ఆ నెంబర్‌ ప్లేట్‌.. ఎందుకంత లేట్‌..

Delay On High Security Number Plates Registration - Sakshi

ఇంకా ‘హైసెక్యూరిటీ’కి దూరంగా 2.92 లక్షల వాహనాలు

ఐదేళ్లు గడిచినా అమల్లో నత్తనడకే..

నెంబర్‌ ప్లేట్‌లలో నాణ్యత లేకపోవడంతో విముఖత

కాగ్‌ నివేదిక నేపథ్యంలో రవాణాశాఖ అప్రమత్తం

త్వరలో సమీక్ష సమావేశం

సాక్షి, సిటీబ్యూరో: హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ ప్లేట్‌. వాహనాల భద్రతకు సంబంధించిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ పథకాన్ని ప్రారంభించిన 5 ఏళ్లు గడిచినా లక్షలాది వాహనాలు ఇంకా ఈ పథకానికి దూరంగానే ఉన్నాయి. హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ ప్లేట్‌ (హెచ్‌ఎస్‌ఆర్‌పీ) అమలులో రవాణ శాఖ చేపట్టే చర్యలు పూర్తిస్థాయి ఫలితాలను అందజేయలేకపోతున్నాయి. ఇటీవల కాగ్‌ నివేదికలోనూ  ఇదే అంశం వెల్లడైంది. ఈ పథకం అమల్లోకి వచ్చి ఐదేళ్లయినా ఇంకా 2,92,843 వాహనాలు హైసెక్యూరిటీ  నెంబర్‌ ప్లేట్‌లకు బదులు సాధారణ నెంబర్‌ ప్లేట్‌లనే వినియోగిస్తున్నట్లు కాగ్‌ స్పష్టం చేసింది. ఇక ఈ పథకం అమల్లోకి వచ్చిన 2013 సంవత్సరానికి ముందు ఉమ్మడి రాష్ట్రంలో నమోదైన మరో 30 లక్షల వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్‌ల ఏర్పాటు ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. మొత్తంగా ఈ పథకం ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్నట్లుగా మారింది. 

భద్రతకు భరోసా ఏదీ...?
హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్‌ల ఏర్పాటు ఒక ప్రహసనంగా మారింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్‌ జిల్లాల్లో ఏ రోజుకు ఆ రోజు నమోదయ్యే కొత్త వాహనాలకు మొదట బిగించి, ఆ తరువాత క్రమంగా పాత  వాహనాలకు కూడా ఈ నెంబర్‌ ప్లేట్‌లను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ కొత్త వాహనాల లక్ష్యమే ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికీ 2.98 లక్షల వాహనాలు పెండింగ్‌లో ఉండటమే ఇందుకు ఉదాహరణ. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 2015 డిసెంబర్‌ నాటికే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని అప్పట్లో నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కానీ ఐదేళ్లు గడిచిన తరువాత కూడా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అమల్లోని జాప్యంపై  కాగ్‌ అక్షింతలు వేయడం దీని అమల్లోని నిర్లక్ష్యాన్ని ప్రస్ఫుటం చేస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రతిరోజు సుమారు 1,500 వాహనాలు కొత్తగా నమోదవుతున్నాయి.

ఆర్టీఏ కార్యాలయంలో నమోదయ్యే ప్రతి వాహనానికి రిజిస్ట్రేషన్‌తో పాటు నెంబర్‌ ప్లేట్‌ కూడా అప్పటికప్పుడే బిగించే సదుపాయం ఉంటే చాలా వరకు జాప్యం లేకుండా ఉండేది. కానీ వాహనం నమోదుకు, నెంబర్‌ ప్లేట్‌ ఏర్పాటుకు మధ్య 15 రోజుల నుంచి  నెల వరకు గడవు విధిస్తున్నారు. దీంతో వాహనదారుల్లో నిర్లక్ష్యం నెలకొంటోంది. ఈ జాప్యాన్ని నివారించేందుకు ఖైరతాబాద్‌లో మాత్రం ప్రయోగాత్మకంగా కొన్ని చర్యలు తీసుకున్నారు. హెచ్‌ఎస్‌ఆర్‌పీ ఉన్న వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్‌ స్మార్ట్‌ కార్డు అందజేస్తున్నారు. అలాగే ఆదివారం సెలవు దినమైనా   హెచ్‌ఎస్‌ఆర్‌పీ కేంద్రాన్ని తెరిచి ఉంచుతున్నారు. ఈ చర్యల వల్ల ఖైరతాబాద్‌లో వీటి అమలు బాగానే ఉంది. కానీ మిగతా ఆర్టీఏల్లో ఇలాంటి ప్రత్యేక చర్యలు లేకపోవడం వల్ల ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా  ఉంది. 

నాణ్యత డొల్ల...
మరోవైపు వాహనాల భద్రతకు ప్రతీకగా భావించే హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్‌లలో నాణ్యత కొరవడింది. విరిగిపోవడం, పూర్తిగా రంగు పోవడం, వాహనదారులు ఆశించిన విధంగా నెంబర్‌ ప్లేట్లు ఆకర్షణీయంగా లేకపోవడంతో చాలా మంది విముఖత చూపుతున్నారు. హెఎండ్‌ వాహనదారులు, స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనాలు కలిగిన వారు, రకరకాల ఫ్యాన్సీ నంబర్లు, ప్రత్యేక రిజిస్ట్రేషన్‌ నంబర్లు పొందిన వాహనదారులు వాటిని తమకు నచ్చిన విధంగా ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ నాణ్యత లేని, రంగు వెలిసిపోయే హెచ్‌ఎస్‌ఆర్‌పీని మాత్రం కోరుకోవడం లేదు. ఈ పథకం విజయవంతంగా అమలు కాకపోవడానికి ఇదీ ఒక కారణం.

కాగ్‌ నివేదికపై సమీక్ష...
కాగ్‌ నివేదికలో వెల్లడించిన అంశాలపై ఈ నెల 4వ తేదీన రవాణ మంత్రి మహేందర్‌రెడ్డి సమీక్షించనున్నారు. లోపాలను సరిద్దిద్దుకొని హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్లను సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు, ఇతర అంశాలపైన కూడా చర్చించనున్నట్లు సంయుక్త రవాణా కమిషనర్‌ పాండురంగ్‌ నాయక్‌ తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top