
ఇంటికి తాళం పడితే చోరీ ఖాయం
తోరణగల్లు, తోరణగల్లు ఆర్‌ఎస్ ప్రాంతాల్లో దొంగతనాలు జోరందుకున్నాయి. దీంతో ఇంటికి తాళం వేసి ఊరెళ్లాలంటే స్థానికులు జంకుతున్నారు.
- తోరణగల్లులో దొంగతనాలు జోరు
- రికవరీ నిల్
- జాగ్రత్తగా ఉండాలని పోలీసుల ఉచిత సలహాలు
తోరణగల్లు : తోరణగల్లు, తోరణగల్లు ఆర్‌ఎస్ ప్రాంతాల్లో దొంగతనాలు జోరందుకున్నాయి. దీంతో ఇంటికి తాళం వేసి ఊరెళ్లాలంటే స్థానికులు జంకుతున్నారు. చెమటోడ్చి సంపాదించిన సొమ్ము చోరులపాలవుతుండటంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. మరో వైపు చోరీలకు సంబంధించి రికవరీ చేయడంలో పోలీసులు శ్రద్ధ చూపడం లేదనే విమర్శలున్నాయి.
గత ఏడాది ఇదేమాసంలో జిందాల్ పాతగేటు సమీపంలోని ఏటీఎంను దుండగలు ధ్వంసం చేసి డబ్బు దోచుకొన్నారు. ఆ తర్వాత తోరణగల్లు ఆర్‌ఎస్‌లోని ఏటీఎంను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. శంకరగుడ్డ కాలనీలోని టౌన్‌షిఫ్‌లో ఒకే రోజు 16 ఇళ్లలో చోరీలు జరిగాయి. లక్షలు విలువ చేసే బంగారు, నగదు దోచుకొన్నారు. తోరణగల్లు రైల్వేస్టేషన్‌లో ఆరు రోజులకొకసారి దుకాణాల్లో చోరీలు జరగడం మామూలైంది.
గత వారం తోరణగల్లులో ఒకేరోజు 16 ఇళ్లల్లో చోరీలు జరిగాయి. లక్ష లాది రూపాయలు విలువ చేసే బంగారు, నగదు చోరీకి గురైంది. దీంతో తోరణగల్లు గ్రామం,ఆర్‌ఎస్, జిందాల్ టౌన్‌షిప్‌ల్లోని నివాసులు చోరీలను నివారించడానికి రాత్రి పూట దుడ్డు కర్రలు పట్టుకొని గస్తీ తిరగడం పరిపాటైంది. పోలీసులు ఇంతవరకు ఒక్క దొంగను కూడా పట్టుకొన్న దాఖలాలు లేవు. పైగా మీ వస్తువులను మీరే జాగ్రత్తగా కాపాడుకోవాలంటూ పోలీసులు నోటీసులు అందజేస్తున్నారని దుకాణదారులు వాపోతున్నారు.
పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు
తోరణగల్లు ఆర్‌ఎస్‌లో మొబైల్ రిపేరీ, అమ్మకాల దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తున్నా. ఆరు నెలల క్రితం దుకాణంలో కొత్త మొైబైల్స్, నగదును దుండగులు దోచుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. పైగా మీ దుకాణాల్లో చోరీ జరగకుండా కాపాడుకోవడం మీదే బాధ్యత అని హెచ్చరిక పత్రం ఇచ్చారు.
- ఎస్.చిన్నా, మొబైల్ దుకాణం యజమాని, తోరణగల్లు
కష్టపడి సంపాదించన సొమ్ము దొంగలపాలైతే ఎలా?
తరచు చోరీలతో భీతిల్లుతున్నాం. రాత్రనక పగలక కష్టపడి కుటుంబం, పిల్లల చదువుకోసం సంపాదించిన డబ్బు దొంగల పాలైతే ఎంత వేదనకు గురవుతారో అధికారులు, పోలీసులు ఆలోచించాలి. కర్ణాటక, ఆంధ్ర, మహారాష్ట్ర, గుజరాత్, బీహార్ తదితర రాష్ట్రాల నుంచి పొట్టపోసుకోవడానికి వచ్చిన కార్మికుల ఇళ్లల్లో సైతం చోరీలు జరిగితే వాళ్లు ఎలా కోలుకొంటారు. - వరప్రసాద్, వ్యాపారి, తోరణగల్లు
చోరీల నివారణకు చర్యలు
తోరణగల్లులో చోరీలను అరికట్టడానికి గ్రామంలోను, ఆర్‌ఎస్, జిందాల్ టౌన్‌షిప్‌ల్లో పోలీసు గస్తీని ఏర్పాటుచేశాం. దొంగలను పట్టుకోవడానికి తనిఖీ బృందాన్ని ఏర్పాటుచేశాం. గ్రామస్తులు ఊళ్లకు వెళ్లే ముందు పోలీసు స్టేషన్‌లో తెలియజేయాలని నిబంధన పెట్టాం. చోరీల నివారణకు చర్యలు తీసుకొంటున్నాం.
- మహమ్మద్ రఫి,తోరణగల్లు ఎస్‌ఐ