రాష్ట్ర ప్రభుత్వం తన పనితీరును మాటల్లో కాకుండా చేతల్లో....
సంగారెడ్డి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం తన పనితీరును మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు అన్నారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా వామపక్షాల ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ముట్టడిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్వాకం వల్లే రాష్ట్రంలో సంక్షోభం ఏర్పడిందన్నారు.
తెలంగాణ వచ్చిన 5 నెలల కాలంలోనే 300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. ప్రస్తుతం వ్యవసాయానికి 3గంటల కరెంటు కూడా అందడం లేదని మండిపడ్డారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి మహిళా సమస్యల పరిష్కారానికి కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కందిమల్ల ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. దళితులకు, గిరిజనులకు మూడెకరాల భూమి ఇవ్వాలన్నారు. మెదక్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలని కోరారు. నాయకులు రాజయ్య, మల్లేశం, జయరాజు, మల్లికార్జున్, రాంచందర్, మాణిక్యం, సాయిలు, అడివయ్య,ప్రవీణ్, అశోక్, రవి, సీపిఐ నాయకులు పవన్, తాజొద్దీన్, ఆహ్మద్, బాబూమియా, అశోక్, మంజుల, స్వరూప ఉన్నారు.