ఒక్కొక్కరికి ఉచితంగా 12 కిలోల బియ్యం

Distribution Of 12 KG Of Rice In Telangana From Today - Sakshi

నేటి నుంచి  రేషన్ పంపిణీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి రేషన్‌ బియ్యం పంపిణీ మొదలుకానుంది. రాష్ట్రంలోని 2.81 కోట్ల లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేసేలా పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేసింది. మొత్తంగా 3.36 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ఇప్పటికే రేషన్‌ దుకాణాలకు సరఫరా చేసింది. పంపిణీ కోసం రేషన్‌ దుకాణాలు ఉదయం, సాయంత్రం అన్ని వేళలా పనిచేసేలా చర్యలు చేపట్టింది. ఇందుకు ప్రభుత్వం రూ.1,103 కోట్లు ఖర్చు చేయనుంది. బుధవారం నుంచి ప్రారంభమయ్యే పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్లు పర్యవేక్షిం చాలని పౌరసరఫరాల కమిషనర్‌ సత్యనారాయణరెడ్డికి మంత్రి గంగుల కమలాకర్‌ ఆదేశించారు. ఎవరికీ ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

లబ్ధి దారులు రేషన్‌ దుకాణాల వద్ద గుమికూడకుండా, విడతల వారీగా బియ్యం ఇచ్చే కూపన్లు అందజేస్తారు. కూపన్లు పట్టుకుని చెప్పిన సమయానికే లబ్ధిదారులు రేషన్‌ దుకాణాల వద్దకు వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ రేషన్‌ తీసుకునే వరకు దుకాణాలు తెరిచే ఉంచుతామని మంత్రి స్పష్టం చేశారు. ప్రతినెలా క్రమం తప్పకుండా తీసుకునే కార్డుదారులకు బయోమెట్రిక్‌ అవసరం లేదని, గడిచిన 3 నెలలుగా తీసుకోని వారికి మాత్రమే బయోమెట్రిక్‌ పాటించాలని స్పష్టం చేశారు. ప్రతి చౌకధరల దుకాణం వద్ద శుభ్రత పాటించేందుకు శానిటైజర్లు, సబ్బు, నీటిని అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించారు. రేషన్‌ బియ్యం పంపిణీపై పౌర సరఫరా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పంపిణీని కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని ఇందులో సూచిం చారు. ప్రజలు గుమికూడకుండా టైమ్‌ స్లాట్‌లో ఇచ్చిన సమయానికే లబ్ధిదారులు దుకాణాలకు వచ్చేలా చూడాలన్నారు. ప్రతి లబ్ధిదారుడు ఇతరులకు కనీసం 3 అడుగుల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టంచేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top