ఫ్రీ ట్రావెలర్‌: ‘లిఫ్ట్‌ ప్లీజ్‌’ అని నగరాలను చుట్టొచ్చాడు!

By Asking Lift Please Hyderabad Man Toured The Nepal - Sakshi

12 వేల కి.మీ. పర్యటించిన కరుణాకర్‌

హైదరాబాద్‌– రాజస్థాన్, హైదరాబాద్‌– గువహటి

కారు, బైక్, ఒంటె బండి.. ఎలా వీలైతే అలా.. 

సాక్షి, హైదరాబాద్‌: ఆ యువకుడు ‘లిఫ్ట్‌ ప్లీజ్‌’ అంటూ హైదరాబాద్‌ నుంచి బయలుదేరి ఏకంగా దేశంలోని ప్రధాన నగరాలను చుట్టి వచ్చేశాడు. డబ్బుల అవసరం లేకుండానే రెండు దఫాల్లో సుమారు 12 వేల కి.మీ. మేర పర్యటించి చరిత్ర సృష్టించాడు నగరానికి చెందిన గ్రాఫిక్‌ డిజైనర్‌ వంగవేటి కరుణాకర్‌. 29 రోజుల పాటు సాగిన తన సుదీర్ఘ పర్యటనలో మహోన్నతమైన భారతీయ ఆత్మను సమున్నతంగా ఆవిష్కరించాడు. వైవిధ్యభరితమైన సంస్కృతులు, జీవన విధానాలు ఎన్నెన్ని ఉన్నా అంతిమంగా భారతీయులంతా ఒక్కటేనని నిరూపించాడు. దేశంలో  ఎక్కడికి వెళ్లినా అతిథిలా ఆదరించి అక్కున చేర్చుకుంటారని నిరూపించాడు. ట్రావెలింగ్‌పై మక్కువతో ప్రపంచమంతా పర్యటించాలనే చిన్నప్పటి తన కలను సాకారం చేసుకునే తొలి అడుగు పడిందంటున్నాడు కరుణాకర్‌. ఆయన ఫ్రీ ట్రావెలింగ్‌ ఎలా సాగింది.. తనకు ఎదురైన అనుభవాలేమిటి? తదితర అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.  

అలా మొదలైంది.. 
‘లిఫ్ట్‌ ప్లీజ్‌’ అంటే ఏ వాహనదారైనా ఐదారు కి.మీ వరకు తీసుకెళ్తాడు. కానీ ఊళ్లకు ఊళ్లు.. రాష్ట్రాలు దాటించడం సాధ్యం కాదు. దేశ సరిహద్దుల వరకు వెళ్లలేం కదా. అటు నేపాల్‌లోని ఖాట్మండూ. ఇటు పాక్‌ సమీపంలోని అనూబ్‌ఘర్‌ వరకు కేవలం ఇతరుల సహాయంతో  చేరుకోలేం కదా. కానీ అలాంటి సాహసోపేతమైన పర్యటనే చేశాడు కరుణాకర్‌. ఏ మాత్రం పరిచయం లేని వ్యక్తుల సహాయంతో రోడ్డు మార్గంలో రకరకాల వాహనాలపై వెళ్లాడు.  అలా  వెళ్లే క్రమంలో కేవలం ఒక్క కి.మీ. తీసుకెళ్లినవారూ ఉన్నారు. 500 కి.మీ. వరకు దాటించినవారూ ఉన్నారు. నగరంలోని కృష్ణానగర్‌లో ఉన్న తన ఇంటి నుంచి ఓ బైక్‌ లిఫ్ట్‌ తీసుకొని బయలుదేరితే  దారిలో ట్రక్కు, లారీ, కారు, సైకిల్, ఒంటెబండి.. ఇలా ఏ వాహనంలో చోటు లభిస్తే ఆ వాహనంలో  వెళ్లాడు కరుణాకర్‌.

సాహసమే ఊపిరిగా..  
ప్రయాణం అంటేనే డబ్బులతో ముడిపడిన విషయం. అవి లేకుండా  ప్రయాణం చేయడం సాహసమే. ‘మొదట మా ఊరికి వెళ్లాను. మాములుగా అయితే ఖమ్మం సమీపంలోని మా ఊరికి హైదరాబాద్‌ నుంచి 6 గంటల సమయం పడుతుంది. లిఫ్ట్‌ తీసుకొని వెళ్లడంతో 9  గంటలు పట్టింది. కానీ తిరుగు ప్రయాణంలో 5 గంటల్లోనే  చేరుకున్నాను. ఈ అనుభవం నాకు గొప్ప దైర్యాన్ని ఇచ్చింది. ఆ స్ఫూర్తితోనే పర్యటన మొదలైంది అని చెబుతున్నాడు కరుణాకర్‌. అక్టోబర్‌లో 15 రోజుల పాటు రాజస్థాన్‌ ప్రయాణం చేశాడు. ఈ ప్రయాణంలో చుట్టూ పొలాల మధ్యలో ఉన్న ఓ ఇంట్లో, ఓ పంజాబీ ఫ్యామిలీ ఆతిథ్యం స్వీకరించడం గొప్ప అనుభూతిగా మిగిలింది. అహ్మదాబాద్‌కు, ఉదయపూర్‌ మధ్యలో రాత్రి 2గంటల సమయంలో ప్రయాణం చేయాల్సివచ్చినప్పుడు ఓ ఆర్టీఓ అధికారి లిఫ్ట్‌ ఇచ్చాడు. ఈ ట్రిప్‌లో కార్లు, బైక్‌లు, ట్రక్కులు, ట్రాక్టర్‌లు, ఒంటెల బండ్లు, సైకిల్, బస్సు, అన్ని రకాల వాహనాల్లో వెళ్లాడు.   

రెండు దఫాలుగా.. 
కరుణాకర్‌ భారత యాత్ర రెండు దఫాలుగా సాగింది. మొదట హైదరాబాద్‌– రాజస్థాన్‌ వరకు వెళ్లి వచ్చాడు. 15 రోజుల్లో మొత్తం3,500 కి.మీ చుట్టొచ్చాడు. ముంబై, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్, బికనీర్, అనూబ్‌ఘర్, శ్రీగంగానగర్, జైపూర్‌ మీదుగా తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నాడు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top