
కమల్,మౌళి కలయికలో కామెడీ చిత్రం?
విశ్వనాయకుడు కమలహాసన్, విభిన్న కథా చిత్రాల దర్శకుడు మౌళి కాంబినేషన్‌లో కామెడీ కథా చిత్రం తెర కెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
విశ్వనాయకుడు కమలహాసన్, విభిన్న కథా చిత్రాల దర్శకుడు మౌళి కాంబినేషన్‌లో కామెడీ కథా చిత్రం తెర కెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తూంగావనం చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్న కమలహాసన్ తదుపరి చిత్రం గురించి చర్చలు మొదలయ్యాయి. ఇటీవల కమర్షియల్, కుటుంబ కథా చిత్రాలను చేస్తున్న కమల హాసన్ దృష్టి మరోసారి హాస్యంపై మళ్లిందని సమాచారం. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అన్న చందాన కమల్ కోసం ఐదారుగురు దర్శకులు హాస్యభరిత కథలను వండి ఆయన కను సైగల కోసం ఎదురు చూస్తున్నారట.
అయితో కమలహాసన్ మాత్రం సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, మౌళిలలో ఒకరి దర్శకత్వంలో నటించాలని భావిస్తునట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇటీవల కమల్, దర్శకుడు మౌళి కలిసి కథా చర్చలు జరిపినట్లు తెలిసింది. ఇంతకు ముందు వీరి కలయికలో పంబల్ కే సంబంధం, నలదమయంతి వంటి వైవిధ్య భరిత చిత్రాలు రూపొందిన విషయం తెలిసిందే. తాజాగా కమలహాసన్, మౌళి మరో వినోదభరిత చిత్రానికి సృష్టి కర్తలు కావచ్చుననే టాక్ కోడంబాక్కంలో వినిపిస్తోంది.