రాష్ట్రంలో వంట గ్యాస్ సబ్సిడీని ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేసిన బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసే పథకాన్ని వచ్చే జనవరి నుంచి అన్ని జిల్లాల్లో...
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో వంట గ్యాస్ సబ్సిడీని ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేసిన బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసే పథకాన్ని వచ్చే జనవరి నుంచి అన్ని జిల్లాల్లో అమలు చేస్తున్నట్లు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) అధ్యక్షుడు, సిండికేట్ బ్యాంకు సీఎండీ సుధీర్ కుమార్ జైన్ తెలిపారు.
విధాన సౌధలో బుధవారం జరిగిన ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే మైసూరు, తుమకూరు, ధార్వాడ, ఉడిపి జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. నగదు బదిలీకి సంబంధించి ఇప్పటి వరకు 96,864 బ్యాంకు ఖాతాలను ప్రారంభించి, 32,031 డెబిట్ కార్డులను పంపిణీ చేశామని వెల్లడించారు. 63,998 ఖాతాలను ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేశామని తెలిపారు.
కాగా రెండు వేల కంటే తక్కువగా జన సంఖ్య ఉన్న గ్రామాల్లో బ్యాంకింగ్ సేవలను అందించే చర్యలు చేపట్టామని చెప్పారు. ఇదివరకే 3,862 గ్రామాల్లో బ్యాంకింగ్ కేంద్రాలను ప్రారంభించామన్నారు. గృహ, విద్య, అల్ప సంఖ్యాకులు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ప్రాధాన్యత క్రమంలో విరివిగా రుణాలు మంజూరు చేయాలని ఆయన బ్యాంకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌వీ. రంగనాథ్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.