పాల్వంచలో మరో విద్యుత్‌ ప్లాంట్‌ ! | Sakshi
Sakshi News home page

పాల్వంచలో మరో విద్యుత్‌ ప్లాంట్‌ !

Published Fri, Nov 15 2019 2:47 AM

Another power Plant At Palvancha Kothagudem District - Sakshi

పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (కేటీపీఎస్‌)లో మరో విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మించడంపై జెన్‌కో యాజమాన్యం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన సూపర్‌ క్రిటికల్‌ ఆల్ట్రా యూనిట్స్‌ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై గురువారం సర్వే చేపట్టారు. 1966 –78 మధ్య కాలంలో నిర్మించిన కేటీపీఎస్‌ ఓఅండ్‌ఎం(720 మెగావాట్ల) ప్లాంట్లలో ఈ ఏడాది డిసెంబర్‌ 31తో ఉత్పత్తి ఆపేయాల్సి ఉంది. అనంతరం కర్మాగారాన్ని నేలమట్టం చేస్తారు. అయితే ఇక్కడి భౌగోళిక వనరులను ఉపయోగించి ఓఅండ్‌ఎం కర్మాగారం స్థానంలో మరో ప్లాంట్‌ నిర్మించే అంశంపై బీహెచ్‌ఈఎల్, జెన్‌కో సంయుక్త ఆధ్వర్యంలో గురువారం సర్వే చేశారు. మూసివేత అనంతరం నేల మట్టం చేయకుండా భవిష్యత్‌ ప్లాంట్‌కు ఉపయోగకరంగా పనిచేసే నిర్మాణాలను పరిశీలించారు.

ముఖ్యంగా కూలింగ్‌ టవర్ల స్థితిగతులపై అధ్యయనం చేశారు. అయితే, సబ్‌ క్రిటికల్, సూపర్‌ క్రిటికల్‌ కంటే మెరుగైన టెక్నాలజీతో ప్లాంట్‌ రూపుదిద్దుకోవడానికి ఇక్కడ భూమితో పాటు బొగ్గు, నీటి వసతులు పుష్కలంగా ఉన్నాయని సర్వే బృందం గుర్తించింది. దీని వల్ల అతి తక్కువ మోతాదులో మాత్రమే కాలుష్యం వెలువడుతుందని చెబుతున్నారు. కొత్త టెక్నాలజీతో నిర్మించే సూపర్‌ క్రిటికల్‌ ఆల్ట్రా యూనిట్లను భారత దేశంలోనే మొదటిసారిగా పాల్వంచలో ఏర్పాటు చేయాలని యోచిస్తుండటం విశేషం. ఇప్పటివరకూ యూనిట్లకు మరమ్మతులు వస్తే.. చాలా రోజుల పాటు రాష్ట్ర గ్రిడ్‌కు ఉత్పత్తి నిలిచిపోయేది. అయితే ఆల్ట్రా యూనిట్లకు మరమ్మతులు తక్కువని, ఒకవేళ వచ్చినా చేయడం సులువని అధికారులు చెబుతున్నారు.

Advertisement
Advertisement