అష్టా చమ్మా ఎంత పని చేసిందంటే..

31 Infected With Coronavirus By A Woman Plays Ashta Chamma In Suryapet - Sakshi

సూర్యాపేట : కరోనా వైరస్‌ ఎంత ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతుందో మరోసారి నిరూపితమైంది. ఓ మహిళ అష్టా చమ్మా ఆడటం ద్వారా 31 మందికి కరోనా సోకింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ కరోనా చాప కింద నీరులా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ బుధవారం సూర్యాపేట జిల్లాలో పర్యటించింది.

ఈ సందర్భంగా తబ్లిగి జమాత్‌ మీటింగ్‌కు వెళ్లివచ్చినవారితో కాంటాక్ట్‌ అయిన ఓ మహిళ ద్వారా 31 మందికి కరోనా సోకినట్టు ఉన్నత స్థాయి కమిటీ దృష్టికి వచ్చింది. తనకు కరోనా సోకిన విషయం తెలియని మహిళ.. లాక్‌డౌన్ వేళ టైమ్‌ పాస్‌ కోసం సమీపంలోని పలు ఇళ్లలో తిరిగుతూ అష్టా చమ్మా ఆడారు. దీంతో ఆమె కాంటాక్ట్‌ అయినవారిలో చాలా మందికి కరోనా సోకింది. ఇది కూడా జిల్లాలో పెద్ద ఎత్తున కేసుల పెరుగుదలకు ఒక​ కారణం అయింది. కాగా, ఇప్పటివరకు సూర్యాపేట జిల్లాలో 83 కరోనా కేసులు నమోదయ్యాయి. 

ఈ ఘటన కరోనా నియంత్రణ కోసం ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తుందని నిపుణులు చెబుతున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని.. కనీసం పక్కింటి వారి వద్దకు కూడా వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు. మరోవైపు సూర్యాపేటలో కరోనా నియంత్రణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై పలువురు ప్రభుత్వ అధికారులపై వేటు పడింది. జిల్లా వైద్యాధికారి నిరంజన్‌ బదిలీ చేసిన ప్రభుత్వం.. ఆయన స్థానంలో బీ శ్రీనివాసరావును నియమించారు. అలాగే డీఎస్పీ నాగేశ్వరరావు, సీఐ శివకుమార్‌ బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. చదవండి : ‘పక్కింటి వారితో కూడా కాంటాక్ట్‌లో ఉండకూడదు’

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top