
అదో డబ్బా బడ్జెట్
రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం ఉదయాన్నే బడ్జెట్‌ను దాఖలు చేశారు. రెండో సారిగా అమ్మ ప్రభుత్వ
సాక్షి, చెన్నై : రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం ఉదయాన్నే బడ్జెట్‌ను దాఖలు చేశారు. రెండో సారిగా అమ్మ ప్రభుత్వ పగ్గాలు చేపట్టడంతో బడ్జెట్ మీద ఎదురు చూపులు పెరిగాయి. పగ్గాలు చేపట్టగానే, వాగ్దానాలు కొన్ని అమలుకు సంతకాలు పెట్టిన అమ్మ జె జయలలిత ఉచితాలకు బాగానే నిధుల కేటాయింపులు ఉంటాయన్న భావన బయలు దేరింది. అయితే, ఆ ఊసే లేకుండా బడ్జెట్ ప్రసంగం సాగడంతో ప్రతి పక్షాలు విమర్శలు గుప్పించే పనిలో పడ్డాయి. సభ నుంచి బయటకు వస్తూ ప్రధాన ప్రతి పక్షనేత ఎంకే స్టాలిన్ మీడియా ముందుకు వచ్చారు.
అదో ఖాళీ పేపర్, పసలేదు...అంతా అమ్మ భజనే అంటూ ఎద్దేవా చేశారు. రెండు గంటల పాటుగా సాగిన పన్నీరు ప్రసంగంలో ఎక్కువ సమయాన్ని తన అమ్మభక్తిని చాటుకునేందుకే కేటాయించడం విచారకరంగా పేర్కొన్నారు. యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే, ప్రభుత్వ ఉద్యోగులు తమ డిమాండ్ల మీద ఒత్తిడి తెస్తుంటే, రాష్ట్రంలో రాజ్యమేలుతున్న నేరగాళ్లను అణచి వేయడానికి చర్యలు తీసుకోకుండా ఏదో మొక్కుబడి సభ ముందుకు వచ్చినట్టుందని ధ్వజమెత్తారు. ప్రజలకు నమ్మకం కల్గించే విధంగా ఏ ఒక్క అభివృద్ధి లేదని, నిధుల కేటాయింపులూ లేవని ఆగ్రహం వ్యక్తం చేశా రు.
2011లో లక్షా 20 వేల కోట్ల అప్పు ఉన్నట్టు, దీన్ని తీర్చి తన సత్తా చాటుతామన్న ఈ ప్రభుత్వం, ఇప్పుడు అప్పుల చిట్టాను రెండు లక్షా 52 వేల కోట్లకు పెంచి ఉండటం చూస్తే, వారి పాలనా తీరు ఏ పాటితో అర్థం చేసుకోవాల్సింది ప్రజలేన ని హితవు పలికారు. అప్పుల చిట్టాను ప్రకటించి, వాటిని తీర్చేందుకు తగ్గ మార్గాలను సూచించకపోవడం బట్టి చూస్తే, మరింత భారం ప్రజల నెత్తిన మరి కొన్ని నెలల్లో పడే అవకాశాలు ఎక్కువేనని ఆం దోళన వ్యక్తం చేశారు. నిధులకు ఆధారాలు లేవు, కేటాయింపులు లేవు, ఖాళీ...డబ్బా అంటూ ముందుకు సాగారు.
ప్రతి పక్షాల విసుర్లు:
రాష్ట్ర బడ్జెట్‌పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించే పనిలో పడ్డాయి. పీఎంకే నేత రాందాసు పేర్కొంటూ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉచిత సెల్ ఫోన్లు, యాభై శాతం రాయితీతో మహిళలకు ద్విచక్ర వా హనాలు అన్న వాగ్దానాలు చేసిన ఈ పాల కులు, ఆ ఊసే లేకుండా బడ్జెట్‌ను దాఖలు చేసి ఉండటం సిగ్గు చేటుగా అభివర్ణించా రు. ఆగస్టు పదిహేను తర్వాత ఆ వాగ్దానాల అమలు ఉంటుందన్నట్టుగా ప్రచారాలు సాగించి, ప్రజల మదిలో ఆశల్ని రేకెత్తించి ఇప్పుడేమో కేటాయింపులు లేకుం డా ముగించి ఉన్నారని మండి పడ్డారు. అత్తి కడవు అవినాశి పథం అంటూ తాత్కాలిక బడ్జెట్‌లో ప్రస్తావించిన వాళ్లు, అధికారంలోకి వచ్చాక ఆ ప్రస్తావనను బడ్జెట్లో తీసుకురాక పోవడం బట్టి చూస్తే, ఏ మేరకు ప్రజల్ని మోసగించేందుకు సిద్ధం అయ్యారో అర్థం చేసుకోవాలన్నారు.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ పేర్కొంటూ, పసలేని ఈ బడ్జెట్‌ను బట్టి చూస్తే, ప్రజలకు మున్ముందు ప్రభుత్వం ఏ మేరకు మంచి పనులు చేస్తుందో అన్నది అనుమానమేనని వ్యాఖ్యానించా రు. సీపీఎం నేత జి రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్, డీఎండీకే అధినేత విజ యకాంత్, ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, తమిళ మానిల కాం గ్రెస్ నేత జీకే వాసన్ బడ్జెట్‌తో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ధ్వజమెత్తారు. ఇక, రైతు సంఘాల నాయకులు అగ్గిమీద బుగ్గి లా మండి పడుతున్నారు.
ఇక, ఉద్యోగ సంఘాల నాయకులు తమకు ఆశల్ని చూపించి మోసం చేశారని మండి పడుతున్నారు. ఎన్నికల సమయంలో వాగ్దానాలు ఇచ్చి, ఇప్పుడు ఎలాంటి ఊసు లేకుండా బడ్జెట్ దాఖలు చేసి ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల సమయంలో ప్రకటించిన ఉచిత మిక్సీ గ్రైండర్ మెజారిటీ శాతం మంది లబ్దిదారులకు ఇంటా చేరలేదని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆ వాగ్దానం రద్దు చేయడంతో లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.