
సాక్షి, హైదరాబాద్: రబీలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఈ రబీ నుంచి బ్యాంకు రుణాలు తీసుకునే రైతులెవరైనా బీమా ప్రీమియం చెల్లింపు నుంచి మినహాయింపు పొందే అవకాశం లేకుండా నిబంధనలు తీసుకొస్తూ శుక్రవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు. రైతులు తీసుకునే రుణం నుంచే బ్యాంకులు ప్రీమియాన్ని కంపెనీలకు చెల్లిస్తాయి. అనేకమంది రైతులు కోర్టుకు వెళ్లి ప్రీమియం చెల్లించకుండా మినహాయింపు పొందుతున్నారు. ఈ రబీ నుంచి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చినా దాన్ని అమలు చేయాల్సిన అవసరం లేకుండా తాజా మార్గదర్శకాల్లో కఠిన నిబంధన తయారు చేశారు.
బీమా పరిహారం ఆలస్యం చేస్తే జరిమానా...
బీమా క్లెయిమ్స్ సెటిల్ చేయకుండా ఆలస్యం చేస్తూ రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులకు బీమా పరిహారం క్లెయిమ్స్ సెటిల్‌మెంట్ చేయడంలో ఆలస్యం చేస్తే బీమా కంపెనీలకు జరిమానా విధించాలని ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. సెటిల్‌మెంటు చేయడంలో నిర్ణీతకాల పరిమితికి 2 నెలలు దాటితే 12 వడ్డీ రైతులకు చెల్లించాలని బీమా కంపెనీలను ఆదేశించింది. బీమా సేవలు అందించడంలో విఫలమయ్యే కంపెనీలను రద్దు చేయనుంది.
వరికి డిసెంబర్ 31 గడువు తేదీ...
రబీలో వరి, జొన్న, మినుములు, పొద్దు తిరుగుడు, పెసర, వేరుశనగ, ఎర్ర మిరప, నువ్వులు, ఉల్లి పంటలకు రైతులు ప్రీమియం చెల్లించే గడువును డిసెంబర్ 31గా నిర్ధారించారు. ఒకవేళ వాతావరణం బాగోలేక కరువు పరిస్థితులు వంటివి ఏర్పడి ఆయా పంటల సాగు ఆలస్యమైతే వచ్చే ఏడాది జనవరి 15వ తేదీ వరకు ఈ పంటలకు ప్రీమియం చెల్లించే అవకాశం కల్పిస్తారు. ఇక మొక్కజొన్నకు డిసెంబర్ 15ను ప్రీమియం చెల్లించేందుకు గడువు తేదీ ఖరారు చేశారు. ఈ పంట వాతావరణ పరిస్థితుల్లో తేడా వస్తే డిసెంబర్ 31 వరకు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తారు. శనగకు నవంబర్ 30వ తేదీ నాటికి ప్రీమియం చెల్లించేందుకు గడువిచ్చారు. వాతావరణం వంటి ప్రత్యేక పరిస్థితుల్లో డిసెంబర్ 15వ తేదీ నాటి వరకు గడువిచ్చారు.