కంటపడినవారి.. వెంటపడి..

Dog Bites on People in Ameerpet Hyderabad - Sakshi

సుమారు 50 మందిని కరిచిన పిచ్చికుక్క

రోడ్ల వెంబడి పరుగులతో స్వైరవిహారం

వరుస ఘటనలతో బెంబేలెత్తినస్థానికులు

ఆస్పత్రుల బాటపట్టిన బాధితులు   

అమీర్‌పేట: పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. రోడ్లపై పరుగులు తీస్తూ భయభ్రాంతులకు గురిచేసింది. సుమారు 50 మందిని కరిచింది. మంగళవారం జరిగిన వరుస ఘటనల నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సాయంత్ర 3.30 గంటల సమయంలో మొదటగా సోమాజిగూడలో రోడ్డుపై వెళుతున్న ఆరుగురు యువకులను పిచ్చికుక్క కరిచింది. సీఎం క్యాంపు కార్యాలయం మీదుగా వచ్చి అమీర్‌పేట గ్రీన్‌ల్యాండ్‌ చౌరస్తా వద్ద ఎదురుగా వచ్చిన ముగ్గురిని వెంటపడి మరీ కరిచింది. అక్కడి నుంచి నేరుగా ఇండో యూఎస్‌ ఆస్పత్రి నిల్చున్న వ్యక్తిని తీవ్రంగా గాయపర్చింది. సిస్టర్‌ నివేదిత స్కూల్‌ సమీపంలో ఇద్దరు విద్యార్థులను కరిచింది. ఇంట్లో నుంచి ట్యూషన్‌కు వెళుతున్న చిన్నారుల వెంటపడి కరవడంతో తీవ్ర గాయాలయ్యాయి.

గమనించిన కొందరు యువకులు కుక్కను తరిమేందుకు ప్రయత్నించడంతో వారిపైకి దూకి మరీ కరిచింది. దీంతో వారు రాళ్లతో కొట్టి తరిమారు. అక్కడి నుంచి కన్యాగురుకుల్‌ పాఠశాల మీదుగా అమీర్‌పేట మున్సిపల్‌ గ్రౌండ్‌ చౌరస్తాకు వచ్చి ఇద్దరు విద్యార్థులను కరిచింది. చిరు వ్యాపారులు కర్రలతో కొట్టి తరిమివేశారు. చల్లా నర్సింగ్‌ హోం వద్ద ఓ వైద్యుడితో పాటు ఇద్దరు సేల్స్‌మెన్‌లను కరిచింది. అనంతరం అమీర్‌పేట సత్యం థియేటర్‌ వద్ద మరో ఇద్దరిని కరిచింది. ఆగ్రహంతో కొందరు యువకులు రాళ్లు, కర్రలు పట్టుకుని వెంటపడి కొట్టడంతో హెచ్‌డీఎఫ్‌సి బ్యాంకు సమీపంలో పడిపోయింది. వరుస ఘటనల నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఆందోళ చెందారు. ఇటీవల కుక్కల సంఖ్య  ఎక్కువైందని, వీటి భయంతో ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే బెంబేలెత్తాల్సిన పరిస్థితి నెలకొందని మహిళలు ఆవేదన వ్యక్తచేశారు. 

18 మందికి చికిత్సలు..
కుక్కకాటుకు గురైన అనేక మంది ఆస్పత్రుల బాట పట్టారు. అమీర్‌పేట ధరం కరం రోడ్డులోని చల్లానర్సింగ్‌ హోంలో 18 మందికి చికిత్స అందించారు. వీరిలో నలుగురు విద్యార్థులతో పాటు ఓ వైద్యుడు ఉన్నారు. ఆస్పత్రిలో బెడ్లు ఖాళీగా లేకపోవడంతో చాలా మందిని ఇతర ఆస్పత్రులకు పంపించినట్లు వైద్యుడు విజేయ్‌కుమార్‌ తెలిపారు.

యువకులతో మహిళ గొడవ..  
రోడ్లపై కనిపించిన వారినందరినీ కరుస్తుండటంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కొందరు యువకులు కర్రలు, రాళ్లతో కొట్టి పిచ్చికుక్కను మట్టుపెట్టారు. ఈ సమయంలో అమీర్‌పేట సత్యంథియేటర్‌ వద్దకు వచ్చిన ఓ మహిళ కుక్కను కొట్టి చంపుతున్నారెందుకని ప్రశ్నించింది.అంతటితో ఆగకుండా కుక్కను కొట్టిన వారిని తన సెల్‌ఫోన్‌తో వీడియో తీసింది. దీంతో సదరు యువకులు ఆమెతో గొడవకు దిగారు. పిచ్చికుక్క మనుషులను కరిచి గాయాలపాలు చేస్తే చూస్తూ ఊరుకోవాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సదరు మహిళ వినిపించుకోకుండా తాను కమిషనర్‌ కూతురునని, కుక్క మృతికి కారకులైన వారిపై కేసు పెడతానంటూ అక్కణ్నుంచి వెళ్లిపోయింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top