పట్టాలు తప్పిన ఏర్కాడు ఎక్స్‌ప్రెస్‌

పట్టాలు తప్పిన ఏర్కాడు ఎక్స్‌ప్రెస్‌


చెన్నై: అరక్కోణం రైల్వే స్టేషన్‌ సమీపంలో ఏర్కాడు ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇంజన్‌, బోగీలు పట్టాలు తప్పాయి. చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌ నుంచి సోమవారం వేకువజామున బయల్దేరిన ఏర్కాడ్‌ ఎక్స్‌ప్రెస్‌ అరక్కోణం జంక‌్షన్‌ చేరుకుంటుండగా సిగ్నల్‌ లేక మెల్లగా ముందుకు సాగింది. ఈ సమయంలో రైలు ఇంజన్‌ సహా మూడు బోగీలు పట్టాలు తప్పాయి. బోగీలు విడిపోయి దాదాపు ఆరు అడుగుల దూరం దూసుకెళ్లాయి. రైలులో తమిళ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి అనన్బళగన్‌, మరికొందరు ప్రముఖులు, వేలాదిమంది ప్రయాణికులు ఉన్నారు. వేకువ జామున నిద్రలో ఉన్న సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటనతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు.



అయితే రైలు తక్కువ వేగంతో వెళ్తున్నందున పెనుప్రమాదం తప్పింది. వెంటనే అరక్కోణం మార్గంలోని రైళ్లను మధ్యలోనే నిలిపేశారు. దీంతో తిరుత్తణి, తిరుపతి ప్రాంతాలకు వెళ్లే రైళ్లు నిలిచిపోయాయి. చెన్నై వెళ్లే పదికిపైగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ప్రత్యేక రైల్లో చెన్నై రైలు బోగీల మరమ్మతు సిబ్బంది దాదాపు వెయ్యిమంది సంఘటనాస్థలానికి చేరుకుని పది గంటలకు పైగా కృషి చేసి పట్టాలు తప్పిన బోగీలను భారీ క్రేన్‌ సాయంతో తొలగించారు.



చెన్నై డివిజన్‌ జనరల్‌ మేనేజర్‌ నవీన్‌కులాతీ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు రైలు మార్గం పునరుద్ధరణ పనులు పర్యవేక్షించారు. ప్రమాదంపై ఉన్నతాధికారుల బృందం దర్యాప్తు చేపట్టింది. ప్రాథమికంగా సిగ్నల్స్‌ సమస్యతో రైలు పట్టాలు తప్పిందని సమాచారం. పట్టాలు తప్పిన ఇంజన్‌, బోగీలను క్రేన్‌ సాయంతో తొలగిస్తున్న సమయంలో అకస్మాత్తుగా క్రేన్‌ తాడు తెగడంతో అక్కడే ఉన్న రైల్వే సిబ్బంది అమన్‌కుమార్, కిషోర్‌కుమార్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే వేలూరు ఆసుపత్రికి తరలించారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top