భద్రతా సిబ్బంది కాదు.. బందిపోట్లు! 

Complaint to Intelligence IG on six guards - Sakshi

     మంత్రికి భద్రతగా ఉంటూ వసూళ్ల పర్వం..

     నిజామాబాద్‌ పర్యటనలో ఓ ఎమ్మెల్యేకు చేదు అనుభవం

     రూ.30 వేలు డిమాండ్‌.. పదివేలిచ్చినా తృప్తి చెందని వైనం 

     తీవ్రస్థాయిలో మండిపడ్డ మంత్రి, ఇంటెలిజెన్స్‌ ఐజీకి ఫిర్యాదు 

     ఆరుగురు గార్డులపై చర్యలు

సాక్షి, హైదరాబాద్‌: వారంతా ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ సిబ్బంది. ముఖ్యమంత్రితో సహా మంత్రులకు, వీవీఐపీలకు భద్రత కల్పిస్తుంటారు. ప్రతీక్షణం వెన్నంటే ఉంటూ రక్షణ విధులు నిర్వర్తిస్తుంటారు. అయితే ఇలాంటి కీలకమైన యూనిట్‌లో పనిచేస్తూ ఓ సీనియర్‌ మంత్రి దగ్గర విధులు నిర్వర్తిస్తున్న ఐఎస్‌డబ్ల్యూ సిబ్బంది అవినీతికి గడ్డికరిచినట్టు ఇప్పుడు పోలీస్‌ శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది. వారం రోజుల క్రితం సీనియర్‌ మంత్రి నిజామాబాద్‌ పర్యటనకు వెళ్లి పలు ప్రారంభోత్సవాలు చేసి బహిరంగ సభలో పాల్గొన్నారు.

అయితే సదరు మంత్రి సెక్యూరిటీ సిబ్బంది స్థానిక ఎమ్మెల్యే నుంచి డబ్బులు డిమాండ్‌ చేయడం సంచలనం సృష్టించింది. ఉండటానికి హోటల్‌ బుక్‌ చేసి, అన్ని రకాల భోజనాలు ఏర్పాటు చేసిన సదరు ఎమ్మెల్యేకు ఐఎస్‌డబ్ల్యూ సెక్యూరిటీ సిబ్బంది రూ.30 వేలు డిమాండ్‌ చేయడం షాక్‌కు గురిచేసింది. ఈ విషయం మంత్రికి చెప్పాలా వద్దా అని భావించిన ఎమ్మెల్యే రూ.10 వేలతో సరిపెట్టే ప్రయత్నం చేయగా.. సెక్యూరిటీ సిబ్బంది వినకపోవడంతో విషయం మంత్రి వరకు చేరింది.  

మంత్రి తీవ్ర ఆగ్రహం 
ఎమ్మెల్యే తనకు ఎదురైన చేదు అనుభవాన్ని చెప్పడంతో మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్యూరిటీ సిబ్బంది ఇలాంటి వ్యవహారాలకు పాల్పడటంపై సదరు మంత్రి నేరుగా ఇంటెలిజెన్స్‌ ఐజీకి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీంతో ఇంటెలిజెన్స్‌ ఉన్నతాధికారులు మంత్రి నిజామాబాద్‌ కార్యక్రమం సమయంలో ఉన్న సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్టు ఐఎస్‌డబ్ల్యూ వర్గాలు స్పష్టం చేశాయి. బెటాలియన్‌ నుంచి డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఆరుగురు భద్రతా సిబ్బందిని హుటాహుటిన తిరిగి బెటాలియన్‌కు పంపించినట్టు తెలిసింది.  

మంత్రులకు జిల్లా గార్డ్స్‌ 
సాధారణంగా మంత్రుల భద్రతా సిబ్బంది నియామకాల విషయంలో ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ నుంచి ఇద్దరు, మంత్రి సొంత జిల్లా పోలీస్‌ ఆర్మ్‌డ్‌ హెడ్‌క్వార్టర్స్‌ నుంచి ఇద్దరు ఏఆర్‌ గార్డులను నియమిస్తారు. అంటే ప్రతీ షిప్ట్‌కు నలుగురు ఉండేలా ఏర్పాట్లు చేస్తారు. పైగా పైలటింగ్, ఎస్కార్ట్‌ కూడా సంబంధిత జిల్లా ఏఆర్‌ విభాగం నుంచి నియమిస్తారు. రెండు నెలల కిందటి వరకు పలువురు మంత్రులకు ఇదే రీతిలో భద్రతా సిబ్బంది కేటాయింపులు జరిగాయి. కానీ ఇటీవలె ఏఆర్‌ గార్డ్స్‌ను పూర్తిగా తొలగించి మొత్తం ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ సిబ్బందిని నియమించడం చర్చనీయాంశంగా మారింది. తీరా సీనియర్‌ మంత్రి వద్దే పనిచేస్తూ ఇలాంటి అమ్యామ్యాలకు పాల్పడటం ఇటు రాజకీయ వర్గాలతో పాటు పోలీస్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సీనియర్‌ మంత్రికి ఎదురైన పరిస్థితే మిగతా మంత్రులు, కేబినెట్‌ హోదాలో ఉన్న వారికి కూడా అనేకసార్లు ఎదురయ్యాయి. కానీ కక్కలేక మింగలేక మంత్రులున్నట్టు ఇంటెలిజెన్స్‌ విభాగంలోనే చర్చ జరుగుతోంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top