సాక్షి, హైదరాబాద్: హైడ్రా అరాచకాలంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రేవంత్ సర్కార్ ఒక్క కొత్త నిర్మాణం చేపట్టలేదని కేటీఆర్ మండిపడ్డారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో మంత్రి వివేక్, రేవంత్ సోదరుడి ఇల్లు ఉంది. పట్నం మహేందర్ గెస్ట్‌హౌస్ చెరువు మధ్యలో ఉంది. పేదలకు ఒక న్యాయం.. పెద్దలకు మరో న్యాయమా?’’ అంటూ కేటీఆర్ నిలదీశారు.
‘‘కేసీఆర్ హయాంలో హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు నిర్మించాం. కొత్త జిల్లాలు ఏర్పాటు, ఫ్లోరైడ్ మహమ్మారిని తరిమేశాం. రేవంత్ సర్కార్ కొత్తగా ఒక్క నిర్మాణం చేపట్టలేదు. 500 రోజుల్లో కేసీఆర్ తిరిగి అధికారంలోకి వస్తారు. హైడ్రా బాధితులను ఆదుకుంటాం. హైడ్రా పై భట్టి విక్రమార్క పీపీటీ పేరుతో 15 బిల్డర్ల పేర్లు చెప్పారు.. కానీ ఇప్పటి వరకూ ఒక్కరిపై యాక్షన్ ఎందుకు తీసుకోలేదు?. హైడ్రా చేసేది మంచే అయితే భట్టి చెప్పిన వారిపై చర్యలు ఎందుకు లేవు?. ఎఫ్‌టీఎల్ పరిధిలో కూల్చివేస్తామన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కి పొంగులేటి ఇంటిని కూల్చే ధైర్యం ఉందా?’’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.
‘‘మంత్రి వివేక్ ఇల్లు, రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు ఎఫ్‌టీఎల్‌లో ఉంది. పట్నం మహేందర్ రెడ్డి గెస్ట్ హౌస్ చెరువు మధ్యలో ఉంది. శాసన మండల చైర్మన్ సుఖేందర్రెడ్డి ఇల్లు చెరువు పక్కనే ఉంది. వీరిపై చర్యలు ఉండవు కానీ సున్నం చెరువు వద్ద పేదల చెరువు మాత్రం వెంటనే కూల్చి వేస్తారు. గాజుల రామారం వద్ద బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ భూమిని అలానే ఉంచారు. పేదల ఇల్లు మాత్రం కూల్చారు. మా పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు కాబట్టి ఆయన భూమిపై ఎలాంటి చర్యలు లేవా?. సీఎం ఒత్తిడితో అధికారులు అక్కడ ఉండే ఆయన భూమికి ఫెన్సింగ్ వేశారు.
..మూసిలో అడ్డంగా కట్టిన ప్రాజెక్టును మంత్రులు అధికారులు ఎందుకు కూల్చలేదు. యూపీలో బుల్డోజర్ వస్తే అడ్డుకుంటా అన్న రాహుల్ గాంధీ తెలంగాణలో బుల్డోజర్ పేదల ఇల్లు కూలుస్తుంటే ఎందుకు మాట్లాడరు. పదేళ్లు కేసీఆర్ అధికారంలో ఉండగా పేదలకు న్యాయమే చేశాం తప్ప ఎవరికీ అన్యాయం చేయలేదు. హైడ్రా కూల్చివేతలపై బాధితులు మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. నోటీసులు లేకుండా తమ ఇళ్ళను కూల్చివేశారు. సామాన్లు సైతం తీసుకోకుండా కూల్చివేయడంతో బాధితులు రోడ్డున పడ్డారు’’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


