
రైల్వేస్టేషన్@డిజిపే!
నగదు రహిత సేవలపై దక్షిణ మధ్య రైల్వే మరో ముందడుగు వేసింది.
⇒ డిజిటల్ పేమెంట్ స్టేషన్లుగా సికింద్రాబాద్, నాంపల్లి, హైటెక్ సిటీ
⇒ రైల్వే రిజర్వేషన్లు, టికెట్ బుకింగ్ సహా అన్నీ నగదు రహితమే
⇒ 25న ప్రారంభించనున్న రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు
సాక్షి, హైదరాబాద్: నగదు రహిత సేవలపై దక్షిణ మధ్య రైల్వే మరో ముందడుగు వేసింది. దేశంలోనే మొట్టమొదటి డిజిటల్ పేమెంట్స్ (డిజిపే) స్టేషన్‌గా కాచిగూడ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేసిన తరహాలోనే తాజాగా సికింద్రా బాద్, నాంపల్లి, హైటెక్ సిటీ రైల్వేస్టేషన్లలో సైతం నగదు రహిత డిజిపే సేవలను ప్రారం భించేందుకు సన్నాహాలు చేస్తోంది. దక్షిణ మధ్య రైల్వే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ డిజిటల్ పేమెంట్ సర్వీసులను రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు ఈ నెల 25న హైటెక్ సిటీ రైల్వేస్టేషన్‌లో ప్రారంభించనున్నారు.
రైల్వే రిజర్వేషన్లు, టికెట్ బుకింగ్‌తో పాటు అన్ని రకాల సర్వీసులను ప్రయాణికులు ఇక నుంచి క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా పొందవచ్చు. కాచిగూడలో ఈ ప్రాజెక్టు విజయ వంతం కావడంతో దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోని ప్రధాన స్టేషన్లను డిజిపే స్టేషన్లుగా మార్చేందుకు అధికారులు ప్రణాళికలను రూపొందించారు. రైల్వే సేవలతో పాటు ప్రైవేట్ స్టాళ్లు, కేటరింగ్, ఇతర సేవలను డిజిటల్ పేమెంట్స్ ద్వారా ప్రయా ణికులు పొందవచ్చు. నగరంలోని అతి ప్రధా నమైన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి నిత్యం రాకపోకలు సాగించే 2.5 లక్షల మందికి, నాంపల్లి నుంచి రాకపోకలు సాగించే 50 వేల మందికి ప్రయోజనం చేకూరనుంది.
కాచిగూడలో సక్సెస్..
టీ, కాఫీ, అల్పాహారం మొదలుకుని టికెట్ బుకింగ్, వాహనాల పార్కింగ్ ఇలా అన్ని రకాల సర్వీసులను నగదు రహిత చెల్లింపుల ద్వారా పొందేందుకు కాచిగూడ రైల్వేస్టేషన్‌లో గత నెలలో డిజిటల్ పేమెంట్స్‌ను ప్రారం భిం చారు. డిజిపే విధానం ఇక్కడ విజయవం తంగా కొనసాగుతోన్నాయి. నిత్యం సుమారు 40 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ స్టేషన్లో 75 శాతం మంది కార్డుల ద్వారానే చెల్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
25న హైదరాబాద్–మహబూబ్‌నగర్ ‘డబ్లింగ్’కు శంకుస్థాపన
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ – మహబూబ్‌నగర్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు ఈ నెల 25న శంకుస్థాపన చేయనున్నట్లు టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి రైల్వే మంత్రి సురేశ్ ప్రభు హాజరవుతారని బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాకు తెలిపారు. ఇదే లైన్‌కు విద్యుదీకరణ పనులకు కూడా అనుమతులు మంజూరైనట్లు చెప్పారు. డబ్లింగ్ వల్ల హైదరాబాద్, మహబూబ్‌నగర్‌ల మధ్య ప్రయాణ దూరం తగ్గనుందని పేర్కొన్నారు. రెండేళ్లలో డబ్లింగ్ పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ నెల 31లోపు మహబూబ్‌నగర్‌లో ఈ–పోస్టల్ పాస్‌పోర్ట్ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.
నగదు కొరత దృష్ట్యా ప్రయోజనం..
మళ్లీ నగదు కొరత ప్రజలకు ఆం దోళన కలిగిస్తోంది. ఏటీఎంల్లో డబ్బులు ఉండకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పెద్ద నోట్ల రద్దు నాటి సంక్షోభమే పునరావృతమైంది. ఈ నేప థ్యంలో సికింద్రాబాద్, నాంపల్లి వంటి ప్రధాన రైల్వేస్టేషన్లలో డిజిటల్ సేవలను అందుబాటులోకి తేవడంతో ప్రయాణి కులు ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించేందుకు అవకాశం లభిస్తుంది. సికింద్రాబాద్ స్టేషన్‌లోని 10 ప్లాట్ ఫామ్‌లపైన ఉన్న సుమారు 50 స్టాళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్‌ప్లాజాలు, పార్కింగ్, పార్శిల్, టికెట్ కౌంటర్లలో పేటీఎం, స్వైపింగ్ మిషన్లు అందుబాటులోకి రానున్నాయి. భీమ్ యాప్ ద్వారా కూడా చెల్లింపులకు అవకాశం ఉంటుంది. నాంపల్లి, హైటెక్‌సిటీ స్టేషన్లలో కూడా ప్రయాణికులు డిజిటల్ చెల్లింపులు జరపవచ్చు.