‘ప్రవర్తన’ అతిక్రమిస్తే చర్యలు తప్పవు | Sakshi
Sakshi News home page

‘సాక్షి’తో జిల్లా ఎన్నికల అధికారి దానకిశోర్‌

Published Thu, Nov 29 2018 8:51 AM

District Election Officer Chit Chat With Sakshi

కొత్తగా ఓటర్లుగా నమోదైన వారికి ఉచితంగా ఎపిక్‌ కార్డుల పంపిణీ, మరో వైపు ఇంటింటికి ఓటరు స్లిప్‌ల పంపిణీ జరుగుతోంది. ఇప్పటికే లక్ష ఎపిక్‌ కార్డులు పంపిణీ చేశాం. మిగతా 1.71 లక్షల మందికి
రెండుమూడు రోజుల్లో పంపిణీ చేస్తాం.  

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఎన్నికల ప్రచారపర్వం ఊపందుకుంది. నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. అభివృద్ధి పథకాల మాటేమోగాని ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలనే ఎక్కువగా ఎక్కుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో నిబంధనలను ఉల్లంఘించి ఎవరు వ్యవహరించినా ఊరుకునే ప్రసక్తే లేదని హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం. దానకిశోర్‌ స్పష్టం చేశారు. ప్రవర్తన నియమావళి నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఉల్లంఘనలకు సంబంధించి ఇప్పటికే దాదాపు 120  కేసులు నమోదు చేశామన్నారు. వీటిలో నిర్ణీత సమయం ముగిశాక ప్రచారం, ప్రసంగాలు కొనసాగించినవి.. ప్రసంగాల్లో ప్రత్యర్థులపై వ్యతిరేకంగా చేసినవి, నిరాధార ఆరోపణలు వంటివాటితో పాటు అనుమతి లేని పోస్టర్లు తదితరమైనవి ఉన్నాయన్నారు.  ఎన్నికలకు సంబంధించి బుధవారం ‘సాక్షి’తో ఆయన ముఖాముఖి మాట్లాడారు. ఆ వివరాలు ఇవీ..

పెరిగిన అభ్యర్థులు..అదనంగా ఈవీఎంలు..
హైదరాబాద్‌ జిల్లాలో 15 నియోజకవర్గాలుండగా, పోటీ చేస్తున్న అభ్యర్థులు 15 మంది కంటే ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లో ఒక ఈవీఎం (బ్యాలెట్‌ యూనిట్‌) కంటే ఎక్కువ యూనిట్లు అవసరం. ఒక బ్యాలెట్‌ యూనిట్‌లో నోటా కాక 15 మంది అభ్యర్థుల వరకు అవకాశం ఉంటుంది. అలా ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోని దాదాపు 240 పోలింగ్‌ కేంద్రాల్లో మూడేసి బ్యాలెట్‌ యూనిట్లు వాడాల్సి ఉంది. సనత్‌నగర్, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా మినహా మిగతా 11 నియోజకవర్గాల్లో రెండేసి బ్యాలెట్‌ యూనిట్లు వాడాలి. దీంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈవీఎంలు కాక అదనంగా దాదాపు 2,500 ఈవీఎంలు కావాల్సి ఉంది.  

10 లక్షల గైడ్‌లు
వెబ్‌ కెమెరాలతో పోలింగ్‌ ప్రత్యక్ష ప్రసారానికి దాదాపు 6500 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు.  
దివ్యాంగుల రవాణా సదుపాయానికి150– 170 వాహనాలు వినియోగిస్తాం.
ఎన్నికల విధుల్లోని వివిధ స్థాయిల్లోని వారికి ఒక విడత శిక్షణ పూర్తయింది. రెండో విడత శిక్షణ ఈ నెల 30, డిసెంబర్‌ 1న  నిర్వహిస్తాం.  
బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇంటర్నెట్‌ సదుపాయం అందుబాటులో లేని దాదాపు 700 కేంద్రాల నుంచి ప్రసారానికి ఇంటర్నెట్‌ డాంగిల్స్‌ వినియోగిస్తాం.
ఓటు ఎలా వేయాలో తెలియజేసే 10 లక్షల గైడ్‌లను త్వరలో పంపిణీ చేస్తాం.

గుర్తింపు పత్రంతోనూ ఓటేయొచ్చు
కొత్త నిబంధనలు, నిర్దిష్ట కార్యాచరణకనుగుణంగా డిసెంబర్‌ 2వ తేదీ వరకే ఓటరు స్లిప్‌ల పంపిణీ పూర్తి చేస్తాం. ఓటరు స్లిప్‌ అందని వారు, తమ ఓటరుకార్డుతో పోలింగ్‌ కేంద్రానికి  వెళ్లవచ్చు. అదీ లేకపోయినా ఓటరు జాబితాలో పేరుంటే ఎన్నికల సంఘం నిర్ణయించిన గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకటి తీసుకువెళితే పోలింగ్‌కు అనుమతిస్తారు. ఓటరు కార్డు కావాలనుకునేవారు మీ సేవ కేంద్రాల్లో నిర్ణీత ఫీజు చెల్లించి వీటిని పొందవచ్చు, జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ కార్యాలయాల్లోనూ ఓటరుకార్డుల జారీని చేపట్టాలనుకున్నప్పటికీ, దాన్ని విరమించుకున్నాం.  

నిబంధనల ఉల్లంఘనలివీ..
మొత్తం కేసులు: 122 (107 ఎఫ్‌ఐఆర్, 13 పెట్టీ,మరో రెండింటికి కోర్టు ఉత్తర్వులు రావాల్సి ఉంది)మద్యం పట్టివేత : 14 కేసులు (రూ. 2,91,035 విలువైన1634.91 లీటర్లు.)
నగదుకు సంబంధించి: 60 కేసులు (రూ.19,92,89,970 పట్టివేత.)ఇతరత్రా: 4 కేసులు. (సౌండ్‌స్పీకర్లు, 29 కిలోల వెండి, రూ, 2,90,000 విలువైన గుట్కా/పాన్‌మసాలా పట్టివేత.)తొలగించిన బ్యానర్లు, పోస్టర్లు : 54,370

సీ విజిల్‌ కేసులు..
మొత్తం ఫిర్యాదులు : 724
రిటర్నింగ్‌ ఆఫీసర్లు ఉపసంహరించినవి: 207
రిటర్నింగ్‌ ఆఫీసర్లు చర్యలు తీసుకున్నవి: 418
పురోగతిలో ఉన్నవి: 97 స్పష్టత కోసం పై అధికారులకు పంపించినవి: 2

Advertisement
Advertisement