శభాష్‌ కమలాకర్‌ అంటూ అభినందించిన సీఎం

CM KCR Appreciates Minister Gangula Kamalakar - Sakshi

కరోనా కట్టడిలో విజయవంతమయ్యారని ప్రశంస

సాక్షి, కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లాలో కరోనా కట్టడిలో ముందుండి... అధికార యంత్రాంగాన్ని నడిపించడంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌  సఫలీకృతమయ్యారని సీఎం కేసీఆర్‌ అభినందించారు. ప్రగతిభవన్‌లో శనివారం సాయంత్రం జరిగిన కేబినేట్‌ సమావేశంలో కరీంనగర్‌లో కరోనా కట్టడికి చేపట్టిన పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మంత్రి గంగులపై ప్రశంసలు కురిపించారు. కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేషియాకు చెందిన పది మత ప్రచారకుల్లో కరోనా లక్షణాలు కనిపించడంతో గతనెల 16న హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి పంపించి.. వైరస్‌ జిల్లాలో వ్యాపించకుండా జిల్లా యంత్రాగాన్ని అప్రమత్తం చేయడంతోపాటు ముందుండి నడిపించారని తెలిపారు. చదవండి: ఏప్రిల్‌ 30 దాకా.. లాక్‌డౌన్‌ పొడిగింపు..

పది మంది విదేశీ బృందంతోపాటు స్థానికుడికి కూడా కరోనా పాజిటివ్‌ రావడంతో ఇండోనేషియన్లు బసచేసిన, వారి పర్యటించిన ప్రాంతాలను గుర్తించి రెడ్‌జోన్‌గా ప్రకటించారన్నారు. వైద్య బృందాలను రంగంలోకి దింపి ఇంటింటా సర్వే చేయించి అనుమానితులను హోం క్వారంటైన్‌ చేయించారని తెలిపారు. రెడ్‌జోన్‌లో హోం క్వారంటైన్‌లో ఉన్న వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని సౌకర్యాలు కల్పించి ఇళ్ల నుంచి బయటకు రాకుండా చేశారన్నారు. మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వ్యక్తులను గుర్తించి క్వారంటైన్‌ చేయడంలోనూ వేగంగా స్పందించి వైరస్‌ వ్యాప్తి లేకుండా చేయడంతో మంత్రి చూపిన చొరవను సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా పెద్ద ఎత్తున కేసులు నమోదైన జిల్లాగా కరీంనగర్‌ మొదటి వరుసలో ఉన్నా.. క్రమంగా ప్రైమరీ కాంటాక్టులు జరగకుండా కఠినంగా వ్యవహరించారన్నారు.

మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్‌ శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుజాత, నగర మేయర్‌ వై.సునీల్‌రావు, మున్సిపల్‌ కమిషనర్‌ క్రాంతి సహకారంతో కరోనాను కట్టడి చేయగలిగారన్నారు. కరోనా వ్యాప్తి అనూహ్యంగా ఆగిపోవడంతో అందరి దృష్టి కరీంనగర్‌పై పడిందని తెలిపారు. కరీంనగర్‌లో అమలు చేసిన నిబంధనలనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. కరీంనగర్‌లో ప్రస్తుతం అవలంబిస్తున్న విధానాన్నే కరోనా పూర్తిగా నియంత్రణ అయ్యే వరకూ కొనసాగించాలని సీఎం కేసీఆర్‌ సూచించినట్లు మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. చదవండి: వైరస్‌ మాటున లిక్కర్‌ దందా!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top