ఛత్తీస్‌గఢ్‌ కరెంట్‌కు బ్రేక్‌! 

Break to the Chhattisgarh Current - Sakshi

కొన్ని నెలలుగా సరఫరా అంతంత మాత్రమే 

అక్కడి మార్వా థర్మల్‌ కేంద్రంలో సాంకేతిక సమస్యలతోనే..

సాక్షి, హైదరాబాద్‌: ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వంతో కుదుర్చుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం ప్రకారం ఆ రాష్ట్రం నుంచి తెలంగాణకు సరఫరా కావాల్సిన 1000 మెగావాట్ల విద్యుత్‌కు బ్రేక్‌పడింది. ఛత్తీస్‌గఢ్‌లోని 1000 మెగావాట్ల మార్వా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కావడంతో కొన్ని నెలలుగా రాష్ట్రానికి అంతంత మాత్రమే విద్యుత్‌ సరఫరా జరుగుతోంది. కొంతకాలంగా 500 మెగావాట్ల లోపు మాత్రమే విద్యుత్‌ సరఫరా కాగా, తాజాగా అది కూడా పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుత పరిస్థితిలో విద్యుత్‌ సరఫరా చేయలేమని, సాంకేతిక సమస్యలను అధిగమించి విద్యుదుత్పత్తిని పునరుద్ధరించేందుకు కొంత సమయం కావాలని తెలంగాణ జెన్‌కో అధికారులకు ఛత్తీస్‌గఢ్‌ అధికారులు విజ్ఞప్తి చేశారు. దీనికి జెన్‌కో యాజమాన్యం సానుకూలంగా స్పందించింది. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి కరెంటు తెచ్చుకోవాల్సిన అవసరం లేకపోవడంతో సర్దుకుపోవాలని నిర్ణయించినట్లు తెలంగాణ జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌ రావు వెల్లడించారు. 

కరెంట్‌కు బదులు కరెంట్‌ : విద్యుత్‌ విషయంలో ఇతర రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిని తెలంగాణ జెన్‌కో ఈ ఏడాది కూడా అమలు చేస్తోంది. ఏకధాటి వర్షాలతో రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్‌ డిమాండ్‌ తగ్గిపోవడం, జల విద్యుదుత్పత్తి కూడా ప్రారంభం కావడంతో రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ మిగిలిపోతోంది. రాష్ట్ర అవసరాలు తీరాక, మిగిలిన విద్యుత్‌ను జెన్‌కో కర్ణాటక, పంజాబ్‌ రాష్ట్రాలకు ‘ఇచ్చిపుచ్చుకునే విధానం’లో సరఫరా చేస్తోంది. జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రం నుంచి జెన్‌కో 240 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తోంది. రాష్ట్ర అవసరాలు పోగా, మిగిలిన 200 మెగావాట్లను కర్ణాటకకు, 500 మెగావాట్లను పంజాబ్‌కు సరఫరా చేస్తోంది. తమకు అవసరం వచ్చినప్పుడు తిరిగి పొందేలా కర్ణాటకతో ఒప్పందం కుదుర్చుకున్నామని ప్రభాకర్‌ రావు తెలిపారు.  

రెండేళ్లుగా ఇదే విధానం : నాలుగు రోజులుగా ఉత్పత్తి అయిన 200 మెగావాట్ల విద్యుత్తును కర్ణాటకకు ఇస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్‌ ఉన్నప్పుడు దేశంలో ఏ రాష్ట్రానికి అవసరముంటే.. వారికి సరఫరా చేసి, వేసవిలో తెలంగాణకు డిమాండు ఉన్నప్పుడు తిరిగి పొందే విధానాన్ని  జెన్‌కో గత రెండేళ్లుగా అవలంభిస్తున్నది. పవర్‌ బ్యాంకింగ్‌ విధానంగా పిలిచే ఈ పద్ధతి ద్వారా గతంలో రాజస్తాన్‌కు కూడా తెలంగాణ జెన్‌కో విద్యుత్‌ సరఫరా చేసింది.  వేసవిలో రాజస్తాన్‌ నుంచి కరెంటు పొందింది. ఇప్పుడు పంజాబ్‌కు విద్యుత్‌ అందిస్తున్నట్లు ప్రభాకర్‌రావు చెప్పారు. ఇలా గరిష్ట డిమాండ్‌ ఉన్న సమయంలో ఎక్కువ ధరకు కొనాల్సిన అవసరం రాదని ప్రభాకర్‌ రావు వివరించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top