
ఈవ్‌టీజింగ్‌కు ‘షీ’చెక్
హైదరాబాద్‌లో ఈవ్‌టీజింగ్‌ను అరికట్టేందుకు ‘షీ’ బృందాలను ఏర్పాటు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు.
నగరంలో 100 ‘షీ’ బృందాల ఏర్పాటు
కళాశాలలు, బస్సు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ వద్ద నిఘా
పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి వెల్లడి
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఈవ్‌టీజింగ్‌ను అరికట్టేందుకు ‘షీ’ బృందాలను ఏర్పాటు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు. మహిళల భద్రతకు ఈ ప్రత్యేక బృందాలు పనిచేస్తాయని చెప్పారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఐదుగురు పోలీసులు (పురుషులు, మహిళలు) ఉండే విధంగా 100 షీ బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
విద్యాసంస్థలు, బస్సు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్, విహార యాత్ర స్థలాల వద్ద ఈవ్‌టీజింగ్‌కు పాల్పడేవారిని అదుపులోకి తీసుకోడానికి, మహిళల భద్రతకు ఇవి పనిచేస్తాయన్నారు. షీ బృందాలలోని పోలీసులు సాధారణ దుస్తుల్లో ఉంటారని, వారి వద్ద వీడియో రికార్డింగ్ కెమెరాలు కూడా ఉంటాయని తెలిపారు. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడేవారిని ఈ బృందాలు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని నగర సీసీఎస్‌కు తరలిస్తాయని చెప్పారు. ఆకతాయిలకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు కేసులు నమోదు చేసి జైలుకు పంపుతాయన్నారు.
ధైర్యంగా ఫిర్యాదు చేయండి: స్వాతి లక్రా
ఈవ్‌టీజింగ్‌కు పాల్పడేవారిపై మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని క్రైమ్ అదనపు పోలీసు కమిషనర్ స్వాతిలక్రా సూచించారు. 100 నంబర్‌కు ఫోన్ చేస్తే పది నిమిషాల్లో పోలీసులు సంఘటన స్థలానికి వస్తారన్నారు. ఫిర్యాదు చేసే బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. షీ బృందాలకు ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇచ్చామన్నారు. నిందితులకు శిక్షలు పడే విధంగా కోర్టుకు చార్జిషీట్ దాఖలు చేస్తామన్నారు.