రాయికల్‌ మినహా నాలుగింట్లో వారే..

BC Members Won Majority Chairman Posts In Jagtial - Sakshi

బీసీలకు అగ్రతాంబూలం

కొలువుదీరిన కొత్త పాలకవర్గాలు

ఘనంగా పాలకవర్గాల పట్టాభిషేకం

జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు నాలుగింట్లో మహిళలకే పట్టాభిషేకం జరిగింది. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురిలో చైర్‌పర్సన్‌లుగా మహిళలు ప్రమాణస్వీకారం చేశారు. ఒక్క రాయికల్‌లోనే జనరల్‌కు రిజర్వ్‌ కావడంతో మోర హన్మాండ్లు చైర్మన్‌గా ఎన్నికయ్యారు. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల్లో బీసీలే చైర్మన్‌ పీఠాలను అలంకరించారు.

వీరిలో నలుగురు మహిళలు ఉండడం గమనార్హం. మెట్‌పల్లిలో వరుసగా మూడోసారి మహిళలే చైర్‌పర్సన్‌ పీఠాన్ని సొంతం చేసుకున్నారు. రాయికల్‌లో చైర్మన్‌ పదవి జనరల్‌ కాగా.. వైస్‌ చైర్‌పర్సన్‌ పదవి మహిళకు దక్కింది. కాంగ్రెస్‌ కంచుకోటగా ఉన్న జగిత్యాలలో గులాబీ జెండా రెపరెపలాడింది.

సాక్షి, జగిత్యాల: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికైన కౌన్సిలర్లు సోమవారం ఉదయం 11.30 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం చైర్మన్, వైస్‌చైర్మన్‌లను ఎన్నుకున్నారు. జగిత్యాల చైర్‌పర్సన్‌గా డాక్టర్‌ బోగ శ్రావణి, కోరుట్లలో అన్నం లావణ్య, మెట్‌పల్లిలో రణవేణి సుజాత, రాయికల్‌లో మోర హన్మండ్లు, ధర్మపురి మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా సంగి సత్తెమ్మ ప్రమాణ స్వీకారం చేశారు. జగిత్యాలలో వైస్‌చైర్మన్‌గా గోలి శ్రీనివాస్, కోరుట్లలో గడ్డమీది పవన్, మెట్‌పల్లిలో బోయినిపల్లి చంద్రశేఖర్‌రావు, రాయికల్‌లో గండ్ర రమాదేవి, ధర్మపురిలో ఇందారపు రామన్న మున్సిపల్‌ వైస్‌చైర్మన్లుగా ప్రమాణ స్వీకారం చేశారు.

సామాజికవర్గాల వారీగా..
మున్సిపల్‌ చైర్మన్లు, వైస్‌చైర్మన్ల పదవులను సామాజికవర్గాల వారీగా సర్దుబాటు చేశారు. జగిత్యాలలో పద్మశాలి సామాజికవర్గానికి చెందిన డాక్టర్‌ బోగ శ్రావణికి చైర్మన్‌ పదవి దక్కగా.. ఓసీ సామాజికవర్గంలోని వైశ్యులు గోలి శ్రీనివాస్‌ వైస్‌చైర్మన్‌ పదవి సొంతం చేసుకున్నారు. కోరుట్లలో చైర్మన్‌ పదవి బీసీల్లోని గౌడ సామాజిక వర్గానికి చెందిన అన్నం లావణ్యకు దక్కగా, వైస్‌చైర్మన్‌గా బీసీల్లోని ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన గడ్డమీది పవన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. మెట్‌పల్లిలో చైర్మన్‌ పీఠం బీసీల్లోని ముదిరాజ్‌కు చెందిన రణవేణి సుజాత దక్కించుకోగా, ఓసీకి చెందిన బోయినపల్లి చంద్రశేఖర్‌రావు వైస్‌చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేశారు. రాయికల్‌లో బీసీ పద్మశాలి వర్గానికి చెందిన మోర హన్మండ్లు చైర్మన్‌కాగా ఓసీకి చెందిన గండ్ర రమాదేవి వైస్‌చైర్‌పర్సన్‌ అయ్యారు. ధర్మపురిలో బీసీల్లోని మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన సంగి సత్తెమ్మ చైర్‌పర్సన్‌ కాగా ఓసీకి చెందిన ఇందారపు రామన్న వైస్‌చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేశారు. 

ఊహించినట్లే.. 
జిల్లాలోని మున్సిపల్‌ చైర్మన్ల ఎన్నిక ముందుగా ఊహించినట్లుగానే జరిగినా వైస్‌ చైర్మన్ల విషయంలో కాస్త సస్పెన్స్‌ ఏర్పడింది. కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌ చైర్మన్లను ఎమ్మెల్యేలు ముందుగానే ప్రకటించారు. ధర్మపురి, జగిత్యాలలో చైర్‌పర్సన్‌ పీఠానికి పలువురు పోటీలో ఉన్నప్పటికీ ముందు నుంచి ప్రచారంలో ఉన్నవారే చైర్మన్‌ పదవులను అలంకరించారు. కాంగ్రెస్‌ కంచుకోటగా ఉన్న జగిత్యాలలో టీఆర్‌ఎస్‌ మొదటి సారిగా చైర్మన్‌ పీఠాన్ని దక్కించుకుంది.

కొంగొత్త ఆశలు..
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. గతంలో గ్రామపంచాయతీలుగా ఉన్న రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీలుగా అవతరించాయి. ఇక్కడ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్ల స్థానంలో చైర్మన్, వైస్‌చైర్మన్, కౌన్సిలర్లతో కొత్త పాలకవర్గాలు ఏర్పాటయ్యాయి. నూతనంగా ఏర్పడిన పాలకవర్గాలతో పట్టణాల్లో కొత్త శోభ సంతరించుకుంది. పట్టణాలు అభివృద్ధి చెందుతాయనే ఆశలు కొత్త పాలకవర్గాలపై పట్టణవాసులు పెట్టుకున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top