వైరస్‌ మాటున లిక్కర్‌ దందా!

Liquor Black Market Increased While Lockdown In Telangana - Sakshi

రాష్ట్రంలో 20 రోజులుగా లాక్‌డౌన్‌ ఉన్నా బ్లాక్‌లో యథేచ్ఛగా అమ్మకాలు

2–3 రెట్ల అధిక ధరలకు విక్రయిస్తున్న వైన్‌షాపుల యజమానులు

మందుబాబుల బలహీనతను ఆసరాగా చేసుకొని కాసుల వేట..

ఎక్సైజ్‌ శాఖ షాపులు సీజ్‌ చేయక పోవడంతో స్టాక్‌ ఖాళీ చేసిన వైనం

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నప్పటికీ మద్యం ప్రియుల బలహీనతను ఆసరాగా చేసుకొని గత 20 రోజులుగా యథేచ్ఛగా లిక్కర్‌ దందా సాగుతోంది. ఏ బ్రాండ్‌ ఫుల్‌ బాటిల్‌ కావాలన్నా బ్లాక్‌లో రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువ ధరకు లభి స్తోంది. ఈ పరిణామం వైన్‌షాపుల యజమానులకు, దళారులకు కాసుల పంట పండిస్తోంది.

దొడ్డిదారి... దుడ్లు రాలి
కరోనా వైరస్‌ నియంత్రణ కోసం ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మార్చి 22న జనతా కర్ఫ్యూ విధించగా ఆ రోజున రాష్ట్రం లోని వైన్‌షాపులన్నీ మూతపడ్డాయి. కానీ అదే రోజు సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో మార్చి 31 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించడంతోపాటు వైన్‌షాపుల మూసివేతకు ఆదేశించారు. అందుకు అనుగుణంగా సీఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ ఎక్సైజ్‌ శాఖ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. దీంతో వైన్‌షాపులను మూసేయాలని ప్రకటించినా వాటిని సీజ్‌ చేయలేదు. ఈ పరి ణామమే లిక్కర్‌ వ్యాపారులకు కలిసొచ్చింది. అధికారికంగా ఎక్సైజ్‌ అధికారులు షాప్‌లు సీజ్‌ చేయకపోవడంతో దొడ్డిదారిన షాపుల్లోని సరుకును బ్లాక్‌మార్కెట్‌కు మళ్లిస్తూ రెండు, మూడింతల ధరకు దళారుల సాయంతో విక్రయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఎందుకంటే వైన్‌షాపుల్లో కాకుండా వ్యక్తిగతంగా దాచుకొనే సరుకు 20 రోజులపాటు మార్కెట్‌లో ఉండదని, వైన్‌షాపుల నుంచి సరుకు బయటకు వచ్చినందునే ఇన్ని రోజులు మార్కెట్‌లో మందు దొరికిందని, ఇప్పుడు దాదాపు వైన్‌షాపులు ఖాళీ అయ్యాయని ఎక్సైజ్‌ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. అయితే ఎక్సైజ్‌ వర్గాలు ఈ విషయంలో కళ్లు మూసుకొని వ్యవహరించారని, చిన్న, చిన్న కారణాలతో షాపులు తెరిచేందుకు కూడా (అమ్ముకొనేందుకు కాదు...సరుకు తరలించేందుకు) అంగీకరించారనే విమర్శలు కూడా లేకపోలేదు. ఎక్సైజ్‌ శాఖ ఉదాసీనత వల్లే వైన్‌షాపుల యజమానులు గుట్టుచప్పుడు కాకుండా మద్యాన్ని మళ్లించారనే 
చర్చ జరుగుతోంది.

చెప్పేదొకటి.. జరిగిందొకటి
కరోనా లాక్‌డౌన్‌ వల్ల తమకు రూ. లక్షల్లో నష్టాలు వస్తున్నట్లు వైన్‌షాపు యజమానులు పైకి చెబుతున్నా లోలోపల మాత్రం సంబరపడుతున్నారని, కరోనా కాసులు మరికొన్నాళ్లు కురిస్తే బాగుండని అంతర్గతంగా చర్చించుకుంటున్నారని తెలుస్తోంది. ‘జనతా కర్ఫ్యూ తెల్లారి షాపులు తెరుద్దామనుకుంటే అదే రోజు లాక్‌డౌన్‌ అని చెప్పి షాపులు బంద్‌ చేయమన్నరు. గుండె గుభేల్‌మంది. కానీ షాపులు సీజ్‌ చేయలేదు కాబట్టి బతికిపోయాం. షాపులోని సరుకు ఎలాగొలా బయటకు తీసుకొచ్చి అమ్మేసినం. రెండు, మూడు రోజులైనా వెసులుబాటు ఇస్తే బాగుండు. డిపోల నుంచి స్టాక్‌ తెచ్చి పెట్టుకోవచ్చు. ఇప్పటిలాగే రూపాయికి రెండు, మూడు రూపాయిలకు అమ్ముకోవచ్చు... పైపెచ్చు సాధారణ పరిస్థితి రాగానే ఎన్ని రోజులయితే లాక్‌డౌన్‌ చేశారో... అన్ని రోజుల లైసెన్స్‌ పొడిగించాలని కరోనా పరిహారం కింద డిమాండ్‌ చేయొచ్చు’అని వైన్‌షాపుల యజమానులు అంతర్గతంగా మాట్లాడుకుంటున్నట్లు సమాచారం.

బార్ల యజమానులు విలవిల...
రాష్ట్రంలో వైన్‌షాపుల యజమానులు యథేచ్ఛగా బ్లాక్‌లో దందా సాగిస్తుండగా బార్ల యజమానులు మాత్రం అల్లాడిపోతున్నారు. వాస్తవానికి వైన్‌షాపుల కంటే బార్లకు పెట్టుబడి ఎక్కువ. లైసెన్స్‌ ఫీజూ ఎక్కువే. కానీ వైన్‌ షాపులను మూసేయడానికి వారం ముందు నుంచే రాష్ట్రంలో బార్లు మూసేశారు. అక్కడ ఎలాగూ కూర్చొని తాగే అవకాశం ఉండదు కాబట్టి బ్లాక్‌లో దందాకు అవకాశం లేదు. దీంతో ఎప్పుడు సాధారణ పరిస్థితి వస్తుందా... మళ్లీ ఎప్పుడు బార్లు తెరుద్దామా అని కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top