గ్యాసేనా..!

BGL Gas Distribution Project Delayed in Hyderabad - Sakshi

2011లో ప్రారంభించిన బీజీఎల్‌  

ఇప్పటి వరకు కేవలం 10,579 పీఎన్‌జీ కనెక్షన్లు  

46.6 కిలోమీటర్ల మేరనే పైప్‌లైన్‌ పనులు  

సీఎన్‌జీ స్టేషన్లు 45 మాత్రమే  

ఎనిమిదేళ్లయినా లక్ష్యం చేరని వైనం

సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ఇళ్లకు నేరుగా పైప్‌లైన్‌ ద్వారా వంటగ్యాస్‌ అందించాలనే లక్ష్యంతో భాగ్యనగర్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ (బీజీఎల్‌) 2011లో ప్రారంభించిన సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్రాజెక్టు నత్తనడకన సాగుతోంది.

ఎనిమిదేళ్లయినా లక్ష్యం చేరుకోలేదు. దీంతో పైప్‌లైన్‌ ద్వారా వంటగ్యాస్‌ చౌకగా అందుతుందని భావించిన నగరవాసుల ఆశలు అడియాసలయ్యాయి. బీజీఎల్‌తొలి విడతగా మూడేళ్లలో నగరంలోని లక్ష కుటుంబాలకు పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (పీఎన్జీ) అందించాలని లక్ష్యంనిర్దేశించుకుంది. ఆ గడువు ముగిసి ఐదేళ్లయినా లక్ష్యంచేరుకోకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా ఇటీవల నగరంలో పర్యటించిన కేంద్రమంత్రి 2021 నాటికి 2.5 లక్షల కుటుంబాలకు వంటగ్యాస్‌ కనెక్షన్లు అందించేందుకు లక్ష్యం నిర్దేశించుకున్నట్లుప్రకటించిన విషయం విదితమే. 

ఇదీ లక్ష్యం...  
నగరంలో ఇంటింటికీ పైప్‌లైన్‌ ద్వారా వంటగ్యాస్‌ (పీఎన్జీ), వాహనాలకు కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ) అందించేందుకు బీజీఎల్‌ సంస్థ సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేటలో మదర్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసి  2011 నవంబర్‌ 21న ప్రాజెక్టును ప్రారంభించింది. ఐదేళ్లలో 2.66 లక్షల కుటుంబాలకు పీఎన్‌జీ ద్వారా వంటగ్యాస్, 50 స్టేషన్ల ద్వారా వాహనాలకు సీఎన్‌జీ గ్యాస్‌ అందించాలని లక్ష్యం పెట్టుకుంది. తొలి విడతగా 2014 ఏప్రిల్‌ నాటికి లక్ష కుటుంబాలకు పీఎన్‌జీ కనెక్షన్లు ఇచ్చేందుకు సుమారు రూ.733 కోట్లతో ప్రాజెక్టును ప్రారంభించింది. రానున్న 20 ఏళ్లలో సుమారు రూ.3,166 కోట్లతో నగరవ్యాప్తంగా విస్తరించాలని ప్రధాన లక్ష్యంగా నిర్దేశించుకుంది. 

ఇప్పటికీ 10 శాతమే...  
బీజీఎల్‌ తొలుత శామీర్‌పేట మదర్‌ స్టేషన్‌కు సమీపంలోని నల్సార్‌ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో ఉన్న 30 ఫ్లాట్లకు పీఎన్‌జీ కనెక్షన్లు అందించింది. ఆ తర్వాత మేడ్చల్‌ మండల కేంద్రంలో సుమారు 410 కుటుంబాలకు వంటగ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చింది. వాస్తవానికి మేడ్చల్‌లో దాదాపు వెయ్యి కనెక్షన్లు ఇచ్చి, అప్పటి సీఎం ద్వారా ప్రారంభించాలని అనుకున్నప్పటికీ అది వాయిదా పడడంతో కొన్ని కనెక్షన్లే ఇచ్చి చేతులు దులుపుకుంది. రెండేళ్ల క్రితం కుత్బుల్లాపూర్‌ పరిధిలోని గాయత్రినగర్, కొంపల్లి, సుచిత్ర తదితర ప్రాంతాల్లో కనెక్షన్లు ఇచ్చింది. మొత్తంగా ఇప్పటి వరకు 10,579 పీఎన్‌జీ కనెక్షన్లు మాత్రమే ఇవ్వగలిగింది. ఇక శామీర్‌పేట నుంచి కుత్బుల్లాపూర్‌ మీదుగా జీడిమెట్ల వరకు 46.6 కిలోమీటర్ల మేరనే çస్టీల్‌ పైప్‌లైన్‌ పనులు జరిగాయి. కొంతకాలంగా పైప్‌లైన్‌ పనులు నత్తనడకన సాగుతున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్‌ తదితర ప్రాంతాలకు పైప్‌లైన్‌ నిర్మాణ పనుల ప్రణాళిక కాగితాలకే పరిమితమైంది. 

సీఎన్‌జీ అంతంతే...
వాహనాలకు సీఎన్‌జీ కూడా అందుబాటులో లేకుండా పోయింది. శామీర్‌పేటలో మదర్‌ స్టేషన్‌ను నిర్మించి సీఎన్‌జీని అందుబాటులోకి తెచ్చినప్పటికీ గ్రిడ్‌ నుంచి గ్యాస్‌ కొరత ఫలితంగా స్టేషన్లకు డిమాండ్‌కు సరిపడా సరఫరా ఉండడం లేదు. నగరంలో ప్రజారవాణకు వినియోగించే 85వేల ఆటోలు.. 7,500 బస్సులు, 20 వేలకు పైగా ట్యాక్సీలకు కలిపి రోజుకు సగటున 7,62,500 కిలోల (1.067 ఎంఎంఎస్‌సీఎండీ) సీఎన్జీ అవసరం ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకే బీజీఎల్‌ ప్రాజెక్టును ప్రారంభించింది. తొలి దశలో మేడ్చల్, హకీంపేట, కంటోన్మెంట్‌ తదితర డిపోలకు సంబంధించిన 350 ఆర్టీసీ బస్సులకు సీఎన్‌జీ సరఫరా చేస్తామని ప్రకటించింది. కానీ తర్వాత 130 బస్సులకే పరిమితమైంది. మొత్తమ్మీద 25వేల వాహనాలకు సీఎన్‌జీ అందిస్తోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top