పోలీస్‌ కవచం

Special Funds And Protection For Inter caste marriages In Tamil Nadu - Sakshi

కులాంతర వివాహలకు రక్షణ

వధూవరుల కోసం నిధుల కేటాయింపు

ఎస్పీల నేతృత్వంలో జిల్లాల్లో ప్రత్యేక సహాయకేంద్రాలు

కులాంతర వివాహాలు చేసుకోదలిచారా..? పెద్దల చేతిలో పరువు హత్యలకు గురవుతామని భీతిల్లుతున్నారా..? ఇక మీకా బెంగలేదు. ఇలాంటి జంటలకు అన్ని విధాల అండదండలను కల్పిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానం సాక్షిగా ప్రకటించింది.

సాక్షి ప్రతినిధి, చెన్నై: మదురై జిల్లా ఉసిలంపట్టికి చెందిన వీరన్‌ కుమార్తె విమలాదేవిని అతని వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న దిలీప్‌కుమార్‌ 2014లో ప్రేమవివాహం చేసుకున్నాడు. ఇద్దరూ వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారు కావడంతో అదే ఏడాది అక్టోబరులో విమలాదేవిని ఆమె తల్లిదండ్రులు బలవంతంగా ఇంటికి తెచ్చేసుకున్నారు. ఆ తరువాత కొన్నాళ్లకు విమలాదేవి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అంతేగాక ఎవరికీ తెలియకుండా దహన సంస్కారాలు చేశారు. దీనిపై విమలాదేవి భర్త దిలీప్‌కుమార్‌ మద్రాసు హైకోర్టులో కేసు వేశారు. ఈ పిటిషన్‌ విచారించిన న్యాయమూర్తి  రామసుబ్రమణియన్‌ 2016 ఏప్రిల్‌లో తీర్పు చెప్పారు. పోలీసు అధికారులు చట్టాన్ని అతిక్రమించి పంచాయితీ ముఠాతో కుమ్మక్కుగా వ్యవహరించారు. ఈ కారణంగా సంబంధిత అధికారులపై చట్ట ప్రకారం తగిన చర్య తీసుకోవాలని తీర్పులో పేర్కొన్నారు. ఇలాంటి పరువు హత్యలను అడ్డుకునేందుకు, కులాంతర వివాహాలు చేసుకునేవారికి రక్షణ కల్పించాలని,  జిల్లాల వారీగా సాంఘిక సంక్షేమశాఖ, ఆదిద్రావిడ సంక్షేమ శాఖల అధికారులతో కూడిన ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలను న్యాయమూర్తి ఆదేశించారు. ఈ ప్రత్యేక విభాగం 24 గంటలు పనిచేసేలా ప్రత్యేక సహాయక కేంద్రాలను నెలకొల్పాలని తీర్పులో సూచించారు.

ఉత్తర్వులు అమలుచేయలేదని పిటిషన్‌
కోర్టు ఉత్తర్వులను తమిళనాడు ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయలేదని ఆరోపిస్తూ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిపై కులవివక్ష నిర్మూలన సంఘం రాష్ట్ర కార్యదర్శి సామువేల్‌రాజ్‌.. మద్రాసు హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను గతంలో దాఖలు చేశారు. ఈ కేసు న్యాయమూర్తి ఎమ్‌.సత్యనారాయణన్‌ ముందుకు ఇటీవల విచారణకు వచ్చింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రత్యేక విభాగాలు అన్ని జిల్లాల్లో ఏర్పాటైనట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది ఇటీవల బదులు పిటిషన్‌ వేశారు. విమలాదేవీ కేసులో చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన చెక్కానురాణి ఇన్‌స్పెక్టర్‌ సుకుమార్, వత్తలగుండు ఇన్‌స్పెక్టర్‌ వినోద్, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆనంది, ఉసిలంపట్టి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాణిలపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నామని అందులో పేర్కొన్నారు. మూడేళ్ల పాటు వారందరికీ ఇంక్రిమెంట్లు కట్‌ చేసినట్లు తెలిపారు. డీఐజీ లేదా ఎస్పీల నేతృత్వంలో ప్రత్యేక విభాగాలు, ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటుచేసి ఫోన్‌ నంబర్లను ప్రచారం చేశారు. ఈ ఫోన్‌ నంబర్లు, ఇతర వివరాలను పోలీస్‌ వెబ్‌సైట్‌లో పొందుపరచాలని ఏప్రిల్‌ 10వ తేదీనే ఆదేశించినట్లు తెలిపారు. కులాంతర వివాహాలు చేసుకునే వారు ఈ ఫోన్‌ నంబర్‌ లేదా ఆన్‌లైన్‌ మూలంగా సమాచారం ఇవ్వవచ్చు. వధూవరులు కోరినట్లయితే సమీప పోలీస్‌స్టేషన్‌లోని ఇన్‌స్పెక్టర్‌ తగిన భద్రత కల్పించడంతోపాటు వారిపై నిరంతర నిఘా పెడతారు.

నిధుల కేటాయింపు
పరువు హత్యలను పూర్తిగా అరికట్టేందుకు ప్రభుత్వం నిధులను సైతంకేటాయించింది. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి తాత్కాలికంగా బస, రక్షణ, ఇరుకుటుంబాల మధ్య సామరస్యపూర్వక చర్చలకు కౌన్సెలింగ్‌ నిపుణుల కేటాయింపు చేశారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రక్షణ, సహకారం అందించని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటారు. అన్ని చర్యలు చేపట్టిన కారణంగా ప్రభుత్వంపై వేసిన కోర్టు ధిక్కరణ కేసును కొట్టివేయాలని బదులు పిటిషన్‌లో న్యాయవాది కోరారు. ఈ కేసును న్యాయమూర్తి ఆగస్టు 9వ తేదీకి వాయిదావేశారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top