సర్వసాధారణం. మనం డెంగీ, వైరల్‌ జ్వరాల విషయంలో కూడా ఇదే గమనించాం. 3, 4 రోజుల పాటు తీవ్ర జ్వరం వస్తుంది. ఇది సాధారణ లక్షణమే. ఈ వైరస్‌ను చంపేందుకు శరీరం జ్వరం బారిన పడుతుందన్నది వాస్తవం కాదు. శరీరం ప్రతిస్పందించే తీరు అలానే ఉంటుంది. కానీ జ్వరంతో వైరస్‌లు చనిపోవు. దీనికి ఎలాంటి శాస్త్రీయత లేదు.

ప్రిస్క్రిప్షన్‌ లేదు.. 
ఈ వైరస్‌ నియంత్రణకు ఫిజికల్‌ డిస్టెన్స్‌ (భౌతిక దూరం) తప్ప ప్రిస్క్రిప్షన్‌ (మందులు) లేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్నది హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఒక్కటే. అది కూడా వైరల్‌ యాక్టివిటీని మాత్రమే కంట్రోల్‌ చేస్తుంది. స్వైన్‌ఫ్లూ లాగా దీనికి ఫలానా మందు అనేది ఇంకా రాలేదు. అయితే, కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి నెగెటివ్‌ ఎలా వస్తుంది.. వైరస్‌ చనిపోతేనే కదా నెగెటివ్‌ వచ్చేది.. అనే సందేహం వస్తుంది.

2 రకాల యాంటీబాడీలుంటాయి.. 
ఈ వైరస్‌ పొదిగే కాలం అయిపోయిన తర్వాత శరీరంలోని ఇమ్యూనోగ్లాబ్యూల్స్‌ పెరగటంద్వారా వైరల్‌ లోడ్‌ తగ్గిపోతుంది. అప్పుడు యాంటీ వైరల్‌ డ్రగ్స్‌ వాడటం వలన ఐజీ–జీ, ఐజీ–ఎం అనే రెండు రకాల యాంటీబాడీలు శరీరంలో వేగంగా, నెమ్మదిగా రెండు పద్ధతుల్లో రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేస్తాయి. అప్పుడు పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులకు నెగెటివ్‌ వస్తుంది. వైరల్‌ యాక్టివిటీ మాత్రమే కంట్రోల్‌ అవుతుంది. పొదిగే కాలం అయిపోతుంది కనుక మళ్లీ ఆ వైరస్‌ శరీరంలో వృద్ధి చెందే అవకాశం ఉండదు.

మన జనాభాకు, కేసులకు పొంతన లేదు 
మన దేశంలో ఈ వైరస్‌ వ్యాప్తి, నియంత్రణను వివిధ కోణాల్లో చూడాల్సి వస్తుంది. వాస్తవానికి, మన దేశ జనాభాకు, నమోదవుతున్న కేసులకు పొంతన లేదు. అదే పాశ్చాత్య దేశాల్లో తక్కువ జనాభా ఉన్నా వైరస్‌ సోకడం, సంక్రమణ భారీగా ఉంటోంది. మరణాలు కూడా అంతే ఉన్నాయి. కానీ, పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మన ప్రభుత్వాలు మంచి చర్యలు తీసుకుంటున్నాయి. లాక్‌డౌన్‌ను మన ప్రజలు చాలా వినమ్రంగా పాటిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అమెరికా లాంటి దేశాల్లో లాక్‌డౌన్‌ విధించేందుకు భయపడుతున్నారు. సింగపూర్‌లో లాక్‌డౌన్‌ బాగా అమలైంది. చైనాలో ఇంకా పటిష్టంగా అమలు చేశారు. మన దగ్గర కూడా బాగా అమలవుతోంది. ఇదే స్ఫూర్తి కొనసాగితే జూన్‌ మాసం కల్లా కొలిక్కి రావచ్చు.

వృద్ధులూ.. జర జాగ్రత్త! 
పరిస్థితి ఎలా ఉన్నా.. ఎప్పటికి అదుపులోకి వచ్చినా వయసు మీద పడిన వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు 50 దాటిన వాళ్లు బయటకు రాకపోవడమే మంచిది. కుటుంబసభ్యుల్లో ఎవరికైనా కొంచెం జలుబున్నా వారి దగ్గరకు కూడా వెళ్లొద్దు. వాస్తవానికి వైరస్‌ సోకిన వారే మాస్కులు పెట్టుకోవాలి కానీ, వృద్ధులు కచ్చితంగా మాస్కులు పెట్టుకుంటేనే మంచిది. మాస్క్‌ ఏదైనా ఫర్వాలేదు.. మంచి కర్చీఫ్‌ కట్టుకున్నా ఓకే. అటు దేశంలో ఇటు రాష్ట్రంలో వైరల్‌ లోడ్‌ పెరుగుతోంది కాబట్టి ఇప్పుడే అందరూ జాగ్రత్తగా ఉండాలి.

చేతులు కడుక్కోవడం, మనం తరచూ ముట్టుకునే ప్రదేశాల పట్ల అప్రమత్తంగా ఉండటం శ్రేయస్కరం. ఇక పాల ప్యాకెట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి నేరుగా మన ఇంట్లోకి వైరస్‌ తీసుకొచ్చే ప్రమాదముంది. పాల ప్యాకెట్లు తీసుకున్న తర్వాత మీ చేతులతో పాటు వాటిని కూడా శుభ్రంగా కడగండి. 2 గంటల తర్వాతే మళ్లీ వాటిని ముట్టుకోండి. గాలి ద్వారా ఈ వైరస్‌ సోకే అవకాశం లేదు. ఈ వాదనలో కూడా శాస్త్రీయత లేకపోయినా గాలి ద్వారా వ్యాపించే అవకాశం ఉంటే దేశం పరిస్థితి ఇలా ఉండేది కాదు. కేవలం తుంపర్ల ద్వారా ఇది సంక్రమిస్తుంది. వాటిని నియంత్రించగలిగితే చాలు.

హోం రెమెడీస్‌ ఉన్నాయ్‌
ఈ వైరస్‌ సోకకుండా రోగనిరోధక శక్తి పెంచుకునే అవకాశం లేదు. కానీ, శరీరంలోని యాంటీబాడీస్‌ వృద్ధికి కొన్ని హోం రెమెడీస్‌ ఉన్నాయి. విటమిన్‌ సీ ఉన్న పదార్థాలు తీసుకోవడం, నీళ్లు ఎక్కువగా తాగడం, జింక్‌ సప్లిమెంట్స్‌ తీసుకోవడం లాంటివి ఉన్నాయి. కానీ, ఈ వైరస్‌ సోకడంపై శారీరక ఉత్సుకత అవసరం లేదు. అలా యాంగ్జైటీకి గురైన వారు ఈ వైరస్‌ బారిన పడే అవకాశమూ లేకపోలేదు. తినకుండా, నిద్రపోకుండా వైరస్‌ గురించే ఆలోచించడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. తద్వారా ఏ చిన్న అవకాశం ఉన్నా వైరస్‌ శరీరంలోకి ప్రవేశిస్తుంది.

భారతీయుల సంజీవని అదేనేమో?
ఇప్పుడు మనదేశంలో దీనిపైనే పరిశోధనలు ప్రారంభించా రు. పాజిటివ్‌ వచ్చి చికిత్స తీసుకున్న అనంతరం నెగెటివ్‌ వచ్చిన వారి సీరమ్‌పై ఈ పరిశోధన లు బెంగళూరులో ప్రారంభమయ్యాయని వార్తలు వస్తున్నా యి. ఈ వ్యక్తుల సీరమ్‌ను ప్లాస్మా థెరపీ చేస్తే ప్రయోజనం ఉంటుందని నా అభిప్రాయం. దేశంలో యువత ఎక్కువగా ఉండటం, వెచ్చని వాతావరణం వల్ల కరోనా బాధితులు, మృతుల సంఖ్య తక్కువేననే వాదన ఉంది. దీన్ని కాదనలేం.. ఎందుకంటే ఇటలీ, స్పెయిన్‌ లాంటి దేశాల్లో వృద్ధులు ఎక్కువగా ఉండటంతో పాటు చల్లని వాతావరణం కూడా తోడవ్వడంతో ఎక్కువ మంది చనిపోతున్నారు. ఇక దేశంలో ఉన్న వేడి వాతావరణానికి వైరస్‌ వ్యాప్తి చెందొద్దు.

కానీ, రోజు రోజుకూ పాజిటివ్‌ కేసు లు పెరుగుతున్నాయి. అలాగని వెచ్చని వాతావరణం నియంత్రించడం లేదని అనలేం. కానీ, మనలోని ఒక జన్యువు కరోనా వైరస్‌పై భీకర యుద్ధం చేస్తోందేమో అనిపిస్తోంది. భారతీయుల జన్యుశైలే మనల్ని కాపాడుతుందేమో. జిట్చఝజీఖ27ఆ అనే జన్యువు కారణంగానే కరోనా వైరస్‌ భారతీయుల శరీరాలను ఛిద్రం చేయలేకపోతోందనే వాదన వైద్య వర్గాల్లో ఉంది. ఇది శాస్త్రీయంగా నిరూపించాల్సి ఉంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే మలేరియా ప్రబలిన దేశాలు, ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి చెందట్లేదు. ప్రపంచ గణాంకాలూ ఇదే చెబుతున్నాయి. మలేరియా వచ్చినప్పుడు క్లోరోక్విన్‌ వాడటం వల్లే కరోనాను నియంత్రించగలిగిన శక్తి వచ్చిందని వైద్య వర్గాలంటున్నాయి. మన దేశంలోనూ ఇదే పరి స్థితి ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top