తగ్గుతున్న నాటు పొగాకు సాగు

Decreased Tobacco Cultivation - Sakshi

ములకలపల్లి: నాటు పొగాకు సాగు క్రమేపీ తగ్గుతోంది. ఒకప్పుడు మండల పరిధిలో ప్రధాన వాణిజ్య పంటగా వేలాది ఎకరాల్లో సాగయ్యేది. ఐతే పెట్టుబడి అధికం కావడం, శ్రమకు తగ్గ ప్రతిఫలం లేకపోవడంతో దీని సాగుపట్ల రైతులు ఆసక్తి చూపడంలేదు. దీంతో పొగాకు సేద్యం ప్రస్తుతం వందల ఎకరాలకు మాత్రమే పరిమితమయింది.  
ఆంధ్రా పెట్టుబడిదారుల సహకారంతో.. 
ఈ పంట సాగుకయ్యే ఖర్చును ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరు వ్యాపారులు స్థానికుల ద్వారా రైతులకు పెట్టుబడి పెట్టేవారు. మండలం లో దీని పేరున కోట్లాది రూపాయల టర్నోవర్‌ జరిగేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఈ పంటకు ధర దక్కకపోవడం మరో ప్రధాన కారణం. పుట్టి పొగాకు (227 కేజీలు) గత ఏడాది 14,100 రూపాయలుగా ఖరారు చేశారు. ఖర్చు లన్నీ పోను రైతు కష్టం కూడా మిగలని పరిస్థితి.

పంట దిగుబడికి వాడే పురుగు మందుల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే, పంట ధర మాత్రం ఏడాదికేడాదికి తగ్గుతుంది.  కంటికి రెప్పలా కాపాడినా.. 
ఆగష్టు మాసంలో నారు కోసం గింజలు వేసింది మొదలు మార్చి, ఏప్రియల్‌ నెలల్లో పంట పంపిచే వరకూ కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిందే. ఈ కాలంలో అకాల వర్షాలు, అనావృష్టి తదితర సమస్యలు వస్తే పంట దిగుబడి అనూహ్యంగా తగ్గిపోతోంది. పంట కోసిన తరువాత పందిళ్లపై ఆరబెట్టిన సమయంలో కూడా వర్షంలో తడిస్తే, పంటరేటు తగ్గిస్తారు. మిగతా పంటలు కల్లాల్లో ఉండగానే ఖరీదు చేస్తారు.  
ధర చెల్లించే పద్ధతి మరీ దారుణం.. 
నాటు పొగాకు సాగు చేసే రైతులది చిత్రమైన పరిస్థితి. పందిళ్లమీద పంటను లారీల్లో లోడు చేసి ఆంధ్రాప్రాంతాలకు మార్చి, ఏప్రిల్‌ నెలల్లో పంపి స్తారు. ఐతే జూలై, ఆగష్టు నెలల్లో వీటి ధర ప్రకటిస్తారు. సదురు పెట్టుబడిదారులకు అనుకూలంగా పుట్టిధరను నిర్ణయిస్తారు. ఆరంభం నుంచి రైతుకిచ్చిన పెట్టుబడిపోగా మిగతావి విడతలవారీగా రైతులకు ఇస్తారు. దీంతో రైతు కష్టానికి ప్రతిఫలం ఎప్పుడు లభిస్తుందో కూడా తెలియని దుస్థితి. ఇలాంటి విచిత్ర పరిస్థితులతో భవిష్యత్తులో ఈ పంట సాగు కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top