ఉగాది రోజు ‘డబుల్‌’ గృహ ప్రవేశాలు

Double bedroom's startings from ugadhi fest

సీఎం చేతుల మీదుగా  ప్రారంభోత్సవం: హరీశ్‌రావు 

గజ్వేల్‌లో ఇప్పటికే 650 ఇళ్ల నిర్మాణం పూర్తి

గజ్వేల్‌: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ‘డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేసి, వచ్చే ఏడాది ఉగాది రోజున ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా గృహ ప్రవేశాలు చేయిస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. శుక్రవారం గజ్వేల్‌ పట్టణంలో ‘డబుల్‌ బెడ్‌రూమ్‌’మోడల్‌ కాలనీ, పాండవుల చెరువు, వంద పడకల ఆస్పత్రి పనులను ఆయన పరిశీలించారు. పశువైద్యం కోసం ఏర్పాటు చేసిన సంచార వైద్యశాలను ప్రారంభించి, ములుగులోని హార్టికల్చర్‌ యూనివర్సిటీ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌లో 1256 ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నాయన్నారు. ఇప్పటికే 650 ఇళ్ల నిర్మాణం పూర్తి కావస్తుండగా, మరో 600కు పైగా పూర్తి చేయాల్సి ఉందని చెప్పారు. ఉగాదిలోగా పనులను అన్ని హంగుల్లో పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉంచాలని కాంట్రాక్టు ఏజెన్సీని, అధికారులను ఆదేశించారు.  

హార్టికల్చర్‌ వర్సిటీ పనుల తీరుపై ఆగ్రహం  
ఇకపోతే ములుగు హార్టికల్చర్‌ యూనివర్సిటీ పనుల నాణ్యతపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచే వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఫోన్‌ చేసి నాణ్యత తీరును వివరించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కాంట్రాక్టు ఏజెన్సీ తీరులో మార్పు రాకపోతే బ్లాక్‌ లిస్టులో పెడతామని హెచ్చరించారు. మంత్రి వెంట మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

కంచ ఐలయ్యపై చర్యలు తీసుకుంటాం
వర్గల్‌: ఒక కులాన్ని దూషించే విధంగా ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య మాట్లాడటం దురదృష్టకరమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం శాకారంలో కంచ ఐలయ్య పుస్తకాన్ని నిషేధిం చాలని, తమ మనోభావాలను గాయపరచారంటూ మంత్రికి వైశ్యులు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వ పక్షాన ఐలయ్య వ్యాఖ్యల్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కులాన్ని బట్టి గుణాన్ని నిర్ణయించలేరని పేర్కొన్నారు. అన్ని కులాలు కలగలసి ఉన్న సంస్కృతి మనదని, ఇలాంటి వాతావరణంలో కులాల పంచాయితీ పెట్టడం సరికాదన్నారు. ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top