
డంపింగ్ యార్డు నిర్వాహకుడి అరెస్ట్
తాలూకాలోని కణికేనహళ్లి వద్ద ఉన్న రేస్‌కోర్స్ వ్యర్థాల డంపింగ్ సెంటర్‌ను మూసివేసి, అక్కడి నుంచి తొలగించాలని....
► తహశీల్దార్‌నే బెదిరించిన రజత్
► గంటల వ్యవధిలోనే అరెస్టు చేసిన పోలీసులు
దొడ్డబళ్లాపురం : తాలూకాలోని కణికేనహళ్లి వద్ద ఉన్న రేస్‌కోర్స్ వ్యర్థాల డంపింగ్ సెంటర్‌ను మూసివేసి, అక్కడి నుంచి తొలగించాలని డిమాండు చేస్తూ చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఏ.25న భారీ ఆందోళన చేస్తామని హెచ్చరించడంతో స్థానిక ఎమ్మెల్యే వెంకట రమణయ్య తహశీల్దార్ రమేశ్‌కుమార్‌తో కలసి శనివారం సాయంత్రం డంపింగ్ సెంటర్‌ను పరిశీలించారు. ఊహించిన దానికంటే సమస్య తీవ్రత ఎక్కువగా ఉందని భావించిన తహశీల్దార్ డంపింగ్ సెంటర్ యజమాని రజత్‌ను పిలిపించుకుని తక్షణం దాన్ని మూసివేయాలని, అనుమతులు లేకుండా నిబంధనలకు వ్యతిరేకంగా డంపింగ్ సెంటర్ నిర్వహిస్తున్నందుకు కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. తహశీల్దార్ హెచ్చరికలు ఖాతరు చేయని రజత్ ఎమ్మెల్యే వెంకటరమణయ్య సమక్షంలోనే బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో తహశీల్దార్ రమేశ్‌కుమార్ నేరుగా వెళ్లి దొడ్డబెళవంగల పోలీస్ స్టేషన్‌లో రజత్‌పై ఫిర్యాదు చేసారు.
అదేవిధంగా అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా డంపింగ్ సెంటర్ నడుపుతున్నందుకు, గ్రామాల పరిసరాలను కలుషితం చేసినందుకు పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసారు. దొడ్డబెళవంగల పీఎసై ్స శ్రీనివాస్ రజత్‌ను అరెస్టు చేసారు. రాత్రి 8 గంటల సమయంలో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచారు. ఇంకేం జైలుకు పంపించాలని పోలీసులు సిద్ధమవుతుండగా అనారోగ్యమంటూ రజత్ నాటకాలు ప్రారంభించాడు.
అర్ధరాత్రి వరకూ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రజత్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అదే సమయానికి ఆస్పత్రికి విచ్చేసిన రజత్ మద్దతుదారులు తాము మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్రమంత్రికి బంధువులమని అంతుచూస్తామని చిందులువేసారు. ఎట్టకేలకు రజత్ ను పోలీసులు జైలుకు పంపించారు. సమస్య పరిష్కరించబడడంతో గ్రామాల ప్రజలు సోమవారం తలపెట్టిన ఆందోళనను విరమించుకున్నారు.