బయోమెట్రిక్‌నే.. ఏమారుస్తున్నారు!

Biometric Crime Reveals in GHMC Scam in Sim Cards  - Sakshi

సిమ్‌కార్డుల కోసం సంతోష్‌కుమార్‌

కాలేజీల్లో హాజరు నమోదుకు మరో ఇద్దరు

తాజాగా జీహెచ్‌ఎంసీ స్కామ్‌తో కలకలం

మెషిన్ల అప్‌గ్రేడ్‌ అనివార్యం: నిపుణులు

సాక్షి, సిటీబ్యూరో: వేలిముద్రల ఆధారంగా పని చేసే బయోమెట్రిక్‌ విధానాలు అత్యంత భద్రమైన మార్గంగా భావిస్తూ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు దీనిని అవలంభిస్తున్నాయి. మరోపక్క కేవలం హాజరు నమోదు తదితర పరిపాలన పరమైన అంశాల్లోనే కాకుండా, కేసులను కొలిక్కి తీసుకురావడం మొదలు నేరగాళ్లను దోషులుగా నిరూపించడం వరకు అన్నింటిలోనూ వేలిముద్రలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో కొందరు కేటుగాళ్లు బయోమెట్రిక్‌ వ్యవస్థనే ఏమారుస్తూ వరుస సవాళ్లు విసురుతున్నారు. గడిచిన ఆరు నెలల్లో ఈ తరహా నకిలీ వేలిముద్రల ఉదంతాలు మూడు వెలుగులోకి వచ్చాయి. 

సిమ్‌కార్డుల టార్గెట్‌ కోసం సంతోష్‌...
కరీంనగర్‌ జిల్లా, ధర్మారానికి చెందిన సంతోష్‌ కుమార్‌ను గత ఏడాది జూన్‌లో ఎస్సార్‌నగర్‌ పోలీసులు పట్టుకున్నారు. బీఎస్సీ చదువుతూ మధ్యలో మానేసిన అతను కేవలం సిమ్‌కార్డుల ‘టార్గెట్‌’ పూర్తి చేసుకునేందుకు నకిలీ వేలిముద్రలు తయారు చేసి సంచలనం సృష్టించాడు. ధర్మారం బస్టాండ్‌ సమీపంలో ధనలక్ష్మీ కమ్యూనికేషన్స్‌ పేరుతో దుకాణం ఏర్పాటు చేసిన సంతోష్‌ వొడాఫోన్‌ ప్రీ–పెయిడ్‌ కనెక్షన్స్‌ డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించాడు. తన ‘టార్గెట్‌’ పూర్తి చేసుకోవడానికి ఈ–కేవైసీ వెరిఫికేషన్‌ తప్పనిసరి కావడంతో రబ్బర్‌ స్టాంపుల తయారీ యంత్రాన్ని వినియోగించి నకిలీ వేలిముద్రలు తయారు చేసే విధానం నేర్చుకున్నాడు. పాలిమార్‌ కెమికల్‌ను వినియోగించి వీటిని తయారు చేసేవాడు. 

కళాశాల్లో హాజరు కోసం రామకృష్ణ...  
కళాశాలల్లో హాజరు లెక్కింపునకు సంబంధించి జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్శిటీ (జేఎన్టీయూ) అమలులోకి తీసుకువచ్చిన బయోమెట్రిక్‌ వ్యవస్థనే ఏమార్చాడు రామకృష్ణ. ఓ మనిషికి సంబంధించిన వేలిముద్రలను క్లోనింగ్‌ చేసి, అతడు అక్కడ లేకున్నా అటెండెన్స్‌ పడేలా చేసిన అతడిని గత నవంబర్‌లో పోలీసులు పట్టుకున్నారు. మరో ప్రాంతంలో చదువుతున్న విద్యార్థులు అదే కాలేజీలో ఉన్నట్లు చూపించి భారీ స్థాయిలో ఫీజు రీ–యింబర్స్‌మెంట్‌ చేసుకునేందుకు సహకరించాడు. నగర శివార్లలోని వివేకానంద గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ కేంద్రంగా జరిగిన ఈ ఫింగర్‌ప్రింట్స్‌ క్లోనింగ్‌ స్కామ్‌ అప్పటికే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా, నర్పురానికి చెందిన బొమ్మ రామకృష్ణ మరో ఇద్దరితో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. పుస్తకాల దుకాణాల్లో దొరికేగ్లూతో పాటు ఇథనైల్‌ వినైల్‌ ఎసిటేట్‌(ఈవీఏ)అనే కెమికల్‌ వాడి వేలిముద్రలు సృష్టించేవాడు.

ఏనాటినుంచో  ఈ  ‘ముద్ర’..
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల హాజరు కోసం కృత్రిమ ఫింగర్‌ ప్రింట్స్‌ (సింథటిక్‌ ) వ్యవహారం జీహెచ్‌ఎంసీలో ఎంతోకాలంగా కొనసాగుతున్నా, వాటి గురించి తెలిసినవారు సైతం పట్టించుకోలేదని తెలుస్తోంది. కేవలం తొమ్మిది మంది శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్స్‌(ఎస్‌ఎఫ్‌ఏ)వద్దే 84 సింథటిక్‌ ఫింగర్‌ప్రింట్స్‌ లభించాయంటే..జీహెచ్‌ఎంసీలోని దాదాపు 950 మంది ఎస్‌ఎఫ్‌ఏల్లో ఎంతమంది ఇలాంటి చర్యలకు పాల్పడ్డారో.. ఎన్ని సింథటిక్‌ ఫింగర్‌ప్రింట్స్‌ చేయించి ఉంటారో అంతుపట్టడం లేదు. గతంలో ‘పరిచయం’ పేరిట పారిశుద్ధ్య కార్మికుల పేర్లు గోడల మీద రాసినప్పటికీ, వాటిల్లోని  అందరూ పనిచేయడం లేరు. గ్రూపులో ఉండాల్సిన ఏడుగురిలో ముగ్గురు, నలుగురితోనే పనులు చేయిస్తున్నారు. మిగతా వారందరివీ ఇలా సింథటిక్‌ ఫింగర్‌ప్రింట్స్‌తో హాజరు వేసి జీతాలు కాజేస్తున్నారు. ఈ వ్యవహారంలో జీహెచ్‌ఎంసీలోని వివిధ స్థాయిల్లోని అధికారులతోపాటు స్థానిక ప్రజాప్రనిధులకూ ప్రమేయం ఉందనే ఆరోపణలున్నాయి. దాదాపు ఏడాదిక్రితం నుంచే ఈ బోగస్‌ కార్మికుల ఉదంతాలు అక్కడక్కడా వెలుగు చూసినా అధికారులు తగిన చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.అందువల్లే మరింతగా బరి తెగించి ఒక్కో ఎస్‌ఎఫ్‌ఏ ఎన్ని వీలైతే అన్ని సింథటిక్‌  ఫింగర్‌ప్రింట్లను వినియోగించినట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో హాజరు పట్టికలోని కార్మికులంతా ఒకే కుటుంబానికి చెందినవారున్నారని సమాచారం. జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అధికారులు దాడులు చేసిన ప్రాంతాల్లోనే కాక జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా ఇలాంటి తంతంగం నడుస్తున్నదని చెబుతున్నారు. నాంపల్లి, ముషీరాబాద్, అంబర్‌పేట తదితర ప్రాంతాల్లోనూ ఇలాంటి వారిని గతంలో గుర్తించినప్పటికీ, అధికారులు తగిన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలున్నాయి. ఈ సింథటిక్‌ ఫింగర్‌ప్రింట్స్‌తో అక్రమాలు జరుపుతున్న ఎస్‌ఎఫ్‌ఏలే జీహెచ్‌ఎంసీలో కాంట్రాక్టర్లుగానూ పనిచేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పూర్తిస్థాయి విచారణలో  అన్ని వివరాలూవెల్లడి కానున్నాయి.

జీహెచ్‌ఎంసీలో .. పారిశుద్ధ్య కార్మికులు : 18,550
ఒక్కొక్కరి నెల వేతనం: రూ. 14,000
అందరి నెల వేతనం: రూ.  25,97,00,000
సంవత్సర వేతనం: రూ.  311,64, 00,000
శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు: 959
ఒక్కొక్కరి నెల వేతనం:  రూ. 14,500
అందరి నెల వేతనం:రూ.  1,39,05,500
సంవత్సర  వేతనం:రూ. 16,68,66,000
వెరసి ఏటా చెల్లించే మొత్తం  వేతనాలు:రూ. 328,32,66,000

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top