తెలంగాణ ఉద్యోగులకు డీఏ పెంపు | DA hike for Telangana staff | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఉద్యోగులకు డీఏ పెంపు

Mar 8 2016 8:11 PM | Updated on Apr 7 2019 3:34 PM

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ) పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది జులై నుంచి 3.144 శాతం చొప్పున పెరిగిన డీఏను చెల్లించనున్నట్లు ప్రకటించింది.

- ప్రస్తుత డీఏకు 3.144 శాతం అదనం.. ఏప్రిల్ ఒకటిన జీతంతో చెల్లింపు
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. 4.50 లక్షల మందికి ప్రయోజనం
- గత ఏడాది జులై నుంచి ఇవ్వాల్సిన బకాయిలు జీపీఎఫ్‌లో జమ


హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ) పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది జులై నుంచి 3.144 శాతం చొప్పున పెరిగిన డీఏను చెల్లించనున్నట్లు ప్రకటించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4.50 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ప్రస్తుతం ఉద్యోగులకు మూల వేతనంపై 12.052 శాతం డీఏ అమల్లో ఉంది. దీనికి అదనంగా 3.144 శాతం కలిపి.. 15.196 శాతం డీఏ చెల్లించనుంది. తెలంగాణ ఆర్థిక శాఖ మంగళవారం అందుకు సంబంధించిన జీవో నెం.25 జారీ చేసింది.

ఈ ఉత్తర్వుల ప్రకారం... మార్చి నెల జీతంతోనే పెరిగిన కరువు భత్యాన్ని నగదుగా చెల్లిస్తారు. అంటే ఏప్రిల్ ఒకటో తారీఖున పెరిగిన డీఏ ఉద్యోగుల చేతికందుతుంది. ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ గత ఏడాది జులై నుంచి పెరిగిన డీఏ వర్తిస్తుంది. జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంధాలయ సంస్థల్లో రెగ్యులర్ జీతంపై పనిచేస్తున్నవారికి, రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ఎయిడెడ్ విద్యా సంస్థలు, ఎయిడెడ్ పాలిటెక్నిక్‌ల్లో పని చేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి, ఉద్యోగులకు పెరిగిన డీఏ వర్తిస్తుంది. గత ఏడాది జులై నుంచి ఫిబ్రవరి వరకు ఉన్న డీఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారు.

2004 సెప్టెంబర్ ఒకటి తర్వాత నియామకమై కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌లో కొనసాగుతున్న ఉద్యోగ ఉపాధ్యాయులకు 90 శాతం బకాయిలు నగదుగా చెల్లిస్తారు. మిగతా పది శాతాన్ని ప్రాన్(పీఆర్‌ఏఎన్) అకౌంట్‌లో జమ చేస్తారు. ఈ ఏడాది మే 31లోగా పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు వంద శాతం బకాయిలు నగదు రూపంలోనే చెల్లిస్తారు. జీపీఎఫ్ ఖాతా లేని ఉద్యోగులున్నట్లయితే వారికి సంబంధించిన డీఏ బకాయిల మొత్తాన్ని ప్రభుత్వం కంపల్సరీ సేవింగ్ అకౌంట్‌లో జమ చేస్తుంది. సదరు ఉద్యోగులు ఖాతాలు తెరిచిన తర్వాత జీపీఎఫ్‌లో సర్దుబాటు చేస్తారు.

బకాయిలకు సంబంధించి ఈనెల 15లోగా ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ కార్యాలయాల్లో బిల్లులు సమర్పించాలని ఆర్థిక శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తమ పరిధిలోని ఉద్యోగులందరూ డీఏ బకాయిలు క్లెయిమ్ చేసినట్లుగా డీడీవోలు ధ్రువీకరణ పత్రం జత చేస్తేనే... మే నెల వేతన బిల్లులు పాస్ చేయాలని ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement