వరంగల్‌లో దళారీ దందా

Broker People Doing Corruption In Warangal - Sakshi

సాక్షి, హన్మకొండ : జిల్లా కేంద్రంలో నిత్యం అత్యంత రద్దీగా ఉండే ప్రభుత్వ కార్యాలయం ఏదైనా ఉందంటే అది కాజీపేట తహసీల్దార్‌ కార్యాలయమే అని చెప్పాలి. జిల్లాల విభజన, కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు క్రమంలో హన్మకొండ, ధర్మసాగర్‌ మండలాల నుంచి కొన్ని గ్రామాలను కలిపి కాజీపేట మండలాన్ని ఏర్పాటు చేశారు. తొలుత మడికొండలో ఏర్పా టు చేసిన ఈ కార్యాలయాన్ని ఆ తర్వాత కాజీ పేట మినీ మునిసిపాలిటీ భవనంలోకి మార్చారు. ప్రస్తుతం ఒకే హాల్‌లో కొనసాగుతున్న ఈ కార్యాలయంలో దళారులు రాజ్యమేలుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా రెవెన్యూ కార్యాలయానికి ఏదైనా పనిపై వెళ్లాలంటే ఉద్యోగులు ఎన్ని కొర్రీలు పెడతారోననే అంతా ఆందోళన చెందుతారు. కానీ ఇక్కడ మాత్రం దళారుల తీరు ఆ ఉద్యోగులకే ముచ్చెమటలు పట్టిస్తోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఎక్కువ వ్యవసాయ భూములే...
కాజీపేట తహసీల్‌ పరిధిలో ఉన్న గ్రామాల్లో ఎక్కువగా వ్యవసాయ భూములు ఉన్నాయి. గత దశాబ్దాల కాలంగా ఆయా గ్రామాల్లో పనిచేసిన వీఆర్వోలు, ఇతర రెవెన్యూ అధికారుల కారణంగా గ్రామాల్లో భూసమస్యలు కోకొల్లలు. ఇక రికార్డుల్లో పేర్లు లేకున్నా రైతుల దగ్గర పాస్‌ పుస్తకాలు ఉంటాయి. పుస్తకాల్లో ఒక పేరుం టే రికార్డుల్లో మరో పేరు ఉంటుంది. ఇలా ఈ మండలం పరిధిలోని ఒక్కో గ్రామానికి ఒక్కో చరిత్ర ఉంటుంది. ఇలాంటి అంశాలే ప్రసుత్తం దళారులకు ఆదాయ వనరులుగా మారాయి. కాజీపేట తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిత్యం పదుల సంఖ్యలో దళారులు సమస్యలపై వచ్చిన రైతులు, బాధితులను వలలో వేసుకుంటున్నారు.

అన్నన్నా మనోడే
కార్యాలయానికి వచ్చే బాధితులను దళారులు ఆవరణలో కలిసి మాట కలుపుతారు. ఆ తర్వాత ఏ పని పై వచ్చింది తెలుసుకుంటారు. ఆ పని చేయాలంటే కార్యాలయంలో పెద్ద మొత్తంలో డబ్బు అడుగుతారని బెదిరిస్తారు. అయితే, తమకు కొద్ది మొత్తం ఇస్తే చాలు పని చేయిస్తామని నమ్మబలికి వారి దరఖాస్తు తీసుకుని సెటిల్‌ చేసుకుంటున్నారు. ఇక అధికారుల వద్దకు వెళ్లి ‘అన్నా మనోడే.. చాలా దగ్గర’ పని చేసి పెట్టాలని చెపుతున్నారు.

అయితే, ఎవరైనా అధికారి కానీ ఉద్యోగి కానీ ఈ దళారుల వ్యవహారాన్ని గమనించి ఇదేంటని ప్రశ్నించినా, పనిచేయకుండా దరఖాస్తు పక్కన పెట్టినా.. ఇక వారికి చుక్కలు చూపిస్తున్నారు. దళారులంతా ఒక్కటై ఉద్యోగుల విషయంలో  అధికారుల ఫిర్యాదు చేయడం... ఆకాశ రామన్న ఉత్తరాలు రాయడం, పలు సంఘాల నాయకులు, లోకల్‌ లీడర్లతో ఫోన్‌ చేయిండం వంటివి నిత్యకృత్యమయ్యాయి. దీంతో చేదేసేం లేక ఉద్యోగులు తమ ఇబ్బందులను అధికారులకు మొరపెట్టుకున్నారు. 

స.హ. చట్టం పేరుతో...
మరికొందరు దళారులు తమ మాట వినని అధికారికి చుక్కలు చూపించేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తుంటారు. సమాచార హక్కు చట్టం ద్వారా దశాబ్దాల రికార్డులు కావాలని దరఖాస్తు చేయడం..  సమయానికి సమాచారం ఇవ్వకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడాన్ని అలవాటుగా పెట్టుకున్నారు. ఒకే వ్యక్తి పేరుతో పదే పదే దరఖాస్తులు రావడంతో అధికారులకు అనుమానం వచ్చినా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.

ఒకవేళ సమాచారం ఇవ్వలేని పక్షంలో పైఅధికారులకు అప్పీల్‌ చేసుకోవాలని సూచించినా గొడవలకు దిగుతున్నారు. దీంతో అధికారులు చేసేదేం లేక దళారులకు తొలిప్రాధాన్యం ఇవ్వడం ద్వారా సమస్యను అధిగమిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఇదే ఇబ్బందిగా మారుతోంది. లేనిపోని గొడవలు తమకెందుకని నేరుగా వచ్చిన దరఖాస్తులు పక్కన పెట్టి మరీ దళారులతో వచ్చిన వారికి ముందు పనిచేసి పెడుతున్నారని ఆరోపణలు ఉద్యోగులపై ఎక్కువయ్యాయి. 

అధికారుల మందలింపు
దళారుల ఆగడాలు పెచ్చుమీరి పోవడంతో చేసేది లేక స్వయంగా ఉన్నతాధికారే... ఇటీవల కొందరిని పిలిచి సుతిమొత్తగా మందలించినట్లు తెలిసింది. ‘చూడండి ఆఫీస్‌కు వచ్చే ప్రతివారిని మీరే అడ్డగించి మా వారే అంటూ పైరవీ చేస్తే కష్టం... ఏదో ఒకటి రెండు పనులు ఉంటే రండి, చేయించుకోండి వెళ్లండి. కానీ ఉదయం నుంచి సాయంత్రం దాకా కార్యాలయం, ఆవరణలో మీరే ఉంటే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.’ అంటూ స్వయంగా కార్యాలయంలోని ఉన్నతాధికారులు దళారులతో మాట్లాడారంటే కార్యాలయంలో వారి హవా ఏంటో తెలుస్తోంది. ఇప్పటికైనా వీరి విషయంలో అధికారులు కఠిన నిర్ణయం తీసుకోకపోతే తాము పనిచేయడం కష్టమని ఉద్యోగులు వాపోతున్నారు.

పక్కనే మినీ మునిసిపల్‌
కాజీపేట మినీ మున్సిపల్‌ కార్యాలయం కూడా కాజీపేట తహసీల్దార్‌ కార్యాలయం పక్కనే ఉం టుంది. అక్కడా నిత్యం పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు సమస్యలపై వస్తుంటారు. అలాంటి వారిని దళారులు అడ్డగించి తాము పనిచేయిస్తామని డబ్బు లాగుతున్నట్లు సమాచారం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top