శిశువు ప్రాణం తీసిన నోట్ల రద్దు ! | new born baby died in mumbai hospital due to currency demonetization | Sakshi
Sakshi News home page

శిశువు ప్రాణం తీసిన నోట్ల రద్దు !

Nov 12 2016 9:10 PM | Updated on Oct 17 2018 3:53 PM

శిశువు ప్రాణం తీసిన నోట్ల రద్దు ! - Sakshi

శిశువు ప్రాణం తీసిన నోట్ల రద్దు !

రద్దు చేసిన పెద్ద నోట్లు ఆస్పత్రి సిబ్బంది స్వీకరించకపోవడంతో ఓ పసికందు మృతి చెందింది.

ముంబై: రద్దు చేసిన పెద్ద నోట్లు ఆస్పత్రి సిబ్బంది స్వీకరించకపోవడంతో ఓ పసికందు మృతి చెందింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన ముంబై గోవండీలోని జీవన్‌జ్యోత్ నర్సింగ్ హోం ఆస్పత్రిలో చోటుచేసుకుంది. బాలుడి తండ్రి జగదీశ్ శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేగాకుండా పోలీసులు మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయాలని ఆయనకు సలహా ఇచ్చారు.

వివరాల్లోకి వెళితే... గోవండీకు  చెందిన జగదీశ్ భార్య కిరణ్‌కు పురిటి నొప్పులు రావడంతో బుధవారం జీవన్‌జ్యోత్ ఆస్పత్రికి తరలించారు. ప్రసవం తరువాత బాలుడు తక్కువ బరువుతో ఉండటంతో వైద్యం ప్రారంభించారు. శిశువు ఆరోగ్యం క్షీణించటంతో అత్యవసర విభాగంలో ఉంచేందుకు రూ.6 వేలు డిపాజిట్ చేయాలని సూచించారు. కాని, జగదీశ్ వద్ద పాత రూ.500 నోట్లు ఉన్నాయి.

ఏటీఎంలు కూడా పనిచేయక పోవడంతో డిపాజిట్ చేయలేక పోయాడు. దీంతో వైద్యం అందించేందుకు వైద్యులు నిరాకరించారు. సమీపంలో ఉన్న డాక్టర్ అమిత్ షా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు. అక్కడి చేరుకునేలోపు మార్గమధ్యలో పసికందు మరణించాడు. దీంతో తన బిడ్డ చనిపోవడానికి జీవన్‌జ్యోత్ ఆస్పత్రి సిబ్బందే కారణమని జగదీశ్ ఆరోపించారు. ఆస్పత్రి యాజమాన్యం ఆయన ఆరోపణలను తోసిపుచ్చింది.

పెద్ద నోట్లు స్వీకరించకపోవడం కాదని, మెరుగైన వైద్యం అందించే సౌకర్యం తమ ఆస్పత్రిలో లేదని, మరో ఆస్పత్రికి తరలించాలని సలహా ఇచ్చామని జీవన్‌జ్యోత్ ఆస్పత్రి డాక్టర్ కామత్ స్పష్టం చేశారు. అత్యవసర సమయంలో రద్దు చేసిన పెద్ద నోట్లు స్వీకరించాలని రెండు రోజుల కిందట ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశించారు. అయినప్పటికీ, ఓ పసికందు బలికావడంపై సంబంధిత మంత్రి ఆ ఆస్పత్రి యాజమాన్యంపై ఏం చర్యలు తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement