విధానసభ ఎన్నికల గడువు దగ్గరపడుతుండడంతో క్షేత్రస్థాయిలో ప్రచార పర్వానికి కాంగ్రెస్ పార్టీ తెర తీసింది.
సాక్షి, న్యూఢిల్లీ:విధానసభ ఎన్నికల గడువు దగ్గరపడుతుండడంతో క్షేత్రస్థాయిలో ప్రచార పర్వానికి కాంగ్రెస్ పార్టీ తెర తీసింది. ఇప్పటికే బీజేపీ, ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) ప్రచారం ప్రారంభించగా కొంత ఆలస్యంగా కాంగ్రెస్ నాయకులు రంగంలోకి దిగారు. ప్రత్యర్థులతో పోలిస్తే ఆలస్యంగా ప్రచారం ప్రారంభించినా మందుకు దూసుకెళ్లేందుకు అన్ని విధాలా సిద్ధమయ్యామని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. సోమవారం రాత్రి న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పిలాంజీ గ్రామంలో తమ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ అధికారికంగాప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనలోని విజయాలను గుర్తు చేయడంతోపాటు బీజేపీ, ఆప్‌పై విమర్శలు గుప్పించారు. మరోమారు కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే ఢిల్లీ నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చేపట్టిన అభివృద్ధిపై నివేదిక ఇచ్చే ప్రయత్నం చేశారు.
నగర ప్రతిష్ట పెంచాం:
తమ పాలనలో రాజధానిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతోపాటు ఢిల్లీ ప్రతిష్టను పెంచేందుకు కార్యక్రమాలు చేపట్టామన్నారు. దేశంలోనే అత్యధికంగా రూ.2,01,381 తలసరి ఆదాయంతో ఢిల్లీ నగరం దేశంలోనే ప్రథమస్థానంలో ఉందన్నారు. ఢిల్లీలో అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇవి కాకుండా ప్రపంచస్థాయిలో ఆస్పత్రులు, మౌలిక వసతులు కల్పించామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీలు సహా ఆర్థికంగా వెనుకబడిన అన్ని తరగతుల ప్రజలకు మేలు చేసేలా ఎన్నో సంక్షేమ పథకాలను రూపొందించిన ఘనత తమ సర్కార్‌కే దక్కుతుందని సీఎం పేర్కొన్నారు. ‘పదిహేనేళ్లలో నగరంలోని రోడ్లు పూర్తిగా మారిపోయాయి. ట్రాఫిక్‌జామ్‌లు లేకుండా అవసరమైన అన్ని చోట్లా ఫ్లైఓవర్లు నిర్మించాం. రోడ్ల విస్తరణ పనులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. సిగ్నీచర్ బ్రిడ్జి నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చిందన్నారు. ఢిల్లీ మెట్రోరైలు ఫేజ్-3 పనులు పూర్తయితే వివిధ కాలనీలతోపాటు వందల ప్రదేశాలకు ప్రయాణికులు సులువుగా చేరుకోవచ్చు’ అని ఈ సందర్భంగా ఆమె విశదీకరించారు.
కాంగ్రెస్ ప్రచారానికి దలేర్ మెహందీ పాటలు
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రముఖ పాప్ గాయకుడు దలేర్ మెహందీ సేవలు వినియోగించుకుంటోంది. అతడు కంపోజ్ చేసి పాడిన పాటలను ప్రచారంలో వినియోగించుకుంటున్నట్లు మంగళవారం ఆ పార్టీ నాయకుడు ఒకరు తెలిపారు. హిందీలో మూడున్నర నిమిషాల నిడివి ఉన్న పాటను దలేర్ పాడారన్నారు. ‘కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు కొనసాగిస్తామని, ఆ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొస్తామని ఢిల్లీ వాసులు అంటున్నారు..’ అనేది ఆ పాట సారాంశం. మెహందీ గత సెప్టెంబర్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అతడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేయనున్నాడు.
చులకన చేస్తే ఊరుకోం...
తమ ప్రభుత్వం ఢిల్లీని ఎంతగానో అభివృద్ధి చేసిందని, తమ ప్రభుత్వ కృషిని తక్కువ చేసి చూపరాదని ఢిల్లీ బీజేపీని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ హెచ్చరించారు. ‘మమ్మల్ని తక్కువగా అంచనా వేయొద్దు. మా పాలనలో ఢిల్లీలో అనేక మార్పులు వచ్చాయి. ఉపాధి కోరుకుంటున్న అనేక మందికి ఢిల్లీ ఆకర్షణీయమైన ప్రదేశంగా మారింది’ అని ఆమె చెప్పారు. గత పదేళ్లలో కరెంటు కనెక్షన్లు పెరిగాయని, ఇప్పుడు ఢిల్లీలో 99.9 శాతం ఇళ్లకు కరెంటు ఉందన్నారు. వీధి దీపాల సంఖ్య సంఖ్య 2 లక్షల నుంచి 5 లక్షలకు పెరిగిందని ప్రకటించారు. 1993-1998 వరకు ఐదేళ్లలో బీజేపీ ముగ్గురు సీఎంలను మార్చిందని గుర్తు చేశారు. అధికారం కోసం అభివృద్ధిని పక్కన పెట్టార ని విమర్శించారు.
ముఖ్యమంత్రులను మార్చే ప్రభుత్వం కావాలో, స్థిరంగా ఉంటూ అభివృద్ధికి పాటుపడే ప్రభుత్వాన్ని తేవాలో ప్రజలే తేల్చుకోవాలని సూచించారు. తాము అధికారంలోకి వస్తే 30 శాతం విద్యుత్ చార్జీలు తగ్గిస్తామంటూ బీజేపీ, ఆమ్‌ఆద్మీపార్టీ ప్రజలను మోసపూరిత హామీలతో మభ్యపెడుతున్నాయని అన్నారు. ప్రతిపక్షాల హామీలు సత్యదూరమని దుయ్యబట్టారు. 30 శాతం విద్యుత్ చార్జీలు తగ్గించడం అంటే కరెంటు సరఫరాను 30 శాతం తగ్గించడమే అన్నారు. సరఫరా నిలిచిపోయి అంధకారంలో ఉండేందుకు రాజధానివాసులు సిద్ధంగా ఉండబోరని భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.
ప్రజలకు మేలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే విద్యుత్‌చార్జీల్లో సబ్సిడీ ఇస్తోందని పేర్కొన్నారు.దీంతోపాటు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఏడో వేతన సవరణ విషయంలో తీసుకున్న నిర్ణయంతో న్యూఢిల్లీ అసెంబ్లీ పరిధిలోని వారితో సహా 80 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుందన్నారు. రాజధానిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలంటే మరోమారు కాంగ్రెస్‌ను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చతర్‌సింగ్, ఎమ్మెల్యే అనిల్ చౌదరి పాల్గొన్నారు.