ఢిల్లీ అసెంబ్లీలోని 70 స్థానాల్లో 67 స్థానాలను గెలవడం కూడా ఆమ్ ఆద్మీకి సమస్యగా మారింది. ఎన్నో ఆశలతో గెలిచిన ఇంతమంది ఎమ్మెల్యేల సేవలను వినియోగించుకోవడం...
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలోని 70 స్థానాల్లో 67 స్థానాలను గెలవడం కూడా ఆమ్ ఆద్మీకి సమస్యగా మారింది. ఎన్నో ఆశలతో గెలిచిన ఇంతమంది ఎమ్మెల్యేల సేవలను వినియోగించుకోవడం కోసం ఆప్ సర్కారు కొత్త ప్రయోగాలు చేస్తోంది. 21 మంది ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రకటించారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించడం సాధారణంగా పాటించే సాంప్రదాయం. అయితే కొత్త ఆనవాయితీకి తెరతీస్తూ 21 మందికి ఈ పదవి కట్టబెట్టనుంది.
వీరు వేతనభత్యాలు లేకుండా పార్లమెంటరీ సెక్రటరీలుగా పనిచేస్తారని సిసోడియా చెప్పారు. ఒక్కొక్క మంత్రి వద్ద ఒకటి కన్నా ఎక్కువ శాఖలు ఉన్నందువల్ల వారు తమ శాఖలపై పూర్తి దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారని, తమ శాఖల నిర్వహణలో వారికి పార్లమెంటరీ సెక్రటరీలు సహాయపడతారని ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం మనీష్‌తో సహా ఒక్కో మంత్రికి నలుగురైదుగురు పార్లమెంటరీ సెక్రటరీలను జతచేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
వారు తమ ఇన్‌చార్జి మంత్రి ఆదేశాల మేరకు పనిచేస్తూ పనులు వేగంగా, సమర్థంగా జరిగేలా చూస్తారని ప్రభుత్వం అంటోంది. సచివాలయంలో తమకు కేటాయించిన కార్యాలయాల నుంచి పనిచేసే పార్లమెంటరీ సెక్రటరీలకు ఎలాంటి వేతనభత్యాలు ఇవ్వబోమని ప్రభుత్వం తెలిపింది. అంతకుముందు ప్రభుత్వం 11 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీ డెవలప్‌మెంట్ కమిటీ చైర్మన్లుగా నియమిస్తూ గురువారం ప్రకటన జారీచేసింది.