సిటీలో కార్‌ పూలింగ్‌కు డిమాండ్‌..! | Car Pooling Demand in Hyderabad | Sakshi
Sakshi News home page

కలిసి వెళ్దాం!

Jul 22 2019 9:32 AM | Updated on Jul 24 2019 1:13 PM

Car Pooling Demand in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ హైదరాబాద్‌లో ‘కార్‌ పూలింగ్‌’కు డిమాండ్‌ పెరుగుతోంది. వేలాది మంది ఐటీ ఉద్యోగులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. నాలుగేళ్ల క్రితం నగర ప్రజా రవాణాలో అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సౌకర్యం ఉబర్, ఓలా వంటి క్యాబ్‌ సంస్థలతో పోటీ పడుతోంది. ప్రతి రోజు సుమారు 5000 రైడ్స్‌ నమోదవుతున్నట్లు కార్‌పూలింగ్‌  యాప్‌ల అంచనా. ఒకే ప్రాంతంలో ఉంటూ ఒకే చోట పనిచేసే ఉద్యోగులు ఎవరికి వారు సొంత కార్లలో విడివిడిగా వెళ్లడం కంటే  నలుగురు కలిసి ఒకదాంట్లో వెళ్లడమే ఈ ‘కార్‌ పూలింగ్‌’. దీనివల్ల ట్రాఫిక్‌ రద్దీ ఇబ్బంది ఉండకపోగా.. రవాణా ఖర్చులు సైతం భారీగా తగ్గుతాయి. ప్రతి రోజు సుమారు 50 వేల మందికి పైగా ఐటీ, ఇతర ప్రైవేట్‌ సంస్థల్లో పనిచేసే  ఉద్యోగులు కార్‌పూలింగ్‌ను వినియోగించుకుంటున్నట్టు అంచనా. ఈ సేవ లను అందజేస్తున్న క్విక్‌ రైడ్, ఎస్‌ రైడ్‌ వంటి మొబైల్‌ అప్లికేషన్లలో సుమారు 2.5 లక్షల మంది పేర్లను నమోదు చేసుకొన్నారు. అవసరమైనప్పుడు కార్‌ పూలింగ్‌ సేవలను సద్వినియోగం చేసుకొనేందుకు అనువుగా పలు ఐటీ సంస్థలు తమ ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నాయి. హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, లిం గంపల్లి, మియాపూర్, నిజాంపేట్, కూకట్‌పల్లి, ఎస్‌ఆర్‌నగర్, వెంగళరావునగర్, అమీ ర్‌పేట్, పంజగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, యూసుఫ్‌గూడ, శ్రీనగర్‌ కాలనీ, జూబ్లీ హిల్స్, కోకాపేట, తెల్లాపూర్‌ రూట్లలో కార్‌ పూలింగ్‌ సదుపాయం  బాగా విస్తరించింది. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటున్నాయి. క్విక్‌ రైడ్‌  వంటి యాప్‌లు కిలోమీటర్‌కు రూ.3 చొప్పున వసూలు చేస్తున్నాయి. 

గ్రేటర్‌లో వాహన విస్ఫోటం
గ్రేటర్‌ హైదరాబాద్‌లో రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.  ప్రతి ఒక్కరు వ్యక్తిగత వాహనాలపైనే ఆధారపడుతున్నారు. మెట్రో కొంతవరకు అందుబాటులో ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో సేవలు విస్తరిస్తే తప్ప మార్పు కనిపించదు. మరోవైపు గత పదేళ్లుగా ఆర్టీసీలో ఎలాంటి పురోగతి లేదు. దీంతో రహదారులపై వాహనాలు పోటెత్తుతున్నాయి. సుమారు 35 లక్షల బైక్‌లు, మరో 15 లక్షల వ్యక్తిగత కార్లు పరుగులు తీస్తుండగా, 50 వేల క్యాబ్‌లు, ట్యాక్సీలు, 1.4 లక్షల ఆటోరిక్షాలు, 3500 ఆర్టీసీ బస్సులు మాత్రమే రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి.

బంధాలు బలోపేతం
కార్‌ పూలింగ్‌ మరో సరికొత్త సాంప్రదాయాన్ని కూడా నగరానికి పరిచయం చేస్తోం ది. అప్పటి వరకు ఒకే సంస్థలో లేదా పక్క పక్క సంస్థల్లో పనిచేసేవారు, ఒకే అపార్ట్‌మెంట్‌లో, ఒకే కాలనీలో ఉంటున్నా ఏ మాత్రం పరిచయం లేకుండా ఎవరికి వారే రాకపోకలు సాగించేవారు. కార్‌పూలింగ్‌లో ఇలాంటి వారి మధ్య స్నేహం పెరుగుతోంది. తమ సంస్థలో లేదా తమ పక్కన ఉన్న మరో సంస్థలో పనిచేసే ఉద్యోగులతో కలిసి వెళ్లేందుకు చాలా మంది సంతోషంగానే ముందుకు వస్తున్నారు.  మహిళా ఉద్యోగులకు ఇది మరింత నమ్మకమైన రవాణా సదుపాయంగా ముందుకు వచ్చింది. 

అలా మొదలైంది..
హైటెక్‌సిటీలో పెరుగుతున్న వాహనాల రద్దీ దృష్ట్యా ఇబ్బందులను తొలగించేందుకు 2015లో హైసియా ఆధ్వర్యంలో ‘కార్‌ ఫ్రీ థర్స్‌డే’కు శ్రీకారం చుట్టారు. ప్రతి గురువారం సొంత వాహనాలను ఇంటి వద్ద ఉంచి కేవలం ప్రజరవాణా వాహనాల్లోనే రావాలని ప్రతిపాదించగా అనూహ్య స్పందన వచ్చింది. ఆర్టీసీ అదనపు బస్సులను ఏర్పాటు చేసింది. కొంతకాలం పాటు కార్‌ ఫ్రీ థర్స్‌డే  కొనసాగింది. ఈ క్రమంలో కార్‌ పూలింగ్‌ కాన్సెప్ట్‌ బలంగా ముందుకు వచ్చింది. 

కొత్త స్నేహితులు..
కార్‌పూలింగ్‌తో రవాణా ఖర్చులు తగ్గాయి. ఓలా, ఊబర్‌లో రూ.250 ఖర్చయితే, ఇక్కడ రూ.100 మాత్రమే అవుతోంది. అంతేకాదు.. వేర్వేరు సంస్థల్లో పనిచేసే వారి మధ్య స్నేహం కూడా పెరుగుతోంది. కెరీర్‌కు ఈ పరిచరం ఉపయోగపడుతుంది. మహిళలకు ఒక నమ్మకమైన సదుపాయం ఇది.– విశాల, సాఫ్ట్‌వేర్‌ నిపుణురాలు

ఆగస్టులో వేడుకలు  
సిటీలో కార్‌ పూలింగ్‌ సేవలు పెరుగుతున్నాయి. తక్కువ ఖర్చు కావడం వల్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. బెంగళూరులో ఇటీవల కార్‌పూలింగ్‌ అవార్డు వేడుకలు జరిగాయి. ఆగస్టులో ఇక్కడా నిర్వహించి అత్యధికంగా కార్‌పూలింగ్‌ సేవలందజేసిన వారిని సన్మానిస్తాం.– బ్రజేష్‌ నాయర్, క్విక్‌ రైడ్‌ హెడ్‌

శాశ్వత పరిష్కారం కాదు  
కార్‌ పూలింగ్‌ అదనపు సదుపాయం మాత్రమే. శాశ్వత పరిష్కారంగా భావించలేం. అన్ని రూట్లలో ప్రజారవాణా సదుపాయాలు మెరుగుపడాలి. ప్రజలు కచ్చితంగా బస్సుల్లో, రైళ్లలో తిరిగేలా ప్రజారవాణా విస్తరిస్తే తప్ప ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం కాదు. – ప్రశాంత్‌ బచ్చు,రవాణా నిపుణుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement