​​22న కేసీఆర్‌ చింతమడక పర్యటన

CM KCR Visit On Chintha Madaka On Monday - Sakshi

సిద్దిపేట: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం తన స్వగ్రామం చింతమడకను పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, జేసీ పద్మాకర్ ఇతర జిల్లా అధికార యంత్రాంగంతో సిద్దిపేట టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఏర్పాట్లను పరిశీలించారు.  ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడుతూ.. ఈ నెల 22న సీఎం కేసీఆర్‌ తన పురిటి గడ్డ చింతమడక రాబోతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి చింతమడకలో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని పేర్కొన్నారు. కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికేందుకు చింతమడక ప్రజలు సిద్ధమవుతున్నారని తెలిపారు.

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో గ్రామంలో పండగ వాతావరణం నెలకొందన్నారు. కాగా కేసీఆర్‌కు చింతమడకతో అవినాభావ సంబందం ఉందని పేర్కొన్నారు. ఆయన ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా.. చింతమడక ప్రజలతో ఆత్మీయ, సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారని  వెల్లడించారు. ఈ పర్యటన సందర్భంగా సీఎం తన సన్నిహితులు, స్నేహితులు, ప్రజలతో ఆత్మీయంగా గడపబోతున్నారని తెలిపారు. దీంతో పాటు వారితో కలిసి భోజనం చేస్తారని తెలిపారు. సీఎం పర్యటన నేపథ్యంలో గత వారం రోజులుగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చింతమడక గ్రామ ప్రజల కోరికలన్నీ తీర్చిబోతున్నారని.. ఈ పర్యటన కేవలం తన గ్రామస్తులతో మమేకమయ్యే పర్యటన మాత్రమే అని తెలిపారు. ఇతర గ్రామాల నుంచి ప్రజలు వచ్చి ఇబ్బంది పడొద్దన్నారు. త్వరలో మరోసారి సిద్దిపేటలో కేసీఆర్ పర్యటించనున్నారని.. అప్పుడు అందరికీ అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top