‘కత్తెర’ కాటు

Central team visited Siddipet district - Sakshi

పత్తి, మొక్కజొన్న పంటలపై దాడి

గడగడలాడిస్తున్న పురుగులు

సిద్దిపేట జిల్లాను పరిశీలించిన కేంద్ర బృందం

పుంజుకున్న వరి నాట్లు... ఇప్పటివరకు 74 శాతం విస్తీర్ణంలో నాట్లు

సాక్షి, హైదరాబాద్‌:‘గులాబీ’గుబులు రేపుతోంది. ‘కత్తెర’కాటు వేస్తోంది. పురుగులు చేల వైపు పరుగులు తీస్తున్నాయి. పంటలపై దాడి చేస్తున్నాయి. పత్తిని గులాబీరంగు పురుగు, మొక్కజొన్నను కత్తెర పురుగు పీల్చి పిప్పి చేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ఆ రెండు పంటల పరిస్థితి దయనీయంగా మారింది. మెదక్, వికారాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో పూత దశలో ఉన్న పత్తి పంటకు గులాబీ పురుగు సోకినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లోనూ దాని ఛాయలు కనిపిస్తున్నాయని ఆ శాఖ వర్గాలు తెలిపాయి.

పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 42.99 లక్షల(102%) ఎకరాల్లో సాగైంది. అందులో దాదాపు 15 శాతం వరకు గులాబీ రంగు పురుగు సోకినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పలు జిల్లాల్లో మొక్కజొన్న పంటను తీవ్రంగా నష్టపరుస్తున్న కత్తెర పురుగు ఉధృతిని కేంద్రం అత్యవసర పరిస్థితిగా గుర్తించిందని కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రానికి చెందిన మొక్కల సంరక్షణ అధికారి ఒకరు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు ఇటీవల సిద్దిపేట జిల్లా గజ్వేల్, వర్గల్‌ మండలాల్లో మొక్కజొన్న చేలను పరిశీలించారు. ఎక్కడ చూసినా కత్తెర పురుగు ధాటికి తీవ్రంగా ధ్వంసమైన పంటలే కనిపించాయి.

వాటిలో మొక్కలకు ఆశించిన పురుగులను, వాటి గుడ్లను, లార్వాను పరిశీలించారు. విదేశాల నుంచి వచ్చిన ఈ కత్తెర పురుగు(ఫాల్‌ ఆర్మీ వామ్‌)పై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని వారు పేర్కొన్నారు. ఇప్పటికే సిద్దిపేట జిల్లాల్లో 50 శాతం మేర మొక్కజొన్నకు నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. దీనిపై కేంద్రానికి ఆ బృందం నివేదిక సమర్పించనుంది. తెలంగాణ మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 13.40 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 10.88 లక్షల ఎకరాల్లో సాగైంది. రాష్ట్రంలో ఏ స్థాయిలో కత్తెర పురుగు సోకిందోనన్న ఆందోళన రైతులను పట్టి పీడిస్తోంది. ఆసియాలో కర్ణాటక తర్వాత తెలంగాణలోనే ఈ పురుగు కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో వరినాట్లు పుంజుకున్నాయి. 17.52 లక్షల (74%) నాట్లు పడినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది.  

12 జిల్లాల్లో లోటు వర్షపాతమే...
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నా ఇప్పటికీ 13 జిల్లాల్లో లోటు వర్షపాతమే ఉంది. కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, యాదాద్రి, మేడ్చల్, హైదరాబాద్, వికారాబాద్, వనపర్తి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని వ్యవసాయశాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, కొమురంభీం, పెద్దపల్లి, జయశంకర్, భద్రాద్రి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదుకాగా, మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం రికార్డు అయింది.

విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారి శుక్రవారం ఉదయానికి నైరుతి మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

ఈ ప్రభావంతో తెలంగాణలో శని, ఆదివారాల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్‌ కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కొమురంభీం, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌ జిల్లాలలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలతోపాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సీనియర్‌ అధికారి రాజారావు తెలిపారు. అనేకచోట్ల భారీవర్షాల కారణంగా పెద్ద ఎత్తున పంటలు మునిగిపోయాయి. దాదాపు 50 వేల ఎకరాల్లో పంటలు మునిగినట్లు అంచనా వేస్తున్నారు. పంటలు మునుగుతుంటే పట్టించుకునే నాథుడే లేకుండా పోయారన్న విమర్శలున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top