నీటమునిగిన మధుర మీనాక్షి ఆలయం | Madurai: Heavy rains inundate Meenakshi temple | Sakshi
Sakshi News home page

వరద ముంపులో మీనాక్షి ఆలయం

Oct 6 2017 11:37 AM | Updated on Aug 1 2018 4:01 PM

 Madurai: Heavy rains inundate Meenakshi temple - Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడులోని దక్షిణాది జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వారం రోజులుగా మధురై, సేలం, తిరునెల్వేలి జిల్లాల్లో భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. మధురైలో గురువారం నుంచే కుండపోతగా వర్షం కురుస్తండటంతో నగరంలో పలు రహదారులు జలాశయాలుగా మారాయి. వర్షపు నీరు లోతట్టు ప్రాంతంలోని మధురై మీనాక్షి ఆలయంలోకి చేరడంతో ఆలయ ప్రాంగణంతో పాటు మూలస్థానం కూడా వరద నీటిలో చిక్కుకుంది. ఉత్తర దిశ నుండి తూర్పు దిశకు వరద నీరు వేగంగా పోటెత్తడంతో ఆలయం జలాశయాన్ని తలపించింది. దీంతో ఆలయానికి వచ్చిన ‌భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆలయ సిబ్బంది వరద నీటిని బయటకు పంపేందుకు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేదు. వర్షం కురుస్తుండటంతో భక్తులకు ఇబ్బందిగా మారింది.

శుక్రవారానికి ఉదయానికి వర్షం కొంత తెరపి ఇవ్వడంతో ఆలయాన్ని శుద్ధి చేసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే మరో మూడు రోజులపాటు దక్షిణాదికి భారీ వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం తెలపడంతో ఆయా జిల్లాల కలెక్టర్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గడిచిన 48 గంటల్లో మధురైలో 21 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా, తిరునెల్వేలిలో అత్యధికంగా 27 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. తిరునెల్వేలిలోని కుట్రాలం జలపాతాలు వరద నీటితో ప్రమాదస్థాయిలో ప్రవహిస్తుండటంతో పర్యాటకుల సందర్శనకు అధికారులు నిషేధం విధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement