అధ్యక్షా... ! మా సంగతేంటి...?

Adilabad TRS Leaders Trying To Get MLA Tickets - Sakshi

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : పదేళ్లుగా ఓటమి తెలియని ఎమ్మెల్యే ఒకరు... హైదరాబాద్‌ నుంచి రాజధాని వరకు చక్రాలు తిప్పిన చరిత్ర మరో ఇద్దరిది... వారిలో ఒకరు సిట్టింగ్‌ ఎంపీ అయితే మరొకరు మాజీ. విప్లవ పంథాను వదిలి ప్రజా జీవనంలోకి అడుగు పెట్టిన నాయకుడు ఇంకొకరు. విభిన్న ధ్రువాల్లో ఉన్న వీరంతా తెలంగాణ నినాదంతో గులాబీ దళపతి వెంట నడిచారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా... మాకు టికెట్లు గ్యారంటీ అనే ధీమాతో గులాబీ కండువాలు వేసుకుని తిరిగారు.

కానీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మారుతూ టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన పార్టీ టికెట్లు వీరిని హతాశుల్ని చేశాయి. దీంతో రాజకీయ భవిష్యత్తు ఏంటో అర్థం కాని స్థితిలో వీరంతా పార్టీ అధినేత కేసీఆర్‌ వైపు చూస్తున్నారు. వీరిలో ఏ క్షణమైనా సీట్ల కేటాయింపుల్లో మార్పులు జరిగి మళ్లీ  బీ–ఫారాలు చేతికి అందుతాయనే ధీమాతో కొందరుంటే... మరికొందరు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు.

ఓదెలుకు ఓదార్పు దొరికేనా..?
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితాలో ఉమ్మడి జిల్లాకు చెందిన పది నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయడంతో వివిధ నియోజకవర్గాలపై ఆశతో ఉన్న నాయకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ నల్లాల ఓదెలు హుటాహుటిన హైదరాబాద్‌కు వెళ్లి తాజా మాజీ మంత్రి కేటీఆర్‌ను కలిసి తన ఆవేదనను చెప్పుకున్నారు. 2009 నుంచి విధేయుడైన కార్యకర్తగా కేసీఆర్‌ను దేవుడిగా పూజిస్తే తనకు అన్యాయం చేస్తారా అని కేటీఆర్‌ వద్ద వాపోయినట్లు సమాచారం. ముఖ్యమంత్రిని కలిపించేందుకు హామీ ఇచ్చినట్లు సమాచారం. చెన్నూర్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని ఈ సందర్భంగా ఆయన తన అనుయాయులకు చెపుతున్నట్లు సమాచారం.

రత్యామ్నాయం దిశగా రాథోడ్‌ రమేష్‌
ఖానాపూర్‌లో తనకు, ఆసిఫాబాద్‌లో తన కుమారుడికి సీటు ఇప్పించుకునే హామీతో టీడీపీకి రాజీనామా చేసి వచ్చిన మాజీ ఎంపీ రాథోడ్‌ రమేష్‌ అభ్యర్థుల జాబితా షాక్‌ నుంచి తేరుకోలేక పోతున్నారు. తనకు సీటì ప్పిస్తానని హామీ ఇచ్చిన పాత టీడీపీ మిత్రుడు, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో కలిసినట్లు సమాచారం. తన పరిస్థితి ఏంటని మంత్రిని ప్రశ్నించడంతో పాటు అభ్యర్థిని మార్చని పక్షంలో ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లనున్నట్లు స్పష్టం చేశారని సమాచారం.

ఈ నేపథ్యంలో రమేష్‌తో పాటు ఆయన కుమారుడు, ఇతర అనుయాయులు, ఆయన వర్గీయులు మీడియాకు కూడా అందుబాటులో లేరు. ఎట్టి పరిస్థితుల్లో ఖానాపూర్‌ నుంచి పోటీ చేయాలనే యోచనతో రాథోడ్‌ రమేష్‌ ఉన్నారని, అవసరమైతే పార్టీ మారేందుకు కూడా వెనుకాడరని ఆయన సన్నిహిత నాయకుడొకరు పేర్కొన్నారు.

రాత్రి వరకు మంతనాల్లో ఎంపీ నగేష్‌
బోథ్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించిన ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేష్‌కు రిక్తహస్తం లభించడంతో ఆయన ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. పార్టీ మేనిఫెస్టో కమిటీలో సభ్యుడిగా నగేష్‌ను కేసీఆర్‌ నియమించినప్పటికీ, ఆయన ఆ బాధ్యతల పట్ల సంతృప్తితో లేరు. ఆదివాసీ గిరిజనుడిగా, నియోజకవర్గంపై పూర్తిస్థాయి పట్టున్న తనను కాదని వేరే వర్గానికి చెందిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు తిరిగి అవకాశం ఇవ్వడం సరికాదని ఆయన వ్యాఖ్యానిస్తున్నట్లు సమాచారం.

ఆదివాసీ ఓటర్లు మెజారిటీగా ఉన్న ఈ నియోజకవర్గంలో మూడుసార్లు గెలిచిన తనకు ఈసారి విజయం నల్లేరు మీద నడక అనే ధీమాతో ఆయన ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ము ఖ్య నాయకులతో నగేష్‌ సమావేశమయ్యారు. రాత్రి పొద్దుపోయే వరకు ఆయన వారితో స మాలోచనలు జరిపారు. ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం వెల్లడించనున్నట్లు సమాచారం.

ప్రవీణ్‌కు బెల్లంపల్లిలో చుక్కెదురు
విప్లవ పంథా నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కె.ప్రవీణ్‌కుమార్‌కు గత 2014 ఎన్నికల్లోనే టికెట్టు చేతిదాక వచ్చింది. చివరి నిమిషంలో టీజేఏసీ రంగ ప్రవేశంతో ప్రస్తుత సిట్టింగ్‌ అభ్యర్థి దుర్గం చిన్నయ్యకు దక్కింది. అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్టు సాధన లక్ష్యంగా ఆయన ప్రయత్నించారు. సిట్టింగ్‌ ఎంపీ బాల్క సుమన్‌ ద్వారా చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో మాజీ ఎంపీ వివేక్‌ ద్వారా సైతం ప్రయత్నించారు.

అయితే సిట్టింగ్‌లకే సీట్లు అనే నినాదంతో సీఎం కేసీఆర్‌ మరోసారి చిన్నయ్యకే అవకాశం ఇచ్చారు. దీంతో ఏం చేయాలో తోచని స్థితిలో ఉండిపోయారు. పార్టీ నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నప్పటికీ, సీఎం మీది గౌరవంతో ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోతున్నారని సమాచారం.  వీరితో పాటు ఉమ్మడి జిల్లాలో మరికొందరు నాయకులు సైతం పార్టీ నిర్ణయాన్ని దిక్కరించలేక, సమర్థించలేక మీమాంసలో ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top