breaking news
-
వారిది మజ్లిస్ ఎజెండానే: అమిత్ షా
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఎంఐఎం ఎజెండా ప్రకారమే నడుచుకుంటున్నాయని కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ మజ్లిస్‌కు భయపడి సభా సంప్రదాయాలు, నియమాలు తోసిరాజని అక్బరుద్దీన్‌ను ప్రొటెమ్ స్పీకర్ చేసిందన్నారు. ఓటుబ్యాంక్ రాజకీయాలకు పాల్పడే ఈ మూడు కుటుంబ పార్టీలు హైదరాబాద్ విముక్తి దినోత్సవాన్ని, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను నెరవేర్చగలవా అని ప్రశ్నించారు. అవినీతి పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మగౌరవానికి ఏమాత్రం విలువ ఇవ్వవని ఆరోపించారు. మంగళవారం ఎల్బీ స్టేడియంలో బీజేపీ పోలింగ్ బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో అమిత్ షా ప్రసంగించారు. తెలంగాణ ట్యాగ్‌లైన్ అయిన నీళ్లు, నిధులు, నియామకాలను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కూడా అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ మొదలు రాహుల్ గాంధీ వరకు, బీఆర్ఎస్ కేసీఆర్ నుంచి కేటీఆర్, ఆ తర్వాతి తరాలు.. ఎంఐఎం బడేమియా అసదుద్దీన్, చోటేమియా అక్బరుద్దీన్ అన్నట్టుగా తమ కుటుంబ ప్రయోజనాలే ధ్యేయంగా పని చేస్తున్నాయన్నారు. రైతులు, ఓబీసీలు, యువత, మహిళలు, పేదల అభ్యున్నతి గురించి ఆ పార్టీలకు ఏమాత్రం పట్టదన్నారు. బీజేపీ, ప్రధాని మోదీతోనే ఈ వర్గాల అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని, డెబ్బై ఏళ్ల తర్వాత తెలంగాణను రజాకార్ల చెర నుంచి దూరం చేయగలిగేది బీజేపీ మాత్రమేనని అమిత్‌షా చెప్పారు. మోదీని మూడోసారి ప్రధానిని చేయడం, దేశంలో బీజేపీ 400 సీట్లలో గెలవడం, తెలంగాణలో 12 సీట్లలో విజయం సాధించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. తెలంగాణలో మోదీ పట్ల ప్రజల్లో ప్రేమ చూస్తుంటే వచ్చేసారి 400 సీట్లు ఖాయంగా వస్తాయని అనిపిస్తోందన్నారు. రేవంత్‌కు అమిత్‌షా సవాల్ గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో బొగ్గు, కామన్వెల్త్గేమ్స్, 2 జీ, పంచకుల, అగస్టా విమానాలు ఇలా మొత్తం అవినీతి, కుంభకోణాల్లో మునిగితేలారో, లేదో చెప్పాలంటూ అమిత్‌షా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. పదేళ్ల యూపీఏ పాలనలో రూ.12 లక్షల కోట్ల అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. యూపీఏ హయాంలో తెలంగాణకు రూ.1.17 లక్షల కోట్లు వస్తే, మోదీ పదేళ్ల పాలనలో రూ.5 లక్షల కోట్లు వచ్చాయని చెప్పారు. రాహుల్‌ను ప్రధాని చేయాలని సోనియా, కేటీఆర్‌ను సీఎంను చేయాలని కేసీఆర్, పశ్చిమబెంగాల్లో తన మేనల్లుడిని సీఎంను చేయాలని మమతా బెనర్జీ, మహారాష్ట్రలో సుప్రియా సూలేను సీఎం చేయాలని శరద్‌పవార్, ఆదిత్యాఠాక్రేను సీఎం చేయాలని ఉద్ధవ్‌ఠాక్రే.. ఇలా కొడుకులు, కుమార్తెలు, అల్లుళ్లను పీఎంలు, సీఎంలు చేయాలని భావిస్తున్నారన్నారు.అవన్నీ సొంత ప్రయోజనాల పరిరక్షణకే పరిమితమైన పార్టీలని, మోదీ ప్రభుత్వం ఇందుకు పూర్తిగా విరుద్ధమని చెప్పారు. బీఆర్ఎస్ను భ్రష్టాచార్ రిష్వత్కోరి సమితిగా అభివర్ణించిన అమిత్‌షా.. ఆ పార్టీ ఓఆర్ఆర్, కాళేశ్వరం ప్రాజెక్టు, ఢిల్లీ మద్యం కుంభకోణాల్లో వేలకోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. అదే సమయంలో 23 ఏళ్లపాటు సీఎంగా, ప్రధానిగా (పదేళ్లుగా) పనిచేసిన మోదీపై 25 పైసల అవినీతికి పాల్పడినట్టుగా కూడా ప్రతిపక్ష పార్టీలు వేలెత్తి చూపలేకపోయాయని చెప్పారు. తెలంగాణలో అత్యధిక స్థానాల్లో విజయం కోసం శ్రమించాలని, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, మహిళలు, ఇతర రంగాల వారిని కలిసి కమలం గుర్తుకు ఓటేసేలా చైతన్యపరచాలని పార్టీ నేతలకు అమిత్ షా పిలుపునిచ్చారు. సీఏఏ.. పౌరసత్వాన్ని ఇవ్వడానికే... దేశంలో కొత్తగా అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)తో ఎవరి పౌరసత్వం తొలగించబోయేది లేదని అమిత్‌షా స్పష్టంచేశారు. ఈ చట్టం అమలుకు సంబంధించి తప్పుడు ఆరోపణలతో కొందరు కేంద్రంపై, బీజేపీపై దు్రష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఏఏ పౌరసత్వాన్ని ఇచ్చేదే తప్ప తొలగించేది కాదన్నారు. దీని ద్వారా పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్ వంటి దేశాల నుంచి భయంతో భారత్‌కు వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్దులకు మనదేశ పౌరసత్వం ఇస్తామని చెప్పారు. కొన్ని పార్టీలు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ వాస్తవాలను పక్కదారి పట్టిస్తున్నాయని, వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించి లోక్‌సభ ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటేసేలా నేటి నుంచే ప్రచారం మొదలుపెట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఇప్పటికే 9 లోక్‌సభ స్థానాలకు ప్రకటించిన పార్టీ అభ్యర్థులు.. జి.కిషన్‌రెడ్డి (సికింద్రాబాద్), బండిసంజయ్ (కరీంనగర్), ధర్మపురి అర్వింద్ (నిజామాబాద్), ఈటల రాజేందర్ (మల్కాజిగిరి), బూర నర్సయ్యగౌడ్ (భువనగిరి), కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (చేవెళ్ల), బీబీ పాటిల్ (జహీరాబాద్), పి,భరత్‌ప్రసాద్ (నాగర్‌కర్నూల్), మాధవీలత (హైదరాబాద్)లను సభికులకు అమిత్‌షా పరిచయం చేశారు. -
తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీ గద్దల వద్ద తాకట్టు: కేసీఆర్
సాక్షి ప్రతినిధి, హైదరాబాద్: ‘ఎక్కువ పథకాలు వస్తాయనే ఆశతో కాంగ్రెస్‌కు.. తమాషాకు ఓటు వేస్తే వాళ్లు మాత్రం పదవులకు ఎక్కి దౌర్జన్యం, దోపిడీ చేస్తూ డబ్బు మూటలు గుంజుతున్నరు. ఢిల్లీకి సూట్ కేసులు పంపే పనిలో ముఖ్యమంత్రి, మంత్రులు బిజీగా ఉన్నరు. మూడు నెలల్లో ముఖ్యమంత్రి తొమ్మిదిసార్లు ఢిల్లీకి పోయిండు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దల గద్దల వద్ద తాకట్టుపెట్టి మన ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. దీనిపై ప్రజల పక్షాన్ని గళాన్ని వినిపించేందుకే బీఆర్ఎస్ అభ్యర్థులను పార్లమెంటుకు పంపాలి’అని భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా మంగళవారం ‘కరీంనగర్ కదనభేరి’పేరిట బీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. కరీంనగర్ ఎస్సార్ కాలేజీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో పలు తాజా రాజకీయ అంశాలపై కేసీఆర్ తనదైన శైలిలో స్పందించారు. తల మాసినోళ్ల దొంగ ప్రచారంతో భయపడొద్దు ‘పవర్ బ్రోకర్స్, కొన్ని బేవార్స్ ఛానళ్లు ఎప్పుడూ ఉంటాయి. ఎక్కడో చోట ఒక్కరో ఇద్దరో తలకు మాసినోళ్లు పార్టీ నుంచి బయటకు వెళ్లి బీఆర్ఎస్ ఖతమైందని ప్రచారం చేస్తున్నారు. దొంగ ప్రచారాలకు భయపడకుండా ముందుకు సాగుదాం.. మీ బేవార్స్ ప్రచారాలు ఆపేయండి. కొద్ది రోజుల్లో మీరే సలాములు కొట్టుకుంటూ వస్తారు. నలుగురు పోతే పోయేదేమీ లేదు. ప్రజాశక్తిని కూడదీసి అద్భుత విజయాలు సాధించి తెలంగాణను తీర్చిదిద్దుకుందాం. గులాబీ జెండా ఎన్నడూ ఖతం కాదు. భూమి, ఆకాశం ఉన్నంత కాలం ఈ గులాబీ జెండా ఉండటం ఖాయం.’ సగం దేశానికి చిచ్చు పెట్టేవాడిని ‘మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను ఆగబట్టి బ్రేక్ కొట్టకపోతే ఈ పాటికి సగం దేశానికి అగ్గిపెట్టి చిచ్చు అంటించి మొత్తం భారతాన్ని చైతన్యం చేసేవాడిని. చిన్న దెబ్బతగిలింది ఫరవాలేదు.. ఓర్చుకుని తట్టుకుందాం. పేగులు తెగేదాకా కొట్టాడే శక్తి, ధైర్యం ఉంది. ప్రస్తుత ప్రభుత్వానికి బీఆర్ఎస్ అంకుశంలా ఉండాలి. బీఆర్ఎస్ గళమే తెలంగాణ గళం. తెలంగాణ బలంగా ఉండాలంటే బీఆర్ఎస్ బలంగా ఉండాలి. తెలంగాణ సోయి కలిగి ఉద్యమంలో పేగులు తెగేదాకా కొట్లాడినోళ్లు, చావు నోట్లో తలకాయ పెట్టి రాష్ట్రాన్ని తెచ్చిన వారికే తెలంగాణ గురించి కడుపు నొప్పి ఉంటుంది. తెలంగాణ సమాజానికి ఇలాంటి భాష గౌరవమా? అధికారంలోకి వస్తే ఆరు చందమామలు, ఏడు సూర్యుళ్లను పెడతామని 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతామంటున్నారు. ఆరు గ్యారెంటీలు, నీళ్లు, కరెంటు అడిగితే సీఎం పండబెట్టి తొక్కుతా, పేగులు మెడకేసుకుంటా, పెండ ముఖానికి రాసుకుంటా, మానవబాంబు అవుతా అని అసహనంతో మాట్లాడుతున్నాడు. ఇలాంటి భాష తెలంగాణ సమాజానికి గౌరవాన్ని ఇస్తుందా. తెలంగాణ ఉద్యమ సమయంలో వ్యతిరేకించిన వారిని దద్దమ్మలు, సన్నాసులు అంటూ నిలదీశా. సీఎంగా ఏనాడూ ఇలాంటి దురుసు మాటలు ఉపయోగించలేదు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో భయంకర పరిస్థితులు ఉన్నా ఖజానా ఖాళీ, లంకె బిందెలు లేవు అని ఏనాడూ అనలేదు. కాంగ్రెస్‌కు అధికారం దక్కడంపై మాకు ఎలాంటి ఈర‡్ష్య లేదు. మంచిగా పనిచేసి మాతో పోటీ పడు’ కాళేశ్వరంపై టీవీల్లో కూర్చుని వివరిస్తా ‘మేడిగడ్డ బ్యారేజీ.. కాళేశ్వరంలోని వంద కాంపోనెంట్లలో ఒకటి. ఒకటి రెండు పిల్లర్లు కుంగితే ప్రళయం వచ్చినట్లు, దేశం బద్దలైనట్లు ప్రచారం చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో టీవీ ముందు కూర్చుని ప్రతీ ఇంటికి వాస్తవాలు చేరేలా వివరిస్తా. మేడిగడ్డ పేరిట కేసీఆర్‌ను బదనాం చేసే ప్రయత్నం జరుగుతోంది. ఒక పన్ను వదులైతే 32 పళ్లు రాలగొట్టుకుంటమా. కాళేశ్వరంలోని 300 పైచిలుకు పిల్లర్లలో రెండు కుంగితే కేసీఆర్‌ను బదనాం చేయాలనే చిల్లర రాజకీయం జరుగుతోంది. నా కళ్ల ముందే కరెంటు, సాగునీటి సమస్యలతో రైతుల కళ్లలో నీళ్లు, పంట పొలాలకు అగ్గి పెట్టడం వంటివి చూస్తున్నా. ఇప్పుడే రైతుల పరిస్థితి ఉంటే ఏప్రిల్, మే నెలల్లో పంట పొలాల సంగతేంటి’ 4 నెలలు సమయం ఇవ్వాలకునున్నా కానీ.. ‘తెలంగాణ దేశానికి తలమానికం చేయాలని ఎంతో కృషి చేశా. కరోనాలో ఖజానాలో డబ్బులు లేకున్నా రైతుబంధు ఆపలేదు. మిషన్ భగీరథ, నిరంతర కరెంటు ఇవ్వడం ఈ ప్రభుత్వంలోని చవట దద్దమ్మలకు చేతకావడం లేదు. కాంగ్రెస్‌కు మళ్లీ ఓటేస్తే ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెడతారు. ఇప్పటికే వరి ధాన్యానికి బోనస్ బోగస్‌గా మారింది. కర్రుకాల్చి వాత పెట్టకపోతే అహంకారం పెరుగుతుంది. చెప్పుతో నిజంగానే కొడతారు. బీజేపీ నుంచి నలుగురు ఎంపీలు గెలిచినా రాష్ట్రానికి నయాపైసా తేలేదు. కాంగ్రెస్‌కు నాలుగు నెలలు సమయం ఇవ్వాలని అనుకున్నా వారిని నిలదీయక తప్పడం లేదు. పోలీసులకు రాజకీయాలు ఎందుకు ‘గ్రామాల్లో మా కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పోలీసులు బెదిరించడం సరికాదు. పోలీసులకు రాజకీయాలు ఎందుకు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. పదేళ్లు అధికారంలో ఉన్నపుడు కొన్ని కుక్కలు మొరిగినా ఏనాడూ దౌర్జన్యాలు చేయలేదు. మేము అధికారంలో ఉన్నపుడు ఇవే దౌర్జన్యాలు చేస్తే కాంగ్రెస్ వాళ్లు ఒక్కరూ మిగలేవారు కాదు’అని కేసీఆర్ హెచ్చరించారు. 2001లో తెలంగాణ కోసం పిడికెడు మందితో బయలుదేరిన తనను ఆకాశమంత ఎత్తుకు చేర్చారనీ, కార్యకర్తలే కథానాయకులై ముందుకు నడిపించారని కేసీఆర్ పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. కులం మతం జాతి ప్రసక్తి లేకుండా తెలంగాణ జాతిగా నిలబడి కలబడాలని పిలుపునిచ్చారు. -
‘పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టాలి’
సాక్షి, కరీంనగర్: తెలంగాణ ఆశలు అడియాశలు అయి.. దిక్కుతోచని స్థితిలో భయంకరమైన కరువు కాటకాలతో, కరెంట్ కోతలతో ఆత్యహత్యలు, వలసలకు ఆలవాలమైన తెలంగాణ.. ఇగ ఎక్కడైతది తెలంగాణ అని ఆనాడు అన్నారని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలిపారు. ఆయన ఇవాళ కరీంనరగర్లో నిర్వహించిన కదనభేరి బహిరంగసభలో మాట్లాడారు. దిశదశ లేకుండా.. అన్నమో రామచంద్రా అని అలమటిస్తున్న తెలంగాణ కోసం.. హైదరాబాద్‌లోని జల దృశ్యం నుంచి ఆనాడు పిడికెడు మందితో జైతెలంగాణ అని బయలుదేరానని చెప్పారు. ‘బ్రహ్మాండమైన చైతన్యవంతమైన ప్రజలు ఉన్న జిల్లా కరీంనగర్ జిల్లా.. ఇది పోరాటాల గడ్డ. ఇక్కడి నుంచే తెలంగాణ ఉద్యమం ప్రారంభించాలని భావించా. ఇదే ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్ నుంచి మే 17న తెలంగాణ ఉద్యమం కోసం నమ్మి వస్తే.. ఆనాడు తెలంగాణ జెండాను ఆకాశమంత ఎత్తుకు ఎత్తిన గడ్డ.. ఈ కరీంనగర్ గడ్డ. ఆనాడు ఎంపి పదవి విసిరికొట్టి రారా నాకొడకా అంటూ కాంగ్రెస్‌కు వార్నింగ్ ఇచ్చాను. ఉద్యమాన్ని ఉదృతం చేశాను. మొన్న మీరు మోసపోయి కాంగ్రెస్ ను గెలిపించారు. ఆరు చందమామలను చూపెట్టాడు. రైతు బందు అడిగితే చెప్పుతో కొడతా అంటున్నాడు ఓ మంత్రి. రైతుల చెప్పులు బందోబస్తుగా ఉన్నాయి. ముఖ్యమంత్రి స్థాయి లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మేము మాట్లాడితే రేపు ఈ సమయం వరకు తిడుతా. ఉద్యమ సమయంలో మాట్లాడిన నేను.. అంతే తప్ప ఒక్కనాడు కూడా రేవంత్ రెడ్డి లాగా మాట్లాడలేదు. లంకె బిందెల కోసం వచ్చాను అని నేను ఏనాడైన అన్నమా?. మాతో పోటీ పడేలా పాలన చెయ్, కానీ చేరుతాం, బొంద పెడతాం అంటావా. ... అహోరాత్రులు కష్టపడి ఆలోచన చేసి 2014 నుంచి 19 వరకు ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చాను. మిషన్ భగీరథ నడిపే తెలివి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా?. రెప్ప పాటు కూడా కరెంట్ కూడా పోకుండా ఇచ్చాను. మేము అమలు చేసిన పథకాలు సక్కగా అమలు చేసే దమ్ము లేదా?. కాంగ్రెస్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలి. లేదంటే పథకాలు అడిగితే నిజంగానే చెప్పుతో కొడతారు’ అని కేసీఆర్ అన్నారు కరోనా వచ్చి బాధ పెట్టినా, ఖజానాలో డబ్బు లేకున్నా రైతుబంధు ఇచ్చినా. ఈ చవట దద్దమ్మలు మాత్రం ఇవ్వలేకపోతున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత బలంగా గులాబీ జెండా ఎగిరితే అంత బలంగా మేము అభివృద్ధిపై పోరాడుతాం. చట్టం ప్రకారం జిల్లాకో నవోదయ ఇవ్వాల్సి ఉన్నా ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి?. ఐదు రూపాయల పని చేయని బండి సంజయ్ కి ఎందుకు ఓటెయ్యాలి?. బండి సంజయ్‌కి, వినోద్‌కి మధ్య అసలు పోలిక ఉందా?’ అని మండిపడ్డారు. దయచేసి ఆలోచన చేయాలి తెలంగాణాలో వ్యవసాయ స్థిరీకరణ చేయాలని ఆలోచించాం. చరణ్ సింగ్ లాంటి రైతుబిడ్డలు కూడా పెట్టని పథకాలు మనం రైతుల కోసం పెట్టుకున్నాం.ఈ విషయాలన్నీ కరీంనగర్ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి. అసమర్థ కాంగ్రెస్ నాయకుల పాలనలో బోనస్ బోగస్ గా మారిపోయింది. మేడిగడ్డలో చిన్న కాంపోనెంట్ లో ఏదో జరిగితే దాన్ని రాద్ధాంతం చేస్తున్నారు.రెండు పిల్లర్లు కుంగితే భారతే మునిగిపోతున్నట్టు బొబ్బలు పెడుతున్నారు. నా కళ్ల ముందే నీళ్లు లేక, కరెంట్ లేక రైతులు పొలాలకు నిప్పు పెడుతున్నారు, పశువులను మేపుతున్నారు. గ్రామాల్లో మీరంతా చర్చ పెట్టాలి. బీఆర్ఎస్ తెలంగాణా గళం, దళం, బలం’ అని కేసీఆర్ తెలిపారు. .. నేను సీఎంగా ఉన్నప్పుడు ఒక్క ఎకరం పొలం అయిన ఎండి పోయిందా?. ఇప్పుడేం రోగం వచ్చింది. నేను రెండు రోజుల్లో ఓ టీవీలో కూర్చుంటున్నా. కాళేశ్వరం ప్రాజెక్ట్ గొప్పతనం గురించి ఇంటింటికి చేరేలా చేస్తా. రెండు పిల్లర్లు మునిగిపోతే మొత్తం భారత దేశమే మునిగి పోయినట్టు చేస్తున్నారు’ అని కేసీఆర్ దుయ్యబట్టారు. -
ఆ ఎంపీ సీటుపై అయోమయం.. ముగ్గురు మంత్రుల ‘సై’
కాంగ్రెస్ అధిష్టానంకు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక సవాల్‌గా మారిందా?.. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులకు చెందిన సంబంధికులు సీరియస్‌గా టికెట్ ట్రై చేస్తూ ఉండటంతో ఎవరికి ఇవ్వాలో తెలియక అయోమయ స్థితిలో కాంగ్రెస్ అధిష్టానం ఉందా?.. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఏ పార్లమెంటు సెగ్మెంట్లో లేని పోటి అక్కడే ఉండటానికి చాలా ఈక్వేషన్స్ ఉన్నాయా?...కాంగ్రెస్‌కు కొంత తలనొప్పులు తెచ్చిపెడుతున్న ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ఎంపికపై ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సెంట్రల్ స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 17 స్థానాలలో మిగత 13చోట్ల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే 13 స్థానాలల్లో కాంగ్రెస్‌కు ఎక్కువ తలనోప్పిగా మారింది మాత్రం ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ఎంపికననే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్న రాజకీయాలు అన్నిఇన్ని కావు. ఒకరకంగా చెప్పాలంటే తెలంగాణ రాజకీయలంతా ఖమ్మం చుట్టే తిరిగాయని చెప్పాలి. ఇప్పుడు మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో సైతం పాలిటిక్స్ ఖమ్మం వైపే టర్న్ అయ్యాయనే చెప్పాలి. ఇప్పటికే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వర్ రావుకే మళ్లీ టికెట్ ప్రకటించింది...అయితే బీఆర్ఎస్ లో పెద్దగా పోటి లేకపోవడంతో మళ్లీ నామా కే టికెట్ ఇచ్చారు.. కానీ కాంగ్రెస్‌లో ఆ పరిస్థితితి లేదు. టికెట్ కోసం తీవ్రమైన పోటి ఉండటంతో కొత్త కొత్త ఈక్వేషన్స్ మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ముగ్గురు మంత్రులు సై అంటే సై అంటున్నారు. బయటకు కనిపించకపోయిన టికెట్ ఎపిసోడ్ లో లోలోపల కత్తులు దూసుకుంటున్నారన్న ప్రచారం నడుస్తుంది. ఖమ్మం పార్లమెంట్ టికెట్‌ను ముగ్గురు మంత్రులకు సంబంధించిన వారు పోటి పడుతున్నారు. ఎవరికి వారు తగ్గేదేలేదన్నట్లు టికెట్ కోసం పట్టుపడుతూ ఉండటంతో కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థి ఎంపిక విషయంలో మల్లగుల్లలు పడుతుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని అధిష్టానంను కోరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కీలకంగా పనిచేసిన కారణంగా పార్లమెంట్ టికెట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ స్తబ్దుగా ఉన్న సమయంలో పొంగులేటి చేరికతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ లో జోష్ పెరిగిందనే వార్తలు అప్పట్లో వినిపించాయి...కేసీఆర్ పై తీవ్రస్తాయిలో విమర్శలు చేస్తు దూకుడు గా ముందుకు వెళ్లారు పొంగులేటి...పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు..ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క స్థానంలో కూడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలవనియ్యను. అసెంబ్లీ గేటు తాకనివ్వను అని పొంగులేటి చేసిన శపథం పెద్ద సంచనలనానికే దారీతీసింది. ఎవరినా కదిలించిన పొంగులేటి శపథంపైనే చర్చ జరిగింది. దీంతో గత ఈక్వేషన్స్ ను లెక్కలోకి తీసుకోని టికెట్ తన సోదరుడుకి ఇవ్వాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరుతున్నారు. మరోవైపు డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్కమార్క సతీమణి మల్లు నందిని సైతం తనకే ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు దీంతో భట్టి విక్కమార్క సైతం తన సతీమణికి టికెట్ ఇప్పించేందుకు అధిష్టానంతో సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేసి కాంగ్రెస్ అధికారంలోకి రావడం వెనుక కీలకంగా తను పనిచేశానని చెప్పుకుంటు భట్టి విక్కమార్క సైతం టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ నడుస్తుంది. అటు మల్లు నందిని సైతం పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డ వారికే అధిష్టానం ప్రయార్టీ ఇస్తుందనే దీమాతో ఉన్నారు. టికెట్ పై చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఇక జిల్లాకు చెందిన మరో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కొడుకు తుమ్మల యుగేంధర్ సైతం కమ్మ కోటాలో టికెట్ కోసం ట్రై చేస్తున్నారు..తెరవెనుక చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కమ్మ ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు టర్న్ అవ్వడంలో తుమ్మల కీలకంగా వ్యవహరించారన్న ఈక్వేషన్స్ తో వారు కూడ రేసులో ముందు వరుసలో ఉన్నామంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ముగ్గురు మంత్రులు పనిచేశారు...గ్రూపు పాలిటిక్స్ ను పక్కనే పెట్టి అంత ఒక్కటిగా ముందుకు వెళ్లడంతో ఫలితాలు సైతం కాంగ్రెస్‌కు అనుకులంగా వచ్చాయి. సీన్ కట్ చేస్తే పార్లమెంట్ ఎన్నికలకొచ్చేసరికి ఈక్వేషన్స్ మారిపోయాయి. ముగ్గురు మంత్రులకు సంబంధించిన వారు టికెట్ కోసం పోటి పడుతుండటంతో లెక్కలు తప్పుతున్నాయి..ప్రస్తుతం పైకి అందరు కలిసి ఉన్నట్లు కనిపిస్తున్న టికెట్ విషయంలో చాలా సీరియస్‌గా ఎవరికి వారు వారి వారి రూట్లలో ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు వస్తదంటే తమకు వస్తుందని ముగ్గురు దీమాతో ఉన్నారు. ముగ్గురు సీనియర్ నేతలు కావడంతో ముగ్గురు బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ముగ్గురులో అధిష్టానం ఎవరి వైపు మొగ్గుచూపుతుందన్న ఉత్కంఠ కొనసాగుతుంది. రాష్ట్రంలో ఎ పార్లమెంట్ స్థానంకు ఇంత తీవ్రస్తాయిలో పోటి లేదనే చెప్పాలి...అయితే ఒక మంత్రికి సంబంధించిన వారికి టికెట్ ఇస్తే మిగత ఇద్దరు మంత్రులు వారికి సపోర్ట్ చేస్తారా లేదా అన్న ఆసక్తికర చర్చ సైతం నడుస్తుంది. వాస్తవానికి ఖమ్మం పార్లమెంట్ స్థానంకు మొదట నలుగురు మద్య పోటి ఉండేది. కానీ ఇందులో రేణుక చౌదరికి రాజ్యసభ ఖారారు చేయడంతో కొంత పోటి తగ్గింది అది మూడుకు చేరింది. చూడాలి మరి కాంగ్రెస్ అధిష్టానంకే సవాల్‌గా మారిన ఖమ్మం పార్లమెంట్ ఎంపిక విషయంలో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి. -
యాదాద్రి వివాదంపై స్పందించిన భట్టి విక్రమార్క.. ఏమన్నారంటే!
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి వివాదంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. యాదాద్రి ఆలయంలో తాను కావాలనే చిన్నపీట మీద కూర్చున్నానని తెలిపారు. దేవుడిపై భక్తి భావంతోనే అలా చేశానని పేర్కొన్నారు. ఒక్క ఫోటోతో సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన్నట్లు ట్రోల్ చేస్తున్నారని అన్నారు. తనను ఎవరూ అవమానించలేదని, దీన్ని అందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు. బంజారాహిల్స్‌లో నిర్వహించిన సింగరేణి అతిథిగృహ శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాదాద్రి ఘటనపై వివరణ ఇచ్చారు. యాదాద్రిలో ఫోటో చూసి తనకు అవమానం జరిగిందని కొంత మంది భావించారని.. తనను ఎవరూ అవమానించలేదన్నారు. తాను ఎవరికీ తలవంచే వాడిని కాదని తెలిపారు. తాను డిప్యూటీ సీఎంగా రాష్ట్రాన్ని శాసిస్తున్నానని, ఆర్థిక, విద్యుత్, ప్రణాళిక వంటి మూడు శాఖలతో ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నానని తెలిపారు. ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునే వాడిని కాదన్నారు. ఆత్మగౌరవాన్ని చంపుకునే మనస్తత్వం తనది కాదని స్పష్టం చేశారు. అయితే యాదాద్రిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సీఎం దంపతులు, ఉత్తమ్, కోమటిరెడ్డి బెంచ్‌పై కూర్చోగా డిప్యూటీ సీఎం భట్టి స్టూల్‌పై కూర్చున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు సహా ఇతర పార్టీల నేతలంగా భట్టిని అవమానించారని కాంగ్రెస్ పార్టీపై మండిపడిన విషయం తెలిసిందే. చదవండి: కాంగ్రెస్, బీఆర్ఎస్ అజెండా ఒక్కటే: కేంద్ర మంత్రి అమిత్ షా -
కాంగ్రెస్, బీఆర్ఎస్ అజెండా ఒక్కటే: కేంద్ర మంత్రి అమిత్ షా
సాక్షి, హైదరాబాద్: భాగ్యలక్ష్మి అమ్మవారికి, భద్రాద్రి రాముడికి నమస్కారాలు తెలుపుతూ.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎవరు అధికారంలో ఉండాలో తేలిపోతుందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా అమిత్ షా.. బీజేపీ సోషల్‌మీడియా వారియర్స్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు.‘ఇళ్లు ఇళ్లు తిరిగి ప్రచారం చేసే కార్యకర్తకు ఎంత హక్కు ఉందో సోషల్ మీడియాకు అంతే. మూడోసారి మోదీ సర్కార్ అధికారంలోకి రాబోతుంది.దేశంలో ఎక్కడికి వెళ్లినా మోదీ పేరు తప్ప వేరే పేరు వినిపించడం లేదు. తెలంగాణలో 12 కంటే ఎక్కువ పార్లమెంట్ స్థానాలు గెలవాలి. 10ఏళ్లలో మోదీ సర్కార్ అవినీతిని అంతం చేసింది. దేశం సురక్షితంగా ఉంది అంటే కారణం మోదీ సర్కార్. మోదీ హయాంలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతుంది. 5 వందల ఏళ్ల కల నెలవెర్చిన ఘనత మోదీ సర్కార్‌ది. గతంలో కాంగ్రెస్ సర్కార్ చేయని పని మోదీ చేసి చూపించాడు. ఆర్టికల్ 370 రద్దు చేసిన ఘనత మోదీ... కాంగ్రెస్ పార్టీ దానిని రాజకీయం మాత్రమే చేసింది. మోదీ సర్కార్ చేసి చూపించింది. ట్రిపుల్ తలాక్ తీసివేసిన వ్యక్తి మోదీ. మహిళ రిజర్వేషన్ కల్పించారు. సీఏఏ నిర్ణయం కూడా మోదీ సర్కార్ చేసింది. కాంగ్రెస్ పార్టీ చేయని పనిని మోదీ సర్కార్ చేసి చూపించింది. సీఏఏని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. మీ చేతిలో మెక్ ఇన్ ఇండియా ఫోన్ ఉంది.దీని ఘనత మోదీది. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు వేరు ఎజెండా ఒక్కటే, మజ్లిస్ ఎజెండా లో మిగితా పార్టీలు నడుస్తాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మొత్తం కుటుంబ పార్టీలే... అవినీతి పార్టీలే ఈ మూడు. రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్న కాంగ్రెస్ హయాంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయి. రూ. 12లక్షల కోట్ల అవినీతి చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ అభివృద్ది మోదీ తోనే సాధ్యం.ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన వ్యక్తి మోదీ. మోదీ జీవితం మొత్తం ప్రజల కోసమే పోరాటం చేస్తున్నాడు. మోదీ విరామం లేకుండా పని చేస్తున్నాడు..రాహుల్ బాబా విశ్రాంతి కోసం విదేశాలకు వెళతాడు. సీఎం రేవంత్‌రెడ్డిని అడుగుతున్న గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ రూ. 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. ఒక్క తెలంగాణకు మోదీ రూ. 2 లక్షల కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్రవాదుల భరతం పట్టాడు మోదీ. ఇండియా అలయన్స్, బీఆర్ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా బీజేపీ గెలుపును ఆపలేరు. 400 స్థానాల్లో 12 కంటే ఎక్కువ స్థానాలు తెలంగాణ నుండి ఉండాలి’ అని అమిత్ షా అన్నారు. -
కేటీఆర్‌కు అస్వస్థత.. ‘కదన భేరి’కి దూరం
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అస్వస్థతకు గురయ్యారు. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు పార్టీ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. దీంతో ఆయన బీఆర్ఎస్ కరీంనగర్ సభకు దూరంగా ఉంటారని తెలిపింది. ఇవాళ కరీంనగర్లో కదన భేరి పేరుతో బీఆర్ఎస్ సభ నిర్వహించనుంది. ఈ సభ నుంచి లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పార్టీ అధినేత కేసీఆర్ పూరించనున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్కు కరీంనగర్ సెంటిమెంట్ ఎక్కువ. దీంతో ఈ సభను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అలాంటి సభకు అనారోగ్యంతో కేటీఆర్ హాజరు కాలేకపోతుండడం విశేషం. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS ఈరోజు జరగనున్న కరీంనగర్ సభకు హాజరు కాలేకపోతున్నట్లు తెలిపిన కేటీఆర్ గారు గత రెండు రోజులుగా ఇంటి వద్దనే డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉందని తెలిపిన… — BRS Party (@BRSparty) March 12, 2024 మూడు రోజుల కింద కామారెడ్డిలో జరిగిన సమావేశం తర్వాత కేటీఆర్ అస్వస్థతకు గురయ్యారు. ఇదిలా ఉంటే.. గత రెండు రోజులుగా ఇంటి వద్దనే డాక్టర్ పర్యవేక్షణలో ఆయన చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా కోలుకుంటారని.. తిరిగి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నారు. -
బీజేపీ రెండో జాబితాపై ఉత్కంఠ
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి లోక్‌సభ బరిలో నిలిచే అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఓ కొలిక్కి తెచ్చింది. రెండు రోజుల్లో సుమారు 100 నుంచి 150 మంది అభ్యర్థులతో ఈ జాబితాను విడుదల చేయనున్నట్టు ఆ పార్టీవర్గాలు తెలిపాయి. ఈ జాబితాలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యత కల్పించేలా బీజేపీ అధిష్టానం ప్రత్యేక కసరత్తు చేసిందని వెల్లడించాయి. తెలంగాణలో పెండింగ్ ఉన్న ఎనిమిది స్థానాలలో 7 అభ్యర్థులను ఖరారు చేసింది. గత నెల 29న తొలిసారి భేటీ అయిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ.. ప్రధాని మోదీ సహా మొత్తం 195 అభ్యర్థులతో తొలి జాబితాకు ఆమోదముద్ర వేసింది. మార్చి 2న తొలి జాబితాను అధికారికంగా విడుదల చేసింది. రెండో జాబితాపై సోమవారం రాత్రి 8 గంటలకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బీఎల్ సంతోష్, పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఇతర సభ్యులు ఈ సమావేశంలో పాల్గొని రెండో జాబితాపై చర్చించారు. తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులపై కసరత్తు పూర్తి చేశారు. 370 సీట్ల లక్ష్యాన్ని బీజేపీ పెట్టుకుంది. తమ అభ్యర్థులను ముందుగానే ప్రకటించడం ద్వారా ప్రచారంలోకి దూసుకెళ్లాలని బీజేపీ ఎత్తుగడ వేస్తోంది. తెలంగాణలో ఖరారైన అభ్యర్థులు వీరేనా? మహబూబ్‌నగర్- డీకే అరుణ మెదక్-రఘునందన్‌రావు మహబూబాబాద్- సీతారాం నాయక్ ఖమ్మం-జలగం వెంకట్రావు నల్గొండ- శానం సైదిరెడ్డి పెద్దపల్లి- గోమాస శ్రీనివాస్ వరంగల్- కృష్ణ ప్రసాద్ ఢిల్లీ చేరిన ‘ఆదిలాబాద్ సీటు పంచాయితీ’ మరోవైపు, ఆదిలాబాద్ బీజేపీ సీటు వ్యవహారం హస్తినకు చేరింది. తొలి జాబితాలో సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావ్ పేరును బీజేపీ అధిష్టానం పక్కనపెట్టడంతో మొదలైన పంచాయితీ.. ఆదివారం బీఆర్ఎస్ మాజీ ఎంపీ నగేష్ కాషాయ కండువా కప్పుకోవడంతో తారస్థాయికి చేరింది. నగేష్ బీజేపీలో చేరినందున ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని ఆయనకే ఇస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో ఆదిలాబాద్‌కు చెందిన బీజేపీ నేతలు రమేష్ రాథోడ్, రాథోడ్ బాపూరావ్ సహా పలువురు సోమవారం ఢిల్లీకి చేరుకొని బీజేపీ పెద్దలను కలిసే ప్రయత్నం చేశారు. పారీ్టలో మొదటి నుంచి పనిచేసినవారికి కాకుండా ఇటీవల పారీ్టలో చేరిన వారికి ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని కేటాయించొద్దని అధిష్టాన పెద్దలకు విజ్ఞప్తి చేశారు. చేరి 24 గంటలు కాకముందే సీటు ఎలా? రమేష్ రాథోడ్ రమేష్ రాథోడ్ మీడియాతో మాట్లాడుతూ, ఆదిలాబాద్ పార్లమెంట్ విషయంలో బీజేపీ కేంద్ర పెద్దలను కలిశామని చెప్పారు. నగేష్ పార్టీలో చేరి 24 గంటలు కూడా కాకుండానే... ఆదిలాబాద్ సీట్ తమదే అంటున్నారని మండిపడ్డారు. నగేష్‌కు ఇతర పార్టీల్లో అవకాశం దొరకక చివరికి బీజేపీలో చేరారని ఆరోపించారు. బీజేపీలో అభ్యర్థులకు కొరత ఏమాత్రంలేదన్నారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్న వారికి ఎలాంటి హామీలు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఆదివాసీల కంటే లంబాడీలే ఎక్కువ మంది ఉన్నారని చెప్పారు. బీజేపీ పెద్దలతో తనకు ఎలాంటి విభేదాలు లేదని రమేష్ రాథోడ్ స్పష్టం చేశారు. ఇదీ చదవండి: నేను గేట్లు తెరిస్తే.. బీఆర్ఎస్ ఉండదు: సీఎం రేవంత్‌రెడ్డి -
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయను అమిత్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: బీఆర్ఎస్ అధిష్టానం ఓకే అంటే.. ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎక్కడినుంచైనా పోటీచేసేందుకు సిద్ధమని పలుమార్లు ప్రకటించిన గుత్తా సుఖేందర్‌రెడ్డి కుటుంబం ఒక్కసారిగా యూటర్న్ ఎందుకు తీసుకుంది..? తాము పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోమని బీఆర్ఎస్ అధిష్టానానికి ఎందుకు తెగేసి చెప్పింది? దీనిపై పరిశీలిస్తే బీఆర్ఎస్ పార్టీలోని వర్గపోరే ఇందుకు కారణమని తెలుస్తోంది. తాము పోటీ చేస్తామని చెబుతున్నా ఇతర నేతలతో ఎందుకు సంప్రదింపులు జరుపుతున్నారని, ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఎన్నికల్లో ఏం సహకరిస్తారంటూ సుఖేందర్‌రెడ్డి కుటుంబం నుంచి ఆవేదన వ్యక్తమవుతోంది. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ నుంచి తాము తప్పుకోవాల్సివచ్చిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అమిత్‌రెడ్డి దారెటు అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో గుత్తా అమిత్‌రెడ్డి భేటీ కావడంతో.. ఆయన పార్టీ మారుతారంటూ ప్రచారం జోరందుకుంది. అయితే, దానిని అమిత్ ఖండించారు. సీఎం రేవంత్‌రెడ్డికి గుత్తా కుటుంబానికి బంధుత్వం ఉండటంతో ఆ ప్రచారం సాధారణమేనని, తాము పార్టీ మారే ఆలోచన లేదని సుఖేందర్‌రెడ్డి ఇప్పటికే పలుమార్లు పేర్కొన్నారు. పోటీకి సిద్ధంగా ఉన్నామన్నా.. తన కుమారుడు అమిత్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తాడని గుత్తా సుఖేందర్‌రెడ్డి గతంలో ప్రకటించారు. నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో ఎక్కడి నుంచి అయినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అయితే, బీఆర్ఎస్లోని జిల్లా నేతలు కొందరు అమిత్‌కు టికెట్ ఇవ్వద్దంటూ అధిష్టానానికి చెప్పారు. మొదటి నుంచీ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, సుఖేందర్‌రెడ్డికి మధ్య సఖ్యత లేని కారణంగా మాజీ మంత్రి వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం సాగింది. తాము పోటీ చేస్తామని చెబుతున్నా మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఇతరులను బరిలో నిలిపేందుకు చర్చలు జరిపారంటూ గుత్తా వర్గం మండిపడింది. ఈ పరిణామాల నేపథ్యంలో అమిత్ పార్టీ మారతారంటూ ప్రచారం జరిగింది. కాంగ్రెస్ నుంచి భువనగిరి టికెట్ అడుగుతున్నారన్న చర్చ జోరందుకుంది. అయితే, తాము పార్టీ మారుతారనే ప్రచారాన్ని గుత్తా అమిత్‌రెడ్డి ఖండించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జిల్లా మంత్రి కాబట్టే తాను కలిశానని పేర్కొన్నారు. కాగా, పార్లమెంట్ ఎన్నికల్లో తాను పోటీచేయబోనని, జిల్లాలో జరిగిన.. జరుగుతున్న పరిణామాలన్నింటిని కేటీఆర్, హరీష్‌రావుకు అమిత్‌రెడ్డి వివరించినట్లు తెలిసింది. ‘గుత్తా’కు అందని ఆహ్వానం! పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నేతలతో సోమవారం మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి తెలంగాణ భవన్లో భేటీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీలో నిలిపే అభ్యర్థి విషయంపై చర్చించారు. అనంతరం వారంతా మాజీ సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సమావేశానికి గుత్తా అమిత్‌కు ఆహ్వానం పంపలేదని తెలిసింది. అందుకే ఆయన హాజరుకాలేదని సమాచారం. ఆ ఇద్దరిలో ఒకరు నల్లగొండ పార్లమెంట్ నియోజకర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి విషయంపై మాజీ సీఎం కేసీఆర్‌తో జిల్లా నేతలు చర్చించారు. జగదీష్‌రెడ్డి నేతృత్వంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్‌కుమార్, నల్లమోతు భాస్కర్‌రావు, చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్యయాదవ్ తదితర నేతలు సోమవారం కేసీఆర్ వద్దకు వెళ్లారు. అభ్యర్థి విషయంలో ఏదైనా నిర్ణయానికి వచ్చారా అని కేసీఆర్ అడగ్గా నలుగురైదుగురు అడుగుతున్నారని చెప్పినట్లు తెలిసింది. అయితే, గట్టి పోటీ ఇవ్వగలిగే వారిలో మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి పేర్లను సూచించినట్లు తెలిసింది. వారిద్దరిలోనే ఎవరో ఒకరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. లక్ష్మిని పోటీచేయించే యోచనలో కాంగ్రెస్ భువనగిరి ఎంపీ టికెట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆచితూచీ వ్యవహరిస్తోంది. భువనగిరిలో ఎవరైతే భారీ మెజారిటీతో గెలుస్తారన్న విషయంపైనా కాంగ్రెస్ అధిష్టానం సర్వే చేయిస్తోంది. ప్రస్తుతం టికెట్ అడుగుతున్న వారందరి పేర్లతోనూ సర్వేలు చేయించింది. బలమైన అభ్యర్థినే పోటీలో నిలుపాలన్న ఆలోచనలో ఉంది. అయితే, ఇక్కడి నుంచి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి లక్ష్మిని బరిలో నిలపాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలిసింది. లక్ష్మీని పోటీచేయించాలంటూ అధిష్టానం రాజగోపాల్‌రెడ్డిపై ఒత్తిడి పెంచినట్లుగా తెలుస్తోంది. -
పదవుల కోసం పోయెటోళ్లతో పరేషానొద్దు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: పదవుల కోసం పార్టీలు మారే వారికోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కొందరు నేతలు అధికారం ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారని, అలాంటి వారిని చూసి పార్టీని నమ్ముకున్న నేతలు ఆత్మ విశ్వాసం కోల్పోవద్దని సూచించారు. పార్లమెంటు ఎన్నికల సన్నద్ధతలో భాగంగా నియోజకవర్గాల వారీగా భేటీలు నిర్వహిస్తున్న కేసీఆర్.. సోమవారం నందినగర్ నివాసంలో నల్లగొండ, చేవెళ్ల బీఆర్ఎస్ కీలక నేతలతో వేర్వేరుగా భేటీ అయ్యారు. చెరువు నిండినపుడు కప్పలు చేరినట్లు, అధికారం ఉన్న చోటకు వలసలు సహజమని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు. కొందరు నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లడం బీఆర్ఎస్కే మేలు చేస్తుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోపే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారని, అన్ని స్థాయిల్లో పార్టీ నేతలు సమన్వయంతో పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. చేవెళ్ల అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్! చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి పోటీకి విముఖత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరో ధీటైన అభ్యర్థిని బరిలోకి దించుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ అభ్యర్థిత్వంపై నియోజకవర్గం పరిధిలోని కీలక నేతల నుంచి అభిప్రాయాలు సేకరించిన ఆయన.. కాంగ్రెస్, బీజేపీలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని అభ్యర్థులుగా ఎంపిక చేసిన నేపథ్యంలో బీసీ (ముదిరాజ్) సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ ధీటైన అభ్యర్థి అవుతారని పేర్కొన్నారు. త్వరలో చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు తేదీ నిర్ణయించాల్సిందిగా పార్టీ నేతలకు సూచించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ. మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ ఆనంద్, రోహిత్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి, పార్టీ నేతలు కార్తీక్‌రెడ్డి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. రంజిత్‌రెడ్డి, గుత్తా అమిత్ దూరం లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి సోమవారం నాటి భేటీకి దూరంగా ఉన్నారు. తాను పోటీకి సిద్ధంగా లేనని కొద్ది రోజుల క్రితం రంజిత్‌రెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సమాచారం అందించినట్లు తెలిసింది. మరోవైపు మొన్నటివరకు నల్లగొండ, భువనగిరిలో ఏదో ఒకచోట నుంచి టికెట్ ఆశించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు గుత్తా అమిత్‌రెడ్డి కూడా కేసీఆర్‌తో జరిగిన భేటీకి హాజరు కాలేదు. టికెట్ రేసు నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఆయన కూడా వారం క్రితమే పార్టీ అధినేతకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కాగా హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి రెండురోజుల క్రితం బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరిన నేపథ్యంలో త్వరలో పార్టీ కొత్త ఇన్చార్జిని ప్రకటిస్తామని..తెలంగాణ భవన్లో తనను కలిసిన ఆ నియోజకవర్గ నేతలకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. రెండు మూడురోజుల్లో రెండో జాబితా? బీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగిస్తున్న కేసీఆర్ రెండు మూడురోజుల్లో రెండో జాబితా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలు నామా నాగేశ్వర్రావు (ఖమ్మం), మన్నె శ్రీనివాస్‌రెడ్డి (మహబూబ్‌నగర్), మాలోత్ కవిత (మహబూబాబాద్)తో పాటు మాజీ ఎంపీ వినోద్ కుమార్ (కరీంనగర్), మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (పెద్దపల్లి) అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. తాజాగా గాలి అనిల్‌కుమార్ (జహీరాబాద్), కాసాని జ్ఞానేశ్వర్ (చేవెళ్ల) పేర్లపై దాదాపుగా స్పష్టత వచ్చింది. బీఎస్పీతో పొత్తు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు నాగర్‌కర్నూలు కేటాయించే అవకాశముంది. ఇక పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మల్కాజిగిరి, సికింద్రాబాద్, మెదక్ అభ్యర్థుల విషయంలో మాత్రం చివరి నిమిషం దాకా వేచి చూసే ధోరణిలో కేసీఆర్ ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను బట్టి బీఆర్ఎస్ అభ్యర్థులను ఎంపిక చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి రెండురోజుల క్రితం బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరిన నేపథ్యంలో నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు సోమవారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని కలిశారు. గిరిజనులు ఎక్కువగా ఉండే హుజూర్నగర్ బీఆర్ఎస్ ఇన్చార్జిగా గిరిజన నేతకు బాధ్యతలు అప్పగించాలని కొందరు కోరారు. అయితే కేసీఆర్ ప్రస్తుతానికి జగదీశ్‌రెడ్డి, రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌కు నియోజకవర్గ సమన్వయ బాధ్యతలు అప్పగించారు. కాగా త్వరలో పార్టీ ఇన్చార్జిని ప్రకటిస్తామని జగదీశ్‌రెడ్డి చెప్పారు. -
చేతులెత్తి మొక్కుతున్నాం..
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: ఎమ్మెల్సీలుగా రాజ్యాంగబద్ధంగా నామినేటైన తమ అభ్యర్థిత్వాన్ని ఆమోదించాలని దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ.. గవర్నర్ తమిళిసైకి విజ్ఞప్తి చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తమ పేర్లను ఆమోదించాల్సిందిగా చేతులెత్తి మొక్కుతున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ సోమవారం రాజ్‌భవన్‌లో వినతిపత్రం సమరి్పంచారు. తమ విజ్ఞాపనతో పాటు ఇటీవల హైకోర్టు వెలువరించిన 88 పేజీల తీర్పు కాపీని కూడా జత చేసి గవర్నర్ కార్యాలయంలో అందజేశారు. తమను ఎమ్మెల్సీలుగా ఆమోదించాలని రాజ్‌భవన్ గేట్లకు మొక్కారు. రాజ్యాంగ ఉల్లంఘనపై హైకోర్టుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసినా, 55 రోజుల తర్వాత కేబినెట్ ప్రతిపాదనను గవర్నర్ తిరస్కరించారని దాసోజు శ్రవణ్ మీడియాకు తెలిపారు. అయితే తమ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించడంపై హైకోర్టును ఆశ్రయించామన్నారు. మరోవైపు కొత్త ప్రభుత్వం గవర్నర్ కోటాలో కోదండరాం, అమేర్ అలీఖాన్ పేర్లను ప్రతిపాదించగా గవర్నర్ ఆమోదించారన్నారు. ఈ మేరకు గెజిట్ కూడా విడుదల కాగా, కోదండరాం, అమేర్ అలీఖాన్‌లను నామినేట్ చేయడం రాజ్యాంగ ఉల్లంఘన అని హైకోర్టు పేర్కొందన్నారు. అట్టడుగు కులాలకు చెందిన తమకు న్యాయం చేయాలని దాసోజు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. తాము ఇద్దరూ గతంలో బీజేపీ, దాని అనుబంధ విభాగాల్లో పనిచేశామని దాసోజు, కుర్రా సత్యనారాయణ తమ వినతిపత్రంలో పేర్కొన్నారు. -
16, 18, 19 తేదీల్లో మోదీ ఎన్నికల ప్రచారం!
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 16, 18, 19 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలోని వివిధ చోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్టు బీజేపీ వర్గాల సమాచారం. ఈ నెల 15 నుంచి 19 దాకా దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు మోదీ సమయం కేటాయించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ మూడు తేదీల్లో మూడుచోట్ల పారీ్టపరంగా ఏర్పాటు చేయనున్న బహిరంగసభల్లో ఆయన ప్రసంగిస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మోదీ పర్యటన సందర్భంగా జగిత్యాల, నాగర్‌కర్నూల్, మల్కాజిగిరిలలో సభల నిర్వహణకు రాష్ట్ర పార్టీ సన్నాహాలు ప్రారంభిస్తున్నట్టు పార్టీ నాయకులు తెలిపారు. రాష్ట్రంలో ప్రధాని మోదీ మూడు రోజుల పర్యటనకు సంబంధించిన వివరాలను సోమవారం పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు చింతల రామచంద్రారెడ్డి, డా.ఎస్.ప్రకాశ్‌రెడ్డి తెలియజేశారు. ఒక్కో చోట నిర్వహించే బహిరంగసభలో రెండు, మూడు లోక్‌సభ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జగిత్యాల సభలో నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాలు, నాగర్‌కర్నూల్ బహిరంగసభలో నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నల్లగొండ, మల్కాజిగిరి సభలో భువనగిరి, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాలు కవరయ్యేలా కార్యక్రమాన్ని పార్టీ నాయకులు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. -
నేడు రాష్ట్రానికి అమిత్ షా
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం నాటి రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. పర్యటనలో భాగంగా... ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1:20 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1:45 నుంచి 2:45 వరకు ఇంపీరియల్ గార్డెన్లో బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్‌లో పాల్గొని వారికి అమిత్ షా దిశా నిర్దేశం చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3:15 నుంచి 4:25 వరకు ఎల్బీ స్టేడియంలో నిర్వ హించే విజయ సంకల్ప సమ్మేళనంలో పాల్గొంటారు. బీజేపీ పోలింగ్ బూత్ కమిటీల అధ్యక్షులు, ఆ పై మండల, జిల్లా కమిటీల అధ్యక్షులు, నాయకులు పార్టీ కార్యకర్తలకు ఆయన మార్గ నిర్దేశం చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 వేల పోలింగ్ బూత్‌లు ఉండడంతో ఈ బూత్ కమిటీల అధ్యక్షులు, ఇన్చార్జిలు, ఇతరనాయకులు.. మొత్తంగా దాదాపు 50–60 వేల మంది వరకు ఈ సమ్మేళనానికి హాజరయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్ర నేతలతో భేటీ కానున్న షా సమ్మేళనం అనంతరం సాయంత్రం 4:45 నుంచి 5:45 వరకు ఐటీసీ కాకతీయ హోటల్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై ఎన్నికల ప్రచారం, నాయకుల మధ్య మరింత మెరుగైన సమన్వయంపై అమిత్ షా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. సాయంత్రం 6:10 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం కానున్నారు. -
నేను గేట్లు తెరిస్తే.. బీఆర్ఎస్ ఉండదు: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: బీఆర్ఎస్, బీజేపీ కలసి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని కూలదోయాలని కుట్ర చేస్తున్నాయని.. ఆ కుటిల ప్రయత్నాలను తెలుసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమకు టచ్‌లోకి వస్తున్నారని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తాను ఒక్కసారి గేట్లు ఎత్తానంటే బీఆర్ఎస్లో తండ్రీకొడుకులు, మామా అల్లుడు తప్ప ఎవరూ మిగలరని వ్యాఖ్యానించారు. ఎక్కడ గుచ్చితే ఎక్కడ దిగుతుందో కూడా తెలుసని, తమతో పెట్టుకోవద్దని హెచ్చరించారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో కాంగ్రెస్ నిర్వహించిన ప్రజాదీవెన బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. మహబూబాబాద్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌ను గెలిపించాలని కోరారు. సభలో రేవంత్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని బీజేపీ నేత లక్ష్మణ్ ఎలా అంటారు? కేవలం ఎనిమిది మంది ఎమ్మెల్యేలున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుంది? బీఆర్ఎస్, బీజేపీ కలసి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని కూలదోయాలని ప్రయత్నిస్తున్నాయి. వారి కుటిల ప్రయత్నాలను తెలుసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాకు టచ్‌లోకి వచ్చారు. తాము ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అప్పటి సీఎం కేసీఆర్‌ను కలవడం వీలుకాకపోయేదని.. మీరు సామాన్యులను కలుస్తూ ప్రజాపాలన తెచ్చారని నాకు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోకుండా తాము అండగా ఉంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాకు హామీ ఇచ్చారు. ఇప్పటికే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాకు మద్దతుగా నిలుస్తూ ఈ సభకు వచ్చారు. నేను ఒక్కసారి గేట్లు ఎత్తానంటే బీఆర్ఎస్లో తండ్రీకొడుకులు, మామా అల్లుడు తప్ప ఎవరూ మిగలరు. మాతో అనవసరంగా గోక్కోవద్దు, గోక్కున్నోళ్లు ఎవరూ బాగుపడలేదు. కుమ్మక్కు రాజకీయాలు.. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ నాలుగు స్థానాలు, బీజేపీ తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా.. అందులో ఒక పార్టీ అభ్యర్థిని ప్రకటించిన స్థానంలో ఇంకో పార్టీ ప్రకటించలేదు. ఆయా అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేసుకునేలా రెండు పారీ్టలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్‌తోపాటు కవిత పోటీచేసిన నిజామాబాద్, కీలకమైన సికింద్రాబాద్ వంటి స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ఇంకా ఎందుకు ప్రకటించలేదో చెప్పాలి. మోదీ, కేడీ కలసి కాంగ్రెస్‌ను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందని ప్రశ్నించిన వారు.. ఇప్పుడు ఈ బహిరంగ సభలో కాంగ్రెస్ కార్యకర్తల కేరింతలు వింటే గుండె ఆగి చస్తారు. అదే పనిగా విమర్శలు ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతుంటే.. అవేమీ చూడకుండా మా ప్రభుత్వంపై కేటీఆర్ సిగ్గులేకుండా విమర్శలు చేస్తున్నారు. ఉట్టి మీద పాల కోసం పిల్లి శాపాలు పెడితే ఉట్టి తెగదన్నట్టు.. అధికారం మీద యావతో కాంగ్రెస్ ప్రభుత్వం మీద కేటీఆర్ అదే పనిగా విమర్శలు చేస్తున్నారు. మేం అధికారంలోకి వచ్చిన రెండో రోజునే రెండు హామీలు అమలు చేశాం. ఇప్పుడు భద్రాచలం సీతారాముల సాక్షిగా ఐదో హామీని అమలు చేస్తున్నాం. అందుకే భద్రాచలంలో ప్రారంభించాం.. తూర్పునే సూర్యుడు ఉదయిస్తాడు. అందుకే రాష్ట్రానికి తూర్పు దిక్కున ఉన్న భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించాం. గతంలో కేసీఆర్ ఇందిరమ్మ ఇళ్లు డబ్బా ఇళ్లంటూ విమర్శలు చేశారు. అన్ని హంగులతో డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని మాటలు చెప్రారు. కానీ పేదలెవరికీ ఇళ్లు ఇవ్వకుండా మోసం చేశారు. పేదలు సొంతింటి ముందు దర్జాగా నిలబడాలన్నదే మా లక్ష్యం. అందుకే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని నిర్ణయించాం..’’ అని రేవంత్ వెల్లడించారు. గృహ నిర్మాణశాఖను పటిష్టం చేస్తున్నాం: మంత్రులు స్వతంత్ర భారత చరిత్రలో ఏ ప్రభుత్వం కట్టని విధంగా లక్షలాది ఇందిరమ్మ ఇళ్లను గత కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించిందని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల పేరు చెప్పి గృహ నిర్మాణ శాఖను పూర్తిగా నిరీ్వర్యం చేసిందన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం గృహ నిర్మాణశాఖను పటిష్టం చేస్తోందని చెప్పారు. కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి థర్మల్ ప్లాంట్‌ను నిర్మించి ఈ ప్రాంతానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 14 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. ఇక రాబోయే 35 రోజులు కార్యకర్తలు కష్టపడితే కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు తథ్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సేవకులుగా ఎంత కష్టమైనా పడేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. -
బీసీ కులగణన వెంటనే చేపట్టాలి: ఎమ్మెల్సీ కవిత
నల్గొండ: అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. పూలే జయంతికి మరో నెల రోజులు మాత్రమే సమయం ఉందన్నారు. భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ హక్కుల సాధనకై రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత పాల్గొని మాట్లాడారు. ‘ప్రభుత్వం నుంచి అసెంబ్లీలో విగ్రహ ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి. 1931లో చివరిసారిగా కుల గణన చేశారు. బీసీ కులగణన వెంటనే చేపట్టాలి. మండల్ కమీషన్‌కు వ్యతిరేకంగా ఆనాడు రాజీవ్‌గాంధీ మాట్లాడారు. 1996లో రూ.4500 కోట్లతో కులగణన చేసి కనీసం వాటిని బయట కూడా రానివ్వలేదు కాంగ్రెస్. ఎంతమంది బీసీ జడ్జీలు ఉన్నారని రాహుల్ గాంధీ అంటున్నారు. 75 ఏళ్లు పాలించింది మీరు కాదా రాహుల్. ...పార్లమెంట్లో పూలే విగ్రహం ఉన్నంక అసెంబ్లీలో ఉంటే తప్పేంటి. ఏపీలో కులగణనపై ఓ ప్రణాళిక ప్రకారం చట్టం చేసి ముందుకు పోతున్నారు. కులగణన చేసి రిజర్వెషన్ల కోటా తేలాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. బీసీ సబ్ ప్లాన్ తీసుకొచ్చి 20 వేల కోట్ల నిధులిస్తామన్నారు. బడ్జెట్లో ఎనిమిది వేల కోట్లే ఇచ్చారు. తెలంగాణలో ఎంబీసీ మినిస్ట్రీ ఏర్పాటు చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు ఏమైందో చెప్పాలి’ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. -
ఖమ్మం జిల్లాలో కేసీఆర్ పార్టీకి వచ్చింది ఒకసీటే: రేవంత్
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం మార్కెట్ యార్డు సభా ప్రాంగణంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, కొమటి రెడ్డి వెంకట రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మణుగూరు బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. రూ. 22,500 కోట్లతో ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టామని అన్నారు. మహిళల పేరు మీదే ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. పేదల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇళ్లని అన్నారు. తెలంగాణలో నాలుగున్నర లక్షల ఇళ్లు ఇవ్వబోతున్నామని చెప్పారు. కాంగ్రెస్‌కు ఖమ్మం జిల్లాకు బలమైన బంధం ఉందని అన్నారు రేవంత్. మొదటి నుంచి ఖమ్మం ప్రజలు కేసీఆర్‌ను నమ్మలేదని చెప్పారు. 2014, 2018, 2023లో కూడా ఖమ్మం జిల్లాలో కేసీఆర్ పార్టీకి వచ్చింది ఒకసీటేనని గుర్తు చేశారు. కేసీఆర్ చెప్పిన కథనే మళ్ళీ మళ్ళీ చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేశారని, అందుకే ప్రజలు బీఆర్ఎస్ను బొంద పెట్టారని దుయ్యబట్టారు. పేదవారితో కేసీఆర్ ఆటలాడుతున్నారని మండిపడ్డారు. రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్‌ను కేంద్రం 1200 చేసిందని విమర్శించారు. ఏ ఊర్లో డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారో అక్కడే బీఆర్ఎస్ ఓట్లు అడగాలని అన్నారు. ఏ ఊరిలో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామో.. ఆ ఊళ్లోనే మేము ఓట్లు అడుగుతామని..ఈ ఛాలెంజ్‌కు బీఆర్ఎస్ రెడీనా అని సవాల్ విసిరారు. -
TS: బీజేపీలో ముసలం.. ఢిల్లీకి చేరిన టికెట్ పంచాయితీ
సాక్షి, ఢిల్లీ/ఆదిలాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీలో సీట్ల కేటాయింపు పంచాయితీ పీక్ స్టేజ్‌కు చేరుకుంది. సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు సీటు ఇవ్వకపోవడం పార్టీ నేతలను ఆగ్రహానికి గురిచేస్తోంది. ఇదే సమయంలో మాజీ ఎంపీ నగేష్ చేరిక ఆదిలాబాద్ బీజేపీలో కాకరేపుతోంది. దీంతో, కాషాయ పార్టీ నేతలు ఢిల్లీ బాటపడ్డారు. కాగా, బీజేపీ తొలి జాబితాలో భాగంగా తెలంగాణ నుంచి తొమ్మిది మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది. ఇక, వారిలో ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు పేరు లేకపోవడంతో ఆయనను, పార్టీ శ్రేణులను విస్మయానికి గురి చేసింది. దీంతో, ఆయన హైకమాండ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెకండ్ లిస్ట్‌లో కూడా తన పేరు రాకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మరోవైపు.. ఆదిలాబాద్ మాజీ ఎంపీ నగష్ కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నగేష్ చేరిక ఆదిలాబాద్ బీజేపీలో తీవ్ర కలవరాన్ని రేపుతోంది. నగేష్‌ను బీజేపీలో చేర్చుకోవడాన్ని మెజారిటీ కమలం పార్టీ శాసనసభ్యులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే నగేష్‌ను వ్యతిరేకిస్తున్న కొందరు బీజేపీ నేతలు హస్తిన బాట పట్టారు. ఆదిలాబాద్‌కు చెందిన రమేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపు, పలువురు బీజేపీ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్‌ను వారు కలవనున్నారు. ఇదే సమయంలో నగేష్ చేరికపై అభ్యంతరాలను ఆదిలాబాద్ బంజారా నేతలు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. పార్టీలో మొదటి నుండి పనిచేసిన వారికి కాకుండా ఇటీవల చేరిన వారికి ఆదిలాబాద్ లోక్‌సభ టికెట్ ఇవ్వద్దని అధిష్టానానికి సూచించారు. ఇక, బీఎల్ సంతోష్ ఇచ్చే సమాధానం బట్టి తదుపరి కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించారు. -
రెండో జాబితాపై కాంగ్రెస్ కసరత్తు.. నేడు కీలక భేటీ
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ఈ సందర్బంగా అభ్యర్థులకు ఖరారు చేయనున్నట్టు సమాచారం. కాగా, తొలి విడత అభ్యర్థుల జాబితాలో భాగంగా కాంగ్రెస్ పార్టీ 39 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా నేడు సాయంత్రం ఆరు గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ సీఈసీ భేటీ కానుంది. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, తమిళనాడు, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఇక, మొదటి జాబితాలో భాగంగా తెలంగాణలో నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఖమ్మం పార్లమెంట్ స్థానంలో అభ్యర్థి ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. -
నేడే బీజేపీ రెండో జాబితా?.. తెలంగాణ నుంచి రేసులో వీరేనా!
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ సారించింది. ఇప్పటికే 195 మంది అభ్యర్థులతో మొదటి జాబితా విడుదల చేసింది. ఇక, ఇప్పుడు రెండో జాబితా కోసం కసరత్తుల్ని ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఇవాళ బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగనుంది. రెండో జాబితా అభ్యర్థుల్ని ఖరారు చేయనుంది. అయితే.. ఆ అభ్యర్థుల జాబితా ఇవాళ సాయంత్రమే వెలువడే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంతోనే తెలంగాణలో బీజేపీలోకి చేరికలు భారీగానే జరుగుతున్నాయి. బరిలో బలమైన అభ్యర్థులను నిలిపేందుకు హైకమాండ్ ప్రయత్నాలు చేస్తోంది. కాగా, నిన్న(ఆదివారం) బీఆర్ఎస్ మాజీ ఎంపీలు నగేష్, సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జలగం వెంకట్రావ్‌లు బీజేపీలో చేరారు. దీంతో, వీరికి టికెట్స్ ఇస్తారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక, ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు బీబీ పాటిల్, రాములు తనయుడు భరత్ టికెట్ దక్కించుకున్నారు. టికెట్ కోసం రేసులో ఉన్న ఆశావహులు.. మహబూబ్‌నగర్: డీకే అరుణ/ జితేందర్ రెడ్డి మెదక్: రఘునందన్ రావు/ అంజిరెడ్డి ఆదిలాబాద్: నగేష్/సోయం బాపురావు/ అభినవ్ సర్దార్ మహబూబాబాద్: సీతారాం నాయక్ ఖమ్మం: జలగం వెంకట్రావు నల్గొండ: శానం సైదిరెడ్డి వరంగల్: కృష్ణ ప్రసాద్ పెద్దపల్లి: ఎస్. కుమార్ -
ఇంకా ఐదురోజులే మిగిలింది
మల్యాల (చొప్పదండి)/కొండగట్టు: కాంగ్రెస్ ప్రభు త్వం ప్రజలకు హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు మిగిలింది ఇంకా ఐదు రోజులేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఊడ్చిపారేసినా ఆ పార్టీ గుణపాఠం నేర్చుకోలేదన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పార్టీ అని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ఆదివారం ప్రజాహిత యాత్ర చేపట్టిన ఆయనకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సంజయ్ మల్యాల మండల కేంద్రంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల అమలు మాట నిలబెట్టుకుంటుందో? లేదో మరో ఐదురోజుల్లో తేలిపోతుందన్నారు. గ్యారంటీల అ మలుకు సరిపడా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని, పార్లమెంట్ సమావేశాలకు తాను హాజరుకాలేదన్న విమర్శలు సరికాదని, లోక్‌సభ రికార్డులు పరిశీలిస్తే తెలుస్తుందని స్పష్టం చేశారు. మల్యాల మండలానికి కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనులకోసం రూ.167 కోట్ల 42 లక్షలు, రోడ్ల నిర్మాణానికి రూ.72 కోట్ల 91 లక్షలు, మొక్కల పెంపకానికి రూ.88 కోట్ల 52 లక్షలు మంజూరు చేసిందని వెల్లడించారు. పైసలిచ్చిన ఘనత బీఆర్ఎస్, కాంగ్రెస్‌లది బాంబులు పేల్చే పీఎఫ్ఐకి పైసలిచ్చిన ఘనత బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలదని బండి సంజయ్ అన్నా రు. ప్రజాహిత యాత్రలో భాగంగా ఆయన కొడిమ్యాల మండలం నాచుపెల్లి, కొడిమ్యాల గ్రామా ల్లో మాట్లాడారు. రాముని పేరు వింటేనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు వణుకు పుడుతోందన్నారు. బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జి బొడిగ శోభ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మా అయ్య పేరు కేసీఆర్.. తెలంగాణ జాతి పిత
సాక్షి, కామారెడ్డి, సిరిసిల్ల: ‘‘అయ్య పేరు చెప్పుకుని రాలేదంటూ సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతుండు. అవ్.. మా అయ్య పేరు కేసీఆర్. కొట్లాడి రాష్ట్రం తెచ్చిన తెలంగాణ జాతిపిత’’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వ్యాఖ్యానించారు. ‘‘రాహుల్ గాంధీ అయ్య, అవ్వ పేర్లు చెప్పుకుని రాలేదా? నీ పక్కన ఉన్న శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలు ఎట్ల వచ్చిండ్రు’’ అంటూ ప్రశ్నించారు. ‘‘నేను నీలెక్క పార్టీలు మారి, ఆంధ్రోళ్ల బూట్లు నాకి, రాంగ్రూట్లో రాలేదు. నేను ఉద్యమంల నుంచి ఎదిగి వచ్చినోన్ని. ఐదుసార్లు సిరిసిల్ల ప్రజలు గెలిపించిండ్రు’’ అని చెప్పుకొచ్చారు. ఆదివారం కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాల్లో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మూడు నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్నారు. రేవంత్‌రెడ్డి పాలనకు ఇంకో వారం గడిస్తే వంద రోజులవుతుందని, అప్పుడు ఆయన భరతం పట్టేందుకు కరెంటు కష్టాలు ఎదుర్కొంటున్న రైతులు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కోడ్ పేరుతో తప్పించుకుంటే ఊరుకోం సీఎం రేవంత్‌రెడ్డి మోసాల్లో దిట్ట అని కేటీఆర్ విమర్శించారు. డిసెంబర్ 9న రూ.2 లక్షలలోపు రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పాడన్నారు. వరికి క్వింటాలుకు రూ.5 వందల బోనస్ ఇస్తానన్నది కూడా రేవంత్రెడ్డియేనన్నారు. మహిళ లకు రూ.2,500 ఇస్తానని, ఫించన్ రూ.4 వేలకు పెంచుతానని, కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.లక్ష తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల కోడ్ రాకముందే జీవోలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. కోడ్ పేరుతో తప్పించుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బుడ్డర ఖాన్, చిల్లర మాటలు బంద్‌జేసి పాలన మీద దృష్టి పెట్టాలని హితవుపలికారు. లంకెబిందెలంటూ... బడే బాయ్ అంటూ.. కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడవాలని రేవంత్‌రెడ్డి చూస్తున్నారని, పార్లమెంట్ ఎన్నికల తరువాత రేవంత్‌రెడ్డి మరో ఏక్నాథ్ శిందే లాగా మారుతారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్‌రెడ్డి సగం కాంగ్రెస్, సగం బీజేపీ మనిషి అని విమర్శించారు. తప్పుడు ప్రచారం వల్లే కామారెడ్డిలో ఓటమి.. కామారెడ్డిలో భూములు గుంజుకుంటరంటూ తప్పుడు ప్రచారం జరగడం వల్లే ఓటమి ఎదురయ్యిందని కేటీఆర్ పేర్కొన్నారు. త్వరలోనే బీఆర్ఎస్కు పూర్వ వైభవం వస్తుందని కామారెడ్డి నుంచే జైత్రయాత్ర మొదలుపెట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. -
‘తెలంగాణలో పాగా వేయబోతున్న బీజేపీ’
ఢిల్లీ: బీఆర్ఎస్ నుంచి ప్రముఖ నాయకులు బీజేపీలో చేరుతున్నారని, కాంగ్రెస్, బీఆర్ఎస్ల పట్ల ప్రజలకు విశ్వాసం సడలి పోయిందని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు. ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘అన్ని పార్టీల నుంచి వలసలు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వం కోసం జరుగుతున్నాయి. తెలంగాణలో బీజేపీ పాగా వెయ్యబోతోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్‌కు దారి ఏర్పడుతుంది. దక్షిణాదిన బీజేపీ పెద్ద ఎత్తున గెలువబోతోంది. ప్రాంతీయ పార్టీలు వాళ్ళ బిడ్డల కోసం ప్లాన్ చేస్తున్నారు. మోదీ మాత్రమే దేశం కోసం ఆలోచిస్తున్నారు’ అని కె.లక్ష్మణ్ అన్నారు. -
ఓడితే మగాడు కాదా?.. కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు
సాక్షి, కామారెడ్డి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ చిల్లరగా మాట్లాడటం ఇకనైనా మానాలని.. తన సవాల్‌కు స్పందించి మల్కాజ్‌గిరిలో గెలిచి దమ్మేంటో నిరూపించుకోవాలని అన్నారు. ఎన్నికల్లో గెలిస్తే మగాడు.. ఓడితే మగాడు కాదా?. నా సవాల్‌ను రేవంత్ రెడ్డి ఎందుకు స్వీకరించడం లేదు. మల్కాజ్‌గిరిలో ఇద్దరం పోటీ చేద్దాం.. ఎవరు మగాడో తేల్చుకుందాం అని రేవంత్‌ను కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. మా అయ్య పేరు కేసీఆర్. నేను ఉద్యమం చేసి రాజకీయాల్లోకి వచ్చా. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా. అంతేగానీ రేవంత్‌రెడ్డిలాగా రాంగ్ రూట్లో రాలేదు. ఆంధ్రోళ్ల బూట్లు నాకి, పార్టీ మారి రేవంత్ సీఎం అయ్యారు. కారు కూతలు, చిల్లర మాటలు రేవంత్ ఇకనైనా మానుకోవాలి. సీఎంలాగా హుందాగా మాట్లాడాలి.. .. మేడిగడ్డలో 85 పిల్లర్లు ఉంటే.. అందులో మూడు కుంగిన మాట వాస్తవం. అంతేకానీ కాళేశ్వరం, మేడిగ్డ కొట్టుకుపోలేదు. మూడు నెలల సమయంలో ఈ ప్రభుత్వానికి పిల్లర్లు బాగు చేసే సమయం దొరకడం లేదా?. ఈ నెల 17వ తేదీ వరకు ఓపిక పడతాం. కాంగ్రెస్ పాలన వంద రోజులు అయ్యాక ప్రజల్లోకి వెళ్తాం. గొర్రె కసాయివాడ్ని నమ్మినట్లు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మారు. రుణమాఫీ చేయకపోతే రైతులు కాంగ్రెస్ భరతం పడతారు అని కేటీఆర్ హెచ్చరించారు. ఇక చివర్లో.. కామారెడ్డి ఫలితం చేదు అనుభవం మిగిల్చిందన్న కేటీఆర్ ఆ ఎన్నికలపై చర్చ వద్దంటూ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. -
TS Congress: భట్టి విక్రమార్కపై వీహెచ్ సంచలన ఆరోపణలు
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై సీనియర్ నేత హన్మంతరావు సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుందోని వీహెచ్ వ్యాఖ్యలు చేశారు. కాగా, వీహెచ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘భట్టి విక్రమార్క నాకు ఖమ్మం లోక్‌సభ సీటు రాకుండా చేస్తున్నారు. భట్టి నాకు ద్రోహం చేస్తున్నారు. సీటు రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో నాకు తెలియడం లేదు. మొదట సీటు ఇస్తా అన్నారు.. ఇప్పుడు నన్ను పట్టించుకోవడం లేదు. ఈరోజు భట్టి పార్టీలో ఆ స్థానంలో ఉన్నాడంటే అందుకు నేనే కారణం. భట్టిని ఎమ్మెల్సీని చేసింది నేనే. నా కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లో లేరు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాకు న్యాయం చేయాలి. నేను లోకల్ కాదు అంటున్నారు. రేణుకా చౌదరి, నాదెండ్ల భాస్కర్, రంగయ్య నాయుడు లోకలా?. పార్టీ కోసం పదవులు ఆశించకుండా పనిచేసిన నాకు న్యాయం చేయండి. ఖమ్మం లోక్‌సభ సీటు నాకు కేటాయిస్తే ఖచ్చితంగా గెలుస్తాను. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోంది. బీసీల ఓట్లు కాంగ్రెస్‌కు అవసరం లేదా?. బీసీలు కేవలం ఓట్లు వేసే మిషన్లు మాత్రమేనా?. రాహుల్ గాంధీ న్యాయ్ యాత్ర, కుల గణన అంటున్నారు. రాహుల్ అయినా నాకు న్యాయం చేయాలి. ఖమ్మం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తే నేను తప్పుకుంటాను. లేకపోతే ఖమ్మం నుంచి పోటీకి నేనే అర్హుడిని. నేను పార్టీ కోసం పనిచేశాను. నేను చనిపోయే వరకు పార్టీలోనే ఉంటాను. చనిపోయిన తరువాత పార్టీ జెండా నాపై ఉంటుంది. నేను పార్టీ మారే వ్యక్తిని కాదు. నేను పార్టీలో ఎందరికో సహాయం చేశాను. నా వయసు నాకు అడ్డంకి కాదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
TS: బీజేపీ బిగ్ ప్లాన్.. పార్టీలో చేరుతున్న ముగ్గురికి టికెట్స్!
సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు చేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ చేరుతున్న నేతలకు టికెట్ ఇచ్చే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నేడు ముగ్గురు సీనియర్ నేతలు బీజేపీలో చేరుతున్నట్టు సమాచారం. అయితే, రేపు(సోమవారం) బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ క్రమంలో రెండో జాబితాలను అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా ఎనిమిది మంది అభ్యర్థుల ఎంపికపై రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి అధిష్టానాకికి జాబితాను పంపించారు. ఇక, నిన్న(శనివారం)రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కిషన్‌రెడ్డి భేటీ కూడా అయ్యారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో చర్చలు జరిపారు. కాగా, తెలంగాణలో పార్టీలో చేరికపై బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో సీతారాంరాయక్, నగేష్, జలగం వెంకట్రావ్‌ను బీజేపీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. వీరు ముగ్గురు ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నట్టు సమాచారం. ఇక, వీరు బీజేపీలో చేరిన అనంతరం, పలు పార్లమెంట్ స్థానాల్లో వీరికే సీట్లు ఇస్తున్నట్టు పలువురు పార్టీ నేతలు లీకులు ఇస్తున్నారు. సీఈసీ పరిశీలనలో ఉన్న పేర్లు 1. మహబూబ్‌నగర్ :డీకే అరుణ 2. మహబూబాబాద్ : సీతారాం నాయక్ 3. ఖమ్మం : జలగం వెంకట్రావుఔ 4. ఆదిలాబాద్ : నగేష్ 5. వరంగల్ : కృష్ణ ప్రసాద్ 6. నల్గొండ: మనోహర్ రెడ్డి 7. పెద్దపల్లి : ఎస్ కుమార్/ మిట్టపల్లి సురేంద్ర 8. మెదక్: రఘునందన్ రావు/ అంజిరెడ్డి.