నాలుగేళ్లుగా నత్తనడకే..!

Bridge Construction Delay On Godavari River At Bhadrachalam - Sakshi

భద్రాద్రి రెండో బ్రిడ్జి పూర్తయ్యేదెప్పుడో ?  

వంతెన పనుల్లో కొనసాగుతున్న జాప్యం 

ఇంకా పిల్లర్ల నిర్మాణ దశలోనే..  

భద్రాచలంటౌన్‌: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రంలో గోదావరి నదిపై రెండో వంతెన నిర్మాణ పనులు ప్రారంభించి నాలుగేళ్లు కావస్తున్నా నేటికీ నత్తనడకనే సాగుతున్నాయి. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే భద్రాచలానికి రవాణా సౌకర్యాలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. దేశం నలుమూలల నుంచి భద్రాద్రి రామయ్యను దర్శించుకునేందుకు నిత్యం ఎంతోమంది భక్తులు వస్తుంటారు. వారికి ఇబ్బంది కలుగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. గోదావరి నదిపై ప్రస్తుతం ఉన్న పాత బ్రిడ్జిని ఆనుకునే కొత్త వంతెన నిర్మిస్తున్నారు. అయితే పనుల్లో తీవ్ర జాప్యం జరగడంతో నాలుగేళ్లు కావస్తున్నా ఇంకా పిల్లర్ల నిర్మాణమే పూర్తి కాలేదు. 1964లో గోదావరిపై మొదట వారధి నిర్మించారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడి శా, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల రాకపోకలకు భద్రాచలం కీలకంగా మారింది. దీంతో పెరుగుతున్న వాహనాల రద్దీ దృష్ట్యా రెండో వంతెన నిర్మించాలని ప్రభుత్వం యోచించింది.  
2015లో శంకుస్థాపన.. 
ఈ బ్రిడ్జి నిర్మాణ పనులకు 2015 ఏప్రిల్‌ 1న కేంద్రమంతి నితిన్‌ గడ్కరీ, అప్పటి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలసి శంకుస్థాపన చేశారు. రూ.90 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు తయారు చేయగా, రూ.65 కోట్లకు ఓ కాంట్రాక్టర్‌ పనులు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఉన్న గోదావరి వంతెనకు సమానంగా దాని పక్కనే 36 పిల్లర్లతో పనులు చేపట్టారు. ఇంకా కొన్ని పిల్లర్ల నిర్మాణం పూర్తి కాలేదు. గోదావరిలో నీరు ఉండడంతో పనులకు ఆటంకం కలుగుతోంది. నిర్మాణం చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు  గోదావరికి మూడుసార్లు వరదలు వచ్చాయి. కాగా సాంకేతిక సమస్య సైతం జాప్యానికి కారణమవుతోంది.

సారపాక వైపు నుంచి గోదావరి నదిపై నిర్మించిన రెండు పిల్లర్లను సాంకేతిక సమస్యలతో కూల్చివేశారు. అయితే ఈ మార్గంలో పిల్లర్ల నిర్మాణ పనులు ప్రస్తుతం కొంత పురోగతిలో ఉ న్నప్పటికీ.. భద్రాచలం నుంచి ప్రారంభించిన పిల్లర్ల నిర్మాణం లో మాత్రం తీవ్ర జాప్యం నెలకొంది. ఇంజనీరింగ్‌ అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల బాధ్యతా రాహిత్యంతో ప్రయాణీకులకు క ష్టాలు తప్పడం లేదు. ఇక్కడ కొ న్ని పిల్లర్లు ఇంకా పునాది దశలో నే ఉన్నాయి.  రెండో వంతెన పనులను నేషనల్‌ హైవేస్‌ ద్వారా కేంద్రప్రభుత్వం పనులు చేపడుతున్నందున జాప్యం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు.  
పూర్తయిన పిల్లర్లపై ట్రాక్‌ బెడ్‌ పనులు...  
సారపాక నుంచి భద్రాచలం వైపు రెండో వంతెన పనుల్లో 18 పిల్లర్లు పూర్తి కాగా, 11 పిల్లర్లపై ట్రాక్‌ బెడ్‌ పనులు చేపట్టారు. అయితే  భద్రాచలం నుంచి సారపాక వెళ్లే వంతెన పనుల్లోనే తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ ప్రాంతంలో రాళ్లు ఎక్కువగా ఉండడం కూడా పనుల జాప్యానికి కారణమవుతోంది. ప్రస్తుతం ఎండాకాలంలో గోదావరిలో నీటిమట్టం 4 నుంచి 5 అడుగుల మధ్యనే ఉంటుంది. జూన్‌లోపు పనులను వీలైనంత వరకు పూర్తి చేస్తే బాగుంటుందని స్థానికులు అంటున్నారు. జూలై నుంచి అక్టోబర్‌ వరకు వరదలు వచ్చే అవకాశం ఉంటుందని, అప్పుడు మళ్లీ జాప్యం జరుగుతుందని చెపుతున్నారు.   
పనుల వేగవంతానికి చర్యలు 
కొన్ని సాంకేతిక కారణాలతో వంతెన నిర్మాణంలో జాప్యం జరుగుతున్న మాట నిజమే. భద్రాచలం వైపు ఎక్కువగా రాళ్లు ఉండడం, ఈ ప్రాంతంలోనే ప్రవాహం ఉండడంతో పిల్లర్ల నిర్మాణం ఆలస్యమైంది. పనులు వేగంగా చేయాలని కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తెస్తున్నాం. గతేడాది నుంచి కొంత వేగంగానే సాగుతున్నాయి. మరో ఏడాది గడువు పెంచిన నేపథ్యంలో ఈ వ్యవధిలోనే పనులు పూర్తయ్యేలా కృషి చేస్తాం. ఇప్పటికే రెండు భారీ క్రేన్లు కూడా తెప్పించాం. రెండు, మూడు నెలల్లో పనులు చాలా వరకు పూర్తవుతాయి.  
                                                                                                                  –శైలజ, నేషనల్‌ హైవే డీఈ   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top